Sunday, August 23, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుహెజోలో ఫార్మా కంపెనీలో భారీ ప్రమాదం

హెజోలో ఫార్మా కంపెనీలో భారీ ప్రమాదం

- Advertisement -

రియాక్టర్‌ పేలి నలుగురు కార్మికులు మృతి
ఘటనా స్థలంలో ఇద్దరు, యశోద ఆస్పత్రిలో మరో ఇద్దరు..10 మందికి గాయాలు
రూ.2 కోట్ల 80 లక్షలపరిహారం ఇచ్చేందుకుయాజమాన్యం అంగీకారం
కంపెనీని సీజ్‌ ‌చేస్తామన్న జేసీ

నవతెలంగాణ- భూదాన్ పోచంపల్లి
హెజోలో లాబరేటర్‌ ‌కెమికల్‌ ‌కంపెనీలో భారీ ప్రమాదం జరిగింది. రియాక్టర్‌ ‌పేలడంతో నలుగురు కార్మికులు ప్రాణం కోల్పోయారు. 10మంది కార్మికులకు గాయాలయ్యాయి. ఆ ప్రాంతమంతా కార్మికుల హాహాకారాలతో విషాదంగా మారింది. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌‌పోచంపల్లి మండలం దోతిగూడెం సమీపంలోని హెజోలో కంపెనీలో శుక్రవారం రాత్రి జరిగింది. పోలీసులు, స్థానికులు, కార్మికులు తెలిపిన వివరాల ప్రకారం.. హెజోలో కెమికల్‌ ‌కంపెనీలో రాత్రి షిష్ట్‌‌లో 18మంది కార్మికులు విధుల్లో ఉన్నారు. రియాక్టర్‌‌లో కెమికల్‌ ‌మారుస్తుండగా ఒక్కసారిగా భారీ శబ్ధంతో పేలుడు సంభవించి క్షణాల్లో మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం చిన్నగూడెం గ్రామానికి చెందిన చిన్న నాగిరెడ్డి (31), ఖమ్మం జిల్లా చౌడారానికి చెందిన నాగిన బోయిన నరేష్ కుమార్ (29) ఘటనా స్థలంలోనే మృతిచెందారు. పదిమందికి గాయాలయ్యాయి.

వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి వచ్చి మంటలను అర్పింది. గాయపడిన వారిని యశోద, సన్‌‌షైన్‌ ఆస్పత్రులకు తరలించారు. యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో సూర్యాపేట జిల్లా మునగాల మండలం మాధవరం గ్రామానికి రాణబోతు రాజశేఖర్ రెడ్డి(38), ఖమ్మం జిల్లా పెన్‌‌చేడు మండలం వెంకటపురం గ్రామానికి చెందిన పేదల చిన్న కేశవులు(38) మృతిచెందారు. ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా తిరువూరు రోలుపాడు గ్రామానికి చెందిన మేడ శ్రీహరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిలో చెన్నారెడ్డి శిశకుమార్‌‌రెడ్డి, మేరెళ్ల యోహన్‌, వేదుల చెన్నకేశవులు, కంబంపాటి యేసుదాసు, దూడల శివశంకర్‌, సాకేటి గణేశ్‌, పెంట్యాల రవి ఉన్నారు. రియాక్టర్ పేలడంలో సాంకేతిక లోపమా లేక నిర్వహణ లోపమా అనే కోణంలో పోలీసులు ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు.

​భద్రతా లోపం వల్లే ..
హెజోలో లాబరేటరీలో భద్రతా లోపం వల్లే నిండు ప్రాణాలు బలయ్యాయి. జులై 16న రసాయన విషవాయువులు పీల్చడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా సింగమల మండలానికి చెందిన కార్మికుడు ఆలమూరు కృష్ణారెడ్డి మృతి చెందాడు. కార్మికుని కుటుంబానికి రూ. కోటి యాభై లక్షలు ముట్టజెప్పి యాజమాన్యం చేతులు దులుపుకున్న పరిస్థితి. ఆ ప్రమాదం జరిగి 40 రోజులు కాకముందే మళ్లీ భారీ రియాక్టర్ పేలుడు సంభవించి నలుగురు ప్రాణం కోల్పోయారు. ఈ వరుస ఘటనలు యజమాన్యం వైఫల్యానికి నిదర్శనమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేపదే ప్రమాదాలు జరుగుతున్నా అధికారుల పర్యవేక్షణ కొరవడిందని ఆరోపిస్తున్నారు.

​​సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా
హెజోలో కంపెనీని మూసివేయాలని, యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ ‌చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో గ్రామస్తులు, కార్మికుల కుటుంబీకులు కంపెనీ ఎదుట ధర్నా నిర్వహించారు. మృతుల కుటుంబాలకు రూ.5 కోట్ల పరిహారం చెల్లించాలని సీఐటీయూ అధ్యక్ష, కార్యదర్శులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి, కల్లూరు మల్లేశం డిమాండ్‌ ‌చేశారు. ఈ క్రమంలో పోలీ సులు, వారి మధ్య తోపులాట చోటుచేసుకుంది. చని పోయిన కార్మికులకు సంబంధించి కుటుం బాలకు రూ.2 కోట్లా80 లక్షల పరిహారం ఇచ్చేందుకు యాజమాన్యం అంగీకరించినట్టు యాదాద్రి భువనగిరి జిల్లా అడిషనల్ కలెక్టర్ భాస్కరరావు తెలిపారు. అదేవిధంగా కంపెనీని సీజ్ చేసినట్టు ప్రకటించారు.

​భయాందోళనలో ప్రజలు
రియాక్టర్ పేలుడు ధాటికి వచ్చిన భారీ శబ్దాలతో దోతిగూడెం, అంతమ్మగూడెం, జూబ్లక్ పెళ్లి గ్రామాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. రోడ్లపైకి పరుగులు తీశారు. ప్రమాద వార్త తెలుసుకొని కార్మికుల కుటుంబీకులు, గ్రామస్తులు కంపెనీ ఎదుట భారీగా గుమిగూడారు. ఘటనా స్థలాన్ని ఎమ్మెల్యే కుంభం అనిల్‌‌కుమార్‌‌రెడ్డి, పీసీబీ వెంకన్న ఏఈ చంద్రశేఖర్, శ్రీదేవి, డీఎస్పీ మధుసూదన్ రెడ్డి, సీఐలు సందర్శించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -