రోడ్డు మీద వెళుతుంటే వేడి మిర్చిబజ్జీ, ఆలూ బోండా లాంటివి కనిపిస్తే చాలు.. మన కాళ్లకి బ్రేక్ పడిపోతుంది. స్ట్రీట్‌ఫుడ్ రుచీ, వాసనా అంత అమోఘంగా ఉంటుంది మరి. కానీ వాటి మీద దుమ్మూధూళీ చేరొచ్చు. అదీకాక వాళ్లు ఏ నూనె వాడుతున్నారో కూడా మనకు తెలియదు. అందుకే అలాంటి చిరుతిళ్లు ఇంట్లోనే చేసుకోవడం ఉత్తమం. మీ కోసం అలాంటి రుచికరమైన రెసిపీలు కొన్ని..
చికెన్ షవర్మా
కావల్సిన పదార్థాలు: బోన్‌లెస్ చికెన్ - అర కిలో, పెరుగు - పావు కప్పు, నూనె - మూడు టేబుల్ స్పూన్లు, అల్లంవెల్లుల్లి పేస్ట్ - టేబుల్ స్పూన్, ధనియాలు, జీలకర్ర పొడులు, కారం, వెల్లుల్లి తరుగు - స్పూన్ చొప్పున, మిరియాల పొడి, గరంమసాలా - అర స్పూన్ చొప్పున, పసుపు - పావు స్పూన్, ఉప్పు - తగినంత, నిమ్మరసం - మూడు స్పూన్లు, క్యారెట్, క్యాబేజీ తరుగు, గ్రీక్ యోగర్ట్ - అర కప్పు చొప్పున, ఉల్లిపాయ, టొమాటో - ఒక్కొకటి, రుమాలీ రోటీ - నాలుగు
తయారు చేసే విధానం: చికెన్‌ను సన్నగా, పొడవుగా ముక్కలు కోయాలి. వెడల్పాటి గిన్నెలో పెరుగు, రెండు స్పూన్ల నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, మిరియాలు, జీలకర్ర, ధనియాల పొడులు, గరంమసాలా, పసుపు, ఉప్పు, నూనె వేసి కలపాలి. అందులో చికెన్ ముక్కలు జతచేసి మరోసారి కలిపి రెండు గంటలు ఫ్రిజ్‌లో ఉంచాలి. ప్యాన్‌లో నూనె వేడయ్యాక.. మారినేట్ చేసిన చికెన్‌ను వేయించాలి. మరో గిన్నెలో గ్రీక్ యోగర్ట్, వెల్లుల్లి తరుగు, మిగిలిన నిమ్మరసం, కొద్దిగా ఉప్పు జోడించాలి. రుమాలీ రోటీపై.. గార్లిక్ సాస్ పూసి.. వేయించిన చికెన్, ఉల్లి, టొమాటో, క్యాబేజీ, క్యారెట్ తురుము వేసి, రోల్ చేయాలి. ప్యాన్‌లో కొద్దిగా నూనె వేసి.. అటూ ఇటూ తిప్పుతూ కాలనివ్వాలి. అంతే.. వహ్వా అనిపించే ‘చికెన్ షవర్మా’ రెడీ.
మసాలా సమోసా
కావల్సిన పదార్థాలు: మైదా - రెండు కప్పులు, ఉప్పు - తగినంత, వాము - అర స్పూన్, ఆలు - నాలుగు, పచ్చి బఠాణీలు - అర కప్పు, పచ్చిమిర్చి - రెండు, అల్లం తరుగు - స్పూన్, కొత్తిమీర - పావు కప్పు, జీలకర్ర, ధనియాలు, ధనియాల పొడి, కారం, ఆమ్చూర్ పౌడర్ - స్పూన్ చొప్పున, సోంపు, జీలకర్ర పొడి, గరంమసాలా, చాట్‌మసాలా - అర స్పూన్ చొప్పున, ఇంగువ - చిటికెడు, పసుపు - పావు స్పూన్, నూనె - వేయించడానికి సరిపడా
తయారు చేసే విధానం: మైదాలో తగినన్ని నీళ్లు, ఒక స్పూన్ నూనె, ఉప్పు, వాము వేసి బాగా కలపాలి. దాని మీద మూతపెట్టి, అరగంట నాననివ్వాలి. ఈలోగా ఆలును ఉడికించి, పొట్టు తీసి ముక్కలు కోయాలి. ప్యాన్‌లో రెండు స్పూన్ల నూనె వేడిచేసి.. జీలకర్ర, సోంపు, ధనియాలు, ఇంగువ, అల్లం, పచ్చిమిర్చి ఒక్కొకటిగా వేయాలి. అవి వేగాక పచ్చి బఠాణీలు, అవి కూడా వేగాక.. పసుపు, ధనియాలు, జీలకర్ర పొడులు, కారం, ఆలూ ముక్కలు, ఉప్పు, ఆమ్చూర్ పౌడర్, చాట్‌మసాలా, గరంమసాలా జతచేయాలి. చివరగా కొత్తిమీర వేసి దించేయాలి. ఇప్పుడు నానిన పిండితో చిన్న రొట్టెలు చేసి, వాటిని సగానికి కట్ చేయాలి. ఒక్కో అర్ధచంద్రాకార ముక్కను- కోన్‌లా మడిచి, లోపల తగినంత ఫిల్లింగ్ ఉంచి, అంచులను మూసేయాలి. అన్నీ అయ్యాక.. కాగుతున్న నూనెలో లేత గోధుమ రంగులోకి మారేవరకూ వేయించాలి. వేడి వేడి మసాలా సమోసాలను పుదీనా చట్నీతో వడ్డిస్తే అద్భుతంగా ఉంటాయి.
పావ్ భాజీ
కావల్సిన పదార్థాలు: టొమాటోలు, ఆలు - నాలుగు చొప్పున, క్యారెట్, క్యాప్సికమ్ - ఒక్కొకటి, కాలీఫ్లవర్ - వంద గ్రా, పచ్చి బఠాణీలు - అర కప్పు, ఉల్లిపాయలు - రెండు, అల్లం వెల్లుల్లి పేస్ట్ - టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి - మూడు, పావ్‌భాజీ మసాలా - రెండు టేబుల్ స్పూన్లు, కారం - స్పూన్, పసుపు - పావు స్పూన్, ఉప్పు - తగినంత, వెన్న - నాలుగు టేబుల్ స్పూన్లు, నూనె, నిమ్మరసం - మూడు స్పూన్లు, కొత్తిమీర - పావు కప్పు, పావ్ - ఎనిమిది.
తయారు చేసే విధానం: కూరగాయలన్నింటినీ తరిగి ఉంచాలి. ఆలు, క్యారెట్, కాలీఫ్లవర్, పచ్చి బఠాణీల్లో తగినన్ని నీళ్లు పోసి ఉడికించి, మెత్తగా మెదపాలి. ప్యాన్‌లో నూనె వేడయ్యాక ఉల్లితరుగు వేయాలి. అది వేగాక.. అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, క్యాప్సికమ్, టొమాటో ముక్కలను వేయించాలి. అవి కూడా వేగాక.. కారం, పావ్‌భాజీ మసాలా, ఉప్పు, తగినన్ని నీళ్లు, మెదిపిన కూరగాయలను జతచేయాలి. పది నిమిషాల తర్వాత నిమ్మరసం, కొత్తిమీర, సగం వెన్న జోడించి.. సెగ తీసేయాలి. మిగిలిన వెన్నతో మధ్యలో కట్ చేసిన పావ్లను అటూ ఇటూ తిప్పుతూ కాలనివ్వాలి. ఇక ఉల్లి స్లైసులతో ‘పావ్ భాజీ’ ఆరగించడమే ఆలస్యం.
రాజ్ కచోరీ
కావల్సిన పదార్థాలు: ఉప్మారవ్వ - అర కప్పు, గోధుమపిండి - ఒకటిన్నర కప్పులు, కారం, బేకింగ్ సోడా, సోంపు, మిరియాల పొడులు - పావు స్పూన్ చొప్పున, ఉప్పు - తగినంత, నూనె - వేయించడానికి సరిపడా
స్టఫింగ్ కోసం: ఆలు - రెండు, ఉడికించిన శనగలు, పెసలు - అర కప్పు చొప్పున, చాట్‌మసాలా, కారం - స్పూన్ చొప్పున, పెరుగు, స్వీట్ చట్నీ, గ్రీన్ చట్నీ - పావు కప్పు చొప్పున, జీలకర్ర పొడి - అర స్పూన్, సేవ్, బూందీ, దానిమ్మ గింజలు, కొత్తిమీర తరుగు - రెండు టేబుల్ స్పూన్ల చొప్పున
తయారు చేసే విధానం: ఆలూను ఉడికించి పొట్టు తీసి, ముక్కలు కోయాలి. వెడల్పాటి పాత్రలో గోధుమపిండి, రవ్వ, తగినన్ని నీళ్లు, ఉప్పు, ఒక స్పూన్ నూనె, కారం, మిరియాలపొడి, సోంపు పౌడర్, బేకింగ్ సోడా వేసి కలపాలి. అరగంట నానిన తర్వాత.. కచోరీలు చేసి కాగుతున్న నూనెలో వేయించాలి. మరో పాత్రలో శనగలు, పెసలు, ఆలూ ముక్కలు, కొత్తిమీర తరుగు, పెరుగు, రెండు రకాల చట్నీలూ, కారం, ఉప్పు, జీలకర్ర పొడి, సేవ్, బూందీ, దానిమ్మ గింజలు వేసి కలపాలి. ఇప్పుడు కచోరీల మధ్యలో తుంచి, అందులో తగినంత శనగల మిశ్రమం వేయాలి. అంతే ‘రాజ్ కచోరీ’ తిని ఆనందించడమే.






కామెంట్లు (0)