Magazines

మైక్రోసాఫ్ట్‌లో భారీగా ఉద్వాసన !

1 గంట క్రితం

Microsoft
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 28, 2026 | 2 నిమిషాల చదవడం

వీఆర్‌ఎస్‌‌కు 60వేల మంది అర్హులు
భారత్‌ సహా నాలుగు దేశాల్లో తొలగింపులు
భారీగా వ్యయ నియంత్రణ చర్యలు


న్యూఢిల్లీ : టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ ‌వేలాది మంది ఉద్యోగులను తొలగించడానికి రంగం సిద్దం చేసింది. స్వచ్ఛంద విరమణ పథకం (వీఆర్‌ఎస్‌) ‌పేరుతో భారత్‌, అమెరికా, కెనడా, బ్రిటన్‌లలో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపడానికి నిర్ణయం తీసుకుంది. సంస్థలోని మొత్తం 2.23 లక్షల మంది ఉద్యోగుల్లో దాదాపు 27 శాతం మందికి సమానమైన 60వేల మంది వీఆర్‌ఎస్‌‌కు అర్హులని సమాచారం. స్వచ్ఛంద నిష్క్రమణను ఎంచుకునే ఉద్యోగులకు ఆర్థిక పరిహారంతోపాటు తదుపరి ఉద్యోగ అవకాశాల ప్రణాళికకు అవసరమైన సహాయాన్ని అందించనున్నట్టు కంపెనీ ప్రకటించింది. పొదుపు చర్యల్లో భాగంగా ఉద్వాసనలకు తెర లేపినట్టు స్పష్టమవుతోంది. అయితే 60 వేల మందిని తొలగిస్తున్నట్లు కాకుండా.. అర్హులైన ఉద్యోగులకు స్వచ్ఛంద నిష్క్రమణ అవకాశాన్ని మాత్రమే కల్పించినట్టు కంపెనీ స్పష్టం చేసింది. 27 శాతం ఉద్యోగులకు అవకాశం మైక్రోసాఫ్ట్‌ తాజా వీఆర్‌ఎస్‌ భారత్‌, అమెరికా, కెనడా, బ్రిటన్‌లలోని ఎంపిక చేసిన విభాగాలకు వర్తించనుంది. సంస్థలో లెవల్‌ 70 లేదా అంతకంటే దిగువ స్థాయిలో పనిచేస్తున్న అర్హులైన ఉద్యోగులు ఈ పథకాన్ని వినియోగించుకోవచ్చు.


అన్ని విభాగాల్లోనూ ఈ అవకాశం అందుబాటులో ఉండదు. ఆయా వ్యాపార విభాగాల ప్రాధాన్యతలు, వినియోగదారులకు ఇచ్చిన హామీలు, సిబ్బంది అవసరాలను బట్టి పథకాన్ని అమలు చేయనున్నారు. పరిమిత కాలానికి మాత్రమే ఈ అవకాశం అందుబాటులో ఉంటుందని ఉద్యోగులకు పంపిన అంతర్గత సందేశంలో మైక్రోసాఫ్ట్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, చీఫ్‌ పీపుల్‌ ఆఫీసర్‌ అమీ కోల్‌మన్‌ ‌పేర్కొన్నారు. ఇప్పటికే ఈ ఏడాది ఏప్రిల్‌లో అమెరికాలోని దాదాపు 7 శాతం మంది ఉద్యోగులకు వర్తించేలా స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని ప్రవేశపెట్టింది. అనంతరం జులైలో 4,800 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. తాజాగా మరింత పెద్ద సంఖ్యలో విఆర్‌ఎస్‌ అవకాశాన్ని అందుబాటులోకి తీసుకురావడం ఐటి ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళనను పెంచుతోంది. భారత్‌లో ఎంతమంది..? భారత్‌‌లో ఎంతమంది ఉద్యోగులు వీఆర్‌ఎస్‌‌కు అర్హులవుతారనే వివరాలను మైక్రోసాఫ్ట్‌ వెల్లడించలేదు. అలాగే స్వచ్ఛందంగా నిష్క్రమించే ఉద్యోగులకు ఎంత పరిహారం అందించనున్నదీ స్పష్టం చేయలేదు. మొత్తం 60 వేల మంది ఉద్యోగులకు అవకాశం కల్పించినప్పటికీ వాస్తవంగా ఎంతమంది ఈ పథకాన్ని ఎంచుకుంటారనే దానితోనే.. సంస్థలో సిబ్బంది సంఖ్య ఎంతమేరకు తగ్గుతుందనేది ఆధారపడి ఉంటుందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్