ప్రియమైన వేణు గీతికకు
నాన్నా! ఎలా ఉన్నావు? నేను ఇంకా పూర్తిగా కోలుకోలేదు, దగ్గు తగ్గడం లేదు. ఏది ఏమైనా పనులు చేసుకోక తప్పదు కదా! ఇక్కడ గణేష్ నవరాత్రి ఉత్సవాలు ముగిశాయి. ప్రభుత్వం సెలవు ప్రకటించింది. సరే నాన్నా, అసలు విషయానికి వస్తాను, టీవీలో ఒక స్టోరీ చూసాను అని అన్నాను కదా అది చూశాక వచ్చిన ఆలోచన గురించి చెప్తా..
నాన్నా ప్రయాణాలు చేసేటప్పుడు ముఖ్యంగా రాత్రి పూట బస్‌లో ప్రయాణం చేసేటప్పుడు భోజనానికి, వాష్ రూమ్స్ కని ఆపుతారు. అలాంటప్పుడు వాష్ రూమ్‌కి వెళ్లే వాళ్ళు అందులోనూ ఒంటరిగా ప్రయాణం చేస్తున్న వాళ్ళు తోటి ప్రయాణికులతో కలిసి వెళ్లాలి. ‘నేను వచ్చేవరకు దయచేసి నా కోసం వేచి చూడండి’ అని అభ్యర్ధించి వెళ్ళాలి. దీనివల్ల సురక్షితంగా ఉంటారు. టీవీలో చూసిన స్టోరీ ఏమిటంటే ఒక అమ్మాయి ఒక్కతే వాష్ రూమ్‌కి వెళ్తుంది. అది చూసి ఒక దుర్మార్గుడు బైట నుంచి తలుపు పెట్టేస్తాడు. చీకటి, అక్కడ ఎవరూ లేరు. లోపలి నుండి అరుస్తుంది.
చాలా సార్లు అరిచిన తర్వాత ఎవరో ఆ అరుపులు విని తలుపులు తెరుస్తారు.
అలాగే రైల్లో కూడా, ముఖ్యంగా రిజర్వేషన్లు ఉన్న కంపార్టుమెంట్లు. అందరూ నిద్ర పోతున్న సమయంలో ఎక్కువగా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే రైల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు వాష్ రూమ్‌కి వెళ్లాల్సి వస్తే, రైలు ఆగినప్పుడు కాకుండా, కదులుతున్నపుడు వెళ్లాలి. దొంగతనాలు చేసే వాళ్ళు అంత వేగంగా వెళ్తున్న రైల్లోంచి దూక లేరు, పారిపోవాలన్నా కొంచం సమయం పడుతుంది. ఈ లోపు వారిని పట్టుకునేందుకు, పోలీసులకు సమాచారం ఇచ్చేందుకు సమయముంటుంది. కాబట్టి అన్ని రకాలుగా ఆలోచించుకుని సేఫ్టీ చూసుకుని ప్రయాణం చేయాలి. ‘ఎక్కడో జరిగిందని మనకూ ఇలా జరుగుతుందా’ అనుకునే వాళ్ళు ఉన్నారు. కానీ జాగ్రత్తగా ఉండటం అవసరం. నేను నిన్న ఓ కథ చదివాను, అది చదివిన తర్వాత మోసాలు ఇలా కూడా జరుగుతాయా అని తెలిసింది. దాని గురించి ముందు ముందు ఉత్తరాల్లో రాస్తాను. ఉంటాను నాన్నా.
ప్రేమతో అమ్మ పాలపర్తి సంధ్యారాణి






కామెంట్‌లు (0)