నిపుణులకు నెలకు రూ.4.58 లక్షల వరకు చెల్లింపు.. టాప్ సివిల్ సర్వెంట్ల వేతనాల కంటే రెట్టింపు
ప్రయివేట్ సంస్థలకు రూ.లక్షల్లో ప్రజాధనం
ప్రభుత్వంలో లేని శాశ్వత నైపుణ్య వ్యవస్థ
కాంట్రాక్టు నియామకాలతో ఏఐ పాలన
ఎంతకాలం? : నిపుణులు
ఏఐ విప్లవం.. డిజిటల్ ఇండియా.. టెక్నాలజీతో పాలనలో సమూల మార్పులు అంటూ మోడీ ప్రభుత్వం భారీగా ప్రచారం చేసుకుంటోంది. కానీ ఆ ప్రచారానికి ప్రజాధనంతో చెల్లించాల్సిన మొత్తం కూడా భారీగానే కనిపిస్తోంది. కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిధిలోని నేషనల్ ఈ-గవర్నెన్స్ డివిజన్ (ఎన్‌ఈజీడీ) ఏఐ, మెషిన్ లెర్నింగ్ నిపుణులను సరఫరా చేసే సంస్థల కోసం నిర్ణయించిన రేట్లు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. అత్యున్నత ఏఐ నిపుణుల కోసం నెలకు రూ.4.58 లక్షల వరకు చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ‘డిజిటల్ ఇండియా’ పేరుతో ప్రచారం ఒకవైపు.. ప్రజాధనంతో భారీ కాంట్రాక్టు వ్యయం మరోవైపు అన్న విమర్శలు ఇప్పుడు వినిపిస్తున్నాయి.
న్యూఢిల్లీ : మోడీ ప్రభుత్వం ఏఐని ప్రభుత్వ పాలనలోకి తీసుకొస్తోంది. ఇందుకు భారీ మొత్తంలో వెచ్చించేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. అయితే ఇక్కడ అసలు ప్రశ్న.. దానికి ఎంత ఖర్చు? ఎవరి ద్వారా ఖర్చు? ఎంతకాలం కాంట్రాక్టు నిపుణులపై ఆధారపడాలి? అన్నదే. ఎన్‌ఈజీడీ రూపొందించిన ఏఐ/ఎంఎల్ మానవ వనరుల ఎంపానెల్ రేట్ల ప్రకారం అత్యున్నత స్థాయి నిపుణులకు నెలకు రూ.4,58,500 వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తం నేరుగా ఉద్యోగి జీతం కాదు.. నిపుణుడిని అందించే సంస్థకు ప్రభుత్వం చెల్లించే రేటు. అందులో సంస్థ ఖర్చులు, మార్జిన్ కూడా ఉంటాయి. అయినప్పటికీ ప్రభుత్వ ఖజానాపై పడే భారాన్ని మాత్రం విస్మరించలేమని విశ్లేషకులు చెప్తున్నారు.క్యాబినెట్ కార్యదర్శి కంటే
ఏఐ నిపుణుడి రేటు ఎక్కువ!కేంద్ర ప్రభుత్వ క్యాబినెట్ కార్యదర్శి ప్రాథమిక వేతనం నెలకు రూ.2.50 లక్షలు. ప్రభుత్వ కార్యదర్శి ప్రాథమిక వేతనం రూ.2.25 లక్షలు. అదే సమయంలో ఏఐ సొల్యూషన్ ఆర్కిటెక్ట్, డేటా సైన్స్ లీడ్, ఏఐ/ఎంఎల్ లీడ్ కోసం నెలకు రూ.4,58,500 వరకు రేటు నిర్ణయించారు. అంటే రేటు పరంగా చూస్తే.. దేశ అత్యున్నత సివిల్ సర్వీసు స్థాయి అధికారుల ప్రాథమిక వేతనాల కంటే దాదాపు రెట్టింపు.
అయితే ఇక్కడ ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పాలి. ఇది ఏఐ నిపుణుడి చేతికి వెళ్లే జీతం కాదు. ఏజెన్సీకి ప్రభుత్వం చెల్లించే మొత్తం. అందులో ఏజెన్సీ నిర్వహణ ఖర్చులు, మార్జిన్ కూడా ఉంటాయి. అయినా.. ఒక్కో నిపుణుడి సేవకు ప్రభుత్వ ఖజానా నుంచి లక్షల రూపాయలు వెచ్చించాల్సిన స్థాయికి వ్యవస్థ చేరడం గమనార్హం.’డిజిటల్ ఇండియా’కు కాంట్రాక్టు మోడల్!మోడీ ప్రభుత్వం డిజిటల్ ఇండియాను తమ విజయంగా తీవ్ర ప్రచారం చేస్తోంది. ఇప్పుడు అదే డిజిటల్ వ్యవస్థను నడిపించేందుకు ప్రయివేట్ ఏజెన్సీల నుంచి నిపుణులను తీసుకుంటోంది. ఎన్‌ఈజీడీ అధికారిక టెండర్ ప్రకారం.. ఏఐ/ఎంఎల్ నిపుణులను అందించే భాగస్వామ్య సంస్థలను ఎంపిక చేయడం, ప్రభుత్వ విభాగాలకు అవసరమైన సాంకేతిక నైపుణ్యాన్ని వేగంగా అందించడం ఈ వ్యవస్థ ఉద్దేశం. అంటే ‘స్వయం సమృద్ధి’ అంటూ ప్రచారం చేసే కేంద్ర ప్రభుత్వం.. కీలకమైన కొత్త సాంకేతిక నైపుణ్యాల కోసం మాత్రం బయటి సంస్థలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడిందా? అన్న ప్రశ్న తలెత్తుతోంది.ప్రభుత్వ ఫైళ్లపై ఏ’ఐ’!ఏఐ నిపుణులతో చేయించబోయే పనులు చిన్నవి కావు. