– తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు
– దేశ స్వాతంత్రాన్ని తాకట్టు పెడుతున్నారు
– వ్యకాస జిల్లా అధ్యక్షుడు మేరుగు సత్యనారాయణ
– ఆగష్టు 10న జైలు భరోను జయప్రదం చేయండి
నవతెలంగాణ-సత్తుపల్లి
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలోని అన్ని వర్గాల ప్రజల హక్కులను కాలరాస్తూ, కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగాను, కార్మిక, కర్షక, ప్రజలకు వ్యతిరేకంగా పాలన సాగిస్తోందని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు మేరుగు సత్యనారాయణ విమర్శించారు. సోమవారం సత్తుపల్లి మండలం సిద్ధారంలో కొలికపోగు సర్వేశ్వరరావు, బాల బుచ్చయ్య, కువ్వారపు లక్ష్మణరావుల అధ్యక్షతన జరిగిన సదస్సులో బొంతు రాంబాబు, మేరుగు సత్యనారాయణ ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. ఎందరో వీరుల త్యాగాలతో సాధించుకున్న దేశ స్వాతంత్రాన్ని కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు తాకట్టు పెడుతోందని విమర్శించారు. విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల ధరలు విపరీతంగా పెరగడం, పంటలకు గిట్టుబాటు ధరలు లభించకపోవడంతో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రకృతి వైపరీత్యాలతో పంటలు దెబ్బతింటే ప్రభుత్వాల నుంచి తగిన నష్టపరిహారం అందడం లేదని మండిపడ్డారు. గ్రామీణ ప్రాంతాల్లో ఏడాది పొడవునా ఉపాధి దొరకడం లేదన్నారు. ఉపాధి హామీ పథకంలో పనిదినాలు, వేతనాల చెల్లింపుల్లో తీవ్ర సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళా వ్యవసాయ కూలీలు తీవ్ర వివక్షకు గురవుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ, పారిశ్రామిక రంగాల్లో శాశ్వత ఉద్యోగ అవకాశాలను తుంగలో తొక్కి కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానాలను ప్రోత్సహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్తగా తెచ్చిన కార్మిక కోడ్‌లు పెట్టుబడిదారులకు అనుకూలంగా మారి కార్మికుల సమ్మె హక్కును, సంఘాల ఉనికిని కాలరాస్తున్నాయని నిరసించారు. కేంద్రం తక్షణమే ఈ ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలని, లేనియెడల పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని రాంబాబు, సత్యనారాయణ హెచ్చరించారు.
ఆగస్టు 10న జైలు భరోను జయప్రదం చేయాలి
క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఆగస్టు 10న నిర్వహించనున్న ‘జైల్ భరో’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని బొంతు రాంబాబు, మేరుగు సత్యనారాయణ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కోశాధికారి చలమాల విఠల్ రావు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు జాజిరి శ్రీనివాస్, రైతు సంఘం సత్తుపల్లి డివిజన్ కార్యదర్శి రావుల రాజబాబు, ఐద్వా మండల కార్యదర్శి జాజిరి జ్యోతి, రైతు సంఘం మండల అధ్యక్షులు మోరంపూడి వెంకటరావు, సీఐటీయూ మండల కన్వీనర్ కావూరి వెంకటేశ్వరరావు, చెరుకు శ్రీనివాసరావు, యువజన సంఘం జిల్లా నాయకులు తడికమళ్ల రామకృష్ణ, ప్రజా నాట్యమండలి డివిజన్ కార్యదర్శి అయినంపూడి సనందరావు, యలగం కృష్ణ, వేపులపాటి కుమార స్వామి, గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ మండల నాయకులు సింగపోగు రమణ, రేసు లక్ష్మి, బొప్పన శ్రీలక్ష్మి, దాట్ల రాంబాబు, ఎలగం రాములు, బెజవాడ లక్ష్మీనారాయణ, మణి బాబు, రాజు తదితరులు పాల్గొన్నారు.


