Magazines

ఆమె మనసు మాట వినేదెవరు?

6 రోజుల క్రితం

women
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 10, 2026 | 3 నిమిషాల చదవడం

మహిళల మానసిక సమస్యలను దాచడం కాదు.. గుర్తించి పరిష్కరించుకోవాలి. అక్టోబర్ 10 ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం. ఈ సందర్భంగా మహిళల మానసిక ఆరోగ్యం గురించి ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన సమాజంలో మహిళ కుటుంబానికి భావోద్వేగ పరంగా బలంగా నిలుస్తుంది. అందరి సమస్యలను వింటుంది. అందరి కోసం ఆలోచిస్తుంది. కానీ తన మనసులోని సమస్యలను మాత్రం చాలాసార్లు తనలోనే దాచుకుంటుంది.

‘ఇంట్లో అందరూ బాగుంటే చాలు’, ‘నా బాధను నేను భరిస్తాను’, ‘పిల్లల కోసం సర్దుకుపోవాలి’ అంటూ తన భావాలను అణచి వేస్తుంది. కానీ నిరంతరం భావాలను అణచివేయడం మానసిక ఒత్తిడిని పెంచవచ్చు.

మహిళల్లో ఆందోళన, డిప్రెషన్, దీర్ఘకాలిక ఒత్తిడి, ప్రసవానికి ముందు లేదా తర్వాత వచ్చే మానసిక ఇబ్బందులు, నిద్ర సమస్యలు, ఆత్మవిశ్వాసం తగ్గడం వంటి సమస్యలు కనిపించవచ్చు. వీటిని ‘జీవితంలో భాగమే” అంటూ నిర్లక్ష్యం చేయకూడదు. కొన్నిసార్లు సమస్య కన్నీళ్ల రూపంలో కనిపిస్తుంది. మరికొన్నిసార్లు కోపంగా, చిరాకుగా, మౌనంగా లేదా అందరినీ దూరం పెట్టే ప్రవర్తనగా బయటపడవచ్చు. ‘ఆమెకు కోపం ఎక్కువైంది’ అని కాదు.. ‘ఆమె మనసులో ఏముంది?’ అని అడగాలి. ఒక మహిళ చిన్న విషయాలకే కోప్పడుతోంది. పిల్లలపై చిరాకు చూపుతోంది. భర్తతో మాట్లాడాలనిపించడం లేదు. రాత్రిళ్లు సరిగా నిద్రపోవడం లేదు. ఇలాంటప్పుడు కుటుంబ సభ్యులు, ‘ఎప్పుడూ చిరాకే.. నీకు ఏమైంది?’ అని విమర్శిస్తే సమస్య మరింత పెరగవచ్చు. అదే సమయంలో.. ‘నువ్వు ఈ మధ్య చాలా ఒత్తిడిలో ఉన్నట్టు కనిపిస్తున్నావు. ఏదైనా బాధ ఉంటే మాతో చెప్పు’ అని అడిగితే ఆమెకు తన భావాలను పంచుకునే అవకాశం లభిస్తుంది. ప్రవర్తనను మాత్రమే కాకుండా ప్రవర్తన వెనుక ఉన్న భావాన్ని అర్థం చేసుకోవడం మానసిక ఆరోగ్యానికి మొదటి అడుగు.

భావోద్వేగ దూరం

భార్యాభర్తల మధ్య భావోద్వేగ దూరం కూడా మహిళను ప్రభావితం చేస్తుంది. వివాహ జీవితంలో ప్రేమ, నమ్మకం, గౌరవం, సంభాషణ చాలా ముఖ్యమైనవి. భార్యాభర్తల మధ్య నిరంతరం మాటలు తగ్గిపోవడం, ఒకరినొకరు పట్టించుకోకపోవడం, తరచూ విమర్శించుకోవడం వంటి పరిస్థితులు మహిళలో ఒంటరితనం, నిరాశను పెంచవచ్చు. ఉదాహరణకు ఒక మహిళ రోజంతా కుటుంబం కోసం పనిచేసి భర్తతో తన బాధను పంచుకోవాలని ప్రయత్నిస్తుంది. కానీ భర్త ప్రతిసారీ ఆమె మాటను పట్టించుకోకుండా ఉంటే, కొంతకాలానికి ఆమె ‘నా మాటకు విలువ లేదు’ అనే భావనకు రావచ్చు. ఇక్కడ పరిష్కారం నిందలు కాదు, సంభాషణ.

అన్నింటినీ భరించొద్దు

మన సంస్కృతిలో ‘ఆడవాళ్లు చాలా ఓపికగా ఉండాలి’ అనే మాట తరచూ వినిపిస్తుంది. ఓర్పు అవసరమే. కానీ ఓర్పు పేరుతో అవమానం, నిరంతర మానసిక వేధింపులు, భయం లేదా అసురక్షిత పరిస్థితులను భరించాల్సిన అవసరం లేదు. సర్దుకుపోవడం ఒక ఎంపిక కావచ్చు.. కానీ తన మానసిక ఆరోగ్యాన్ని కోల్పోవడం పరిష్కారం కాదు. ఇక గర్భధారణలో మానసిక ఆరోగ్యం మరింత ముఖ్యం. గర్భధారణ సమయంలో మహిళ శరీరంలో అనేక శారీరక, హార్మోనల్ మార్పులు జరుగుతాయి. దీనికి తోడు ప్రసవం గురించి భయం, కుటుంబ బాధ్యతలు, ఆర్థిక ఆందోళనలు, ఉద్యోగ ఒత్తిడి, కుటుంబ సభ్యుల సహకారం లేకపోవడం వంటి అంశాలు మానసిక ఒత్తిడిని పెంచవచ్చు. అందుకే గర్భిణీకి కేవలం ‘ఆహారం బాగా తీసుకో’ అని చెప్పడం మాత్రమే సరిపోదు. ‘నువ్వు ఎలా ఉన్నావు?’ అని ఆమె మనసును కూడా అడగాలి. తల్లి మానసిక ఆరోగ్యం బాగుండటం తల్లి–శిశువు ఇద్దరికీ ముఖ్యం. అయితే ఇక్కడ గర్భధారణలో ఒత్తిడి ఉన్నంత మాత్రానా బిడ్డకు తప్పనిసరిగా మానసిక వ్యాధి వస్తుందని చెప్పడం సరైనది కాదు. మానసిక ఆరోగ్యాన్ని జన్యు, జీవశాస్త్ర, కుటుంబ, సామాజిక అంశాలు కలిపి ప్రభావితం చేస్తాయి.

తనను తాను ఎప్పుడు గమనించాలి?

కింది మార్పులు నిరంతరంగా కొనసాగితే వాటిని నిర్లక్ష్యం చేయకూడదు.

* ఎప్పుడూ దిగులుగా లేదా ఖాళీగా అనిపించడం

* కారణం లేకుండా ఎక్కువ ఆందోళన చెందడం

* నిద్రలో లేదా ఆకలిలో గణనీయమైన మార్పులు

* గతంలో ఇష్టమైన పనులపై ఆసక్తి తగ్గడం

* తరచూ చిరాకు, ఏడుపు లేదా కోపం రావడం

* తనపై నమ్మకం తగ్గిపోవడం

* అందరి నుంచి దూరంగా ఉండాలనిపించడం

* రోజువారీ పనులు చేయడం కూడా భారంగా అనిపించడం

ఇలాంటి లక్షణాలు ఉంటే మానసిక ఆరోగ్య నిపుణులను సంప్రదించడం బలహీనత కాదు.. అది బాధ్యత.

మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే...

మహిళకు కుటుంబం ఇవ్వాల్సింది సలహా కాదు.. అండ. ‘ఎక్కువగా ఆలోచించకు’, ‘నీకు ఏం తక్కువ?’, ‘అందరి జీవితాల్లో సమస్యలు ఉంటాయి’, ‘పిల్లల కోసం అయినా సంతోషంగా ఉండు’... ఇలాంటి మాటలు సమస్యను పరిష్కరించకపోవచ్చు. దానికి బదులుగా.. ‘నీ మాట వింటాను’, ‘నీకు సహాయం కావాలంటే నేను ఉన్నాను’, ‘మనిద్దరం కలిసి పరిష్కారం వెతుకుదాం’.. అనే మాటలు మహిళకు ఎంతో మానసిక భద్రతను ఇస్తాయి. మహిళ ఆరోగ్యంగా ఉంటే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది. మహిళ కుటుంబానికి కేంద్రబిందువు కావచ్చు. కానీ ఆమె కుటుంబం కోసం మాత్రమే జీవించే వ్యక్తి కాదు. ఆమెకు కూడా భావాలు ఉన్నాయి, విశ్రాంతి అవసరం ఉంది, తనకంటూ సమయం కావాలి, తన బాధను చెప్పుకునే హక్కు ఉంది. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ప్రతి కుటుంబం ఒక ప్రశ్న వేసుకోవాలి.. ‘మన ఇంట్లో అందరి ఆరోగ్యం గురించి అడుగుతున్నాం.. కానీ ఇంట్లోని మహిళ మనసు ఎలా ఉందని ఎప్పుడైనా అడిగామా?’.

మహిళల మానసిక సమస్యలను దాచిపెట్టే సంస్కృతి నుంచి, వాటిని గుర్తించి–విని–అర్థం చేసుకుని–సహాయం చేసే సంస్కృతి వైపు మన సమాజం అడుగులు వేయాలి. మహిళ కన్నీరు పెట్టుకున్న తర్వాత స్పందించడం కాదు.. కన్నీరు వచ్చేంతవరకు ఆమెను ఒంటరిగా వదిలిపెట్టకుండా ఉండటమే నిజమైన మానసిక ఆరోగ్య సంరక్షణ.

- డా.హిప్నో పద్మా కమలాకర్

కౌన్సెలింగ్ సైకోథెరపిస్ట్,హిప్నో థెరపీస్ట్

9390044031

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్