అది జనవరి 17, 2025.. సమయం రాత్రి పదిగంటలు. ఉత్తర్‌ప్రదేశ్ సంభల్ జిల్లా గున్నౌర్ పట్టణంలో చోటుచేసుకుందా కారు ఛేజింగ్ సంఘటన. ముందు వెళుతున్న రెండు కార్లని తన వాహనంతో స్పీడుగా వెంబడిస్తోంది అనుకృతి. ఆ రోజంతా ఆ కారుదొంగల్ని పట్టుకోవడం కోసమే చెక్‌పోస్ట్ వద్ద పహారా కాసింది. ఆమె అనుమానించిన స్కార్పియో కనపడగానే ఛేజ్ చేసి నడుపుతున్న ఓంకారేశ్వర్ని అదుపులోకి తీసుకుంది. ‘నువ్వు దొంగిలించిన కారు ఎక్కడ?’ అంటూ ఇంటరాగేషన్ మొదలుపెట్టింది. కానీ ఐదు నిమిషాల్లోనే అతనికీ కారు దొంగతనానికీ సంబంధం లేదని తేలిపోయింది. మరి అతను పోలీసుల్ని చూసి ఎందుకు పారిపోయినట్టు.. అదే అడిగింది.
‘భయపడ్డానండీ..’ అంటూ నసిగాడతను. ‘ఏం చేస్తుంటావ్ నువ్వు?’ అంటే ‘ఇన్సూరెన్స్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని మేడమ్.. ఈస్ట్ ఇండియా కంపెనీలో పని చేస్తుంటాను. బీమా కంపెనీల తరపున క్లెయిమ్ ఎంక్వైరీలు చేసే సంస్థ మాది’ అన్నాడు. ‘నీ ఐడీ కార్డు ఎక్కడ?’ అంది. ‘కారులో ఉంది..’ అని చెప్పాడు. ఓ పోలీసుని పంపి కారులోని ఐడీ కార్డు తెమ్మంది అనుకృతి. ఆ పోలీసు.. కార్డుతోపాటూ ఓ సూట్కేసూ, పర్సూ తెచ్చాడు. సూట్‌కేసులో రూ.11 లక్షలున్నాయి. పర్సులో 19 డెబిట్ కార్డులున్నాయి. ఆ డబ్బు ఎలా వచ్చిందో సరైన జవాబు చెప్పలేదు అతను. డెబిట్ కార్డులో ఓ రెండు తప్ప మిగతావేవీ అతనివి కావు. అతని ఫోను చూసింది అనుకృతి. అందులో లక్షమంది పాస్‌పోర్టు సైజు ఫొటోలున్నాయి.. 300 డాక్యుమెంట్లున్నాయి! వాట్సాప్ చాట్‌లో ‘చనిపోయిన సుభాష్ తరపున వచ్చిన డబ్బు రూ.10 లక్షలు.. నాకింత నీకింత’ అంటూ సాగిన బేరసారాలున్నాయి. ఆ క్షణం.. అనుకృతికి అర్థమైపోయింది.. అది కారు దొంగతనంకన్నా వెయ్యిరెట్లు ప్రమాదకరమైన కుంభకోణం అని!
తనదైన శైలిలో విచారించి
అప్పటికప్పుడే పోలీసులతో ఓ టీమ్‌ని ఏర్పాటుచేసింది అనుకృతి. వాళ్లని మారువేషంలో సుభాష్ అనే మృతుడి ఇంటికి పంపించింది. ‘మేం ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి వస్తున్నాం. చనిపోయిన మీ ఆయన పేరు మీద పది లక్షలు వేశాం.. వచ్చాయా?’ అని అడిగితే ‘మేమెప్పుడూ బీమా తీసుకోలేదు సార్’ అంది సుభాష్ భార్య సునీత అమాయకంగా! ‘కానీ పోయిన వారం కేంద్రప్రభుత్వం ఇరవైవేలు ఇచ్చిందని.. ఆశా వర్కర్ తెచ్చిచ్చింది’ అని చెప్పిందట. అంటే పది లక్షల్లో బాధిత కుటుంబానికి వీళ్లిచ్చింది రూ.20 వేలన్నమాట! టీమ్ ఆ విషయం చెప్పగానే.. ఓంకారేశ్వర్ని తనదైన శైలిలో విచారించారు అనుకృతి. నిజాల్ని కక్కించి.. మరింత కూపీలాగి.. 19 మందిని అరెస్టు చేసింది. అలా.. మనదేశంలోని అతిపెద్ద బీమా కుంభకోణాన్ని బయటపెట్టింది. ఒక్క ఉత్తర్ప్రదేశే కాకుండా ఉత్తరాదిలోని 12 రాష్ట్రాల్లో సాగిన అవినీతి అది. రూ.500 కోట్లు దాని విలువ. నాలుగువందల మంది వితంతువులకి అందాల్సిన సొమ్ము అది.
ఓ ముఠాగా చేరి
ప్రతి గ్రామంలోనూ నయంకాని క్యాన్సర్, కిడ్నీ వ్యాధులు, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నవాళ్ల సమాచారాన్ని.. అక్కడి ఆశావర్కర్ ఈ ముఠాకి చేరవేస్తారు. ఆ తర్వాత ముఠాసభ్యులు ఆశావర్కర్తోపాటూ వెళ్లి ‘కేంద్రప్రభుత్వ పథకం’ కింద వైద్యఖర్చులు ఇప్పిస్తామని వాళ్ల డాక్యుమెంట్లు తీసుకుంటారు. వాళ్ల వ్యాధుల్ని దాచి.. బీమా పాలసీలు తీసుకుంటారు. నకిలీ ఆధార్ సృష్టిస్తారు! నామినీ వివరాల్లో ఫోన్ నంబర్లూ అడ్రెస్సులూ తమవే ఇస్తారు. రెండు మూడు నెలలు తామే ప్రీమియం కడతారు. బీమా అధికారులకూ, బ్యాంకు సిబ్బందికీ అనుమానం రాకుండా మేనేజ్ చేస్తారు. బీమా తీసుకున్న వ్యక్తి చనిపోయాక.. అకస్మాత్తుగా సంభవించిన ‘హార్ట్ ఎటాక్’ అని నకిలీ డెత్ సర్టిఫికెట్ సృష్టించి బీమా క్లెయిమ్ తీసుకుంటారు! ఓంకారేశ్వర్ అనే తీగ ఆధారంగా 12 రాష్ట్రాల్లో విస్తరించిన కుంభకోణం డొంకని మొత్తం కూల్చేసింది అనుకృతి. ఆశావర్కర్లూ, బీమా కంపెనీ అధికారులూ, డాక్టర్లూ, బ్యాంకు మేనేజర్లు సహా 70 మందిని కటకటాల వెనక్కి నెట్టింది. వీళ్లందరి అరెస్టు ఒక ఎత్తు.. వాళ్ల కోసం నకిలీ పత్రాలు సృష్టించే షారుక్ ఖాన్ని అరెస్టు చేయడం ఒక్కటీ ఒకెత్తు. అతని ద్వారానే ఈ ముఠా హత్యలకీ వెనకాడలేదని తేలింది.
సైంటిస్ట్ కావాలనుకుని...
