– మెగా రక్తదాన శిబిరం
– రక్తదానం చేసిన 200 మంది దాతలు
నవతెలంగాణ-సత్తుపల్లి
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) పుట్టినరోజు వేడుకను శుక్రవారం సత్తుపల్లిలో ఘనంగా నిర్వహించారు. స్థానిక కిరాణా మర్చంట్స్ కళ్యాణ మండపంలో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ జన్మదినాన్ని అట్టహాసంగా జరిపారు.
కేక్ కట్ చేశారు. బాణసంచా పేల్చారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మాట్లాడారు. తలసేమియా బాధితులతో పాటు అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరమయ్యే ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండేలా ఈ రక్తాన్ని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి బ్లడ్ బ్యాంక్‌కు పంపిస్తున్నామని తెలిపారు. గతంలో కూడా 1000 మందితో భారీ రక్తదాన శిబిరాలను నిర్వహించామన్నారు. ముఖ్య నాయకుల జన్మదినాలను సేవా కార్యక్రమాలతో నిర్వహించడం ద్వారా సమాజానికి ఉపయోగపడటంతో పాటు ఎంతోమంది ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుందని సండ్ర అన్నారు.

రక్తదానం చేసిన 200 మంది దాతలు
ఈ మెగా రక్తదాన శిబిరంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, కేటీఆర్ అభిమానులు భారీ సంఖ్యలో హాజరై స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. సుమారు 200 మందికి పైగా రక్తదానం చేశారు. రక్తదాతలను మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అభినందించారు. రక్తదాన శిబిరంలో పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేసిన రక్తదాతలకు సండ్ర ధన్యవాదాలు తెలిపారు.
ఢిల్లీలో విద్యార్థుల దీక్షపై కేంద్ర ప్రభుత్వం స్పందించాలి
నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీపై ఢిల్లీలో విద్యార్థులు చేపట్టిన దీక్షపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య డిమాండ్ చేశారు. విద్యార్థులు ఇంతకాలంగా ఆందోళన చేస్తున్నా పట్టించుకోకుండా, ఇప్పుడు రాహుల్ గాంధీ అక్కడికి వెళ్లి రాజకీయ డ్రామా చేయడం విడ్డూరంగా ఉందని సండ్ర వెంకట వీరయ్య విమర్శించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ కూసంపూడి మహేష్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, ఆత్మ మాజీ చైర్మన్ శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, నాయకులు ఎస్కే రఫీ, మల్లూరు అంకమరాజు, దొడ్డా శంకరరావు, వీరపనేని బాబీ, కోటగిరి సుధాకరరావు (గ్యాస్), కోటగిరి వెంకటరావు, మోరంపూడి ప్రభాకర్, చంద్ పాషా, అద్దంకి అనిల్, పర్వతనేని వేణు, బెల్లంకొండ రాము, గుండ్ర రఘు, నరుకుళ్ల శ్రీను, గాదె సురేష్, యాస రాంబాబు, కాల్నేని వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.