అనుకృతి శర్మది రాజస్థాన్. చిన్నప్పట్నుంచీ సైంటిస్టు కావాలని ఎంతో తపించారు. జైపూర్‌లోని ఇండో-భారత్ ఇంటర్నేషనల్ స్కూల్లో తన ప్రాథమిక విద్యను పూర్తి చేశారు. ఐఐటీ-జేఈఈ రాసి కోల్‌కతాలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసర్చ్‌లో ఐదేండ్ల బీఎస్ఎమ్మెస్ కోర్సులో చేరి గోల్డ్‌మెడల్‌తో పాసయ్యారు. తన సహాధ్యాయి వైభవ్ మిశ్రాని పెండ్లి చేసుకున్నారు. ఆ తర్వాత 2012లో అమెరికాలోని రైస్ యూనివర్సిటీలో పీహెచ్డీ చేశారు. ఆమె పరిశోధనలో అగ్నిపర్వతాలకు సంబంధించి ఒక ప్రాజెక్టు కూడా ఉంది. ఆమె డాక్టరేట్ చేసే సమయంలో అమెరికా అంతరిక్ష సంస్థ నాసాతో కలిసి పనిచేసే అవకాశం లభించింది. అక్కడ పనిచేస్తున్నప్పుడే అనుకృతి రూ. 2 లక్షల వేతనం అందుకునేవారు. శాస్త్రీయ పరిశోధనలో వృత్తిని కాదని.. సివిల్ సర్వీసెస్ ద్వారా సేవ చేసేందుకే ఆమె ఆసక్తి చూపించారు.
ఆమె లక్ష్యం ఐపీఎస్
ఇండియా తిరిగి వచ్చి 2014లో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) పరీక్షకు సిద్ధ మయ్యారు. 2015లో మొదటిసారి ఆ పరిక్షలకు హాజరయ్యారు. అయితే ఆమె తొలి ప్రయత్నంలోనే ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించినా.. మెయిన్స్ లో అర్హత సాధించలేక పోయారు. అయితే రెండో, మూడో ప్రయత్నాల్లో సైతం ఓటమినే ఎదుర్కొన్నా రామె. చివరికి నాలుగో ప్రయత్నంలోనే అఖిల భారత స్థాయిలో 355వ ర్యాంకును (AIR 355) సాధించి, ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (IRS)కు ఎంపికయ్యారు. అయితే ఆమె లక్ష్యం ఐపీఎస్ అధి కారి కావడం. అందువల్ల ఆ సర్వీస్‌లో చేర లేదు. ఆ తర్వాత 2020లో మళ్లీ యూపీఎస్సీ పరీక్షలకు హాజరై 138వ ర్యాంకును (AIR 138) సాధించింది. తద్వారా ఇండియన్ పోలీస్ సర్వీస్‌లో చేరాలనే తన కలను సాకారం చేసుకున్నారు. అలా ఉత్తర్‌ప్రదేశ్ బులంద్ షహర్లో అసిస్టెంట్ ఎస్పీగా చేరారు.
లేడి శివంగిలా...
ఆమె బాధ్యతల్లో చేరిన కొద్ది రోజులకే ‘పోలీస్ ఫ్రెండ్స్’ పేరుతో మహిళలందరూ ఎప్పుడైనా తనకి కాల్చేసే అవకాశం కల్పించారు ఆమె. కొన్ని కేసుల ఛేదనకి వాళ్లిచ్చే సమాచారమే కీలకమవుతుందని గర్వంగా చెబుతూ ఉంటారు అనుకృతి. అలా ఐపీఎస్ అధికారిణిగా ఎన్నో కేసులను అత్యంత చాకచక్యంతో చేధించి.. క్రిమినల్స్ ఆటకట్టించారు. నేరస్తులు గుండెల్లో భయం తెప్పించే లేడి శివంగిలా మారి ఎన్నో నేరాలకు అడ్డకట్ట వేసిన అధికారిగా మంచి పేరుతెచ్చుకున్నారు. ముఖ్యంగా రూ. 100 కోట్ల ఇన్సురెన్స్ స్కామ్ ఛేదించడంతో ఆమె పేరు దేశవ్యాప్తంగా మారుమ్రేగిపోయింది. సంభాల్ జిల్లాలో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసు చేధనలో శివంగిలా ఆమె కనబర్చిన అసామాన్య ధైర్య సాహసాలకు గానూ ఈ ఏడాది ప్రతిష్టాత్మక హోం మంత్రి దక్షత మెడల్‌కు ఎంపిక చేసి గౌరవించింది కేంద్ర హోం మంత్రిత్వ శాఖ.





కామెంట్లు (0)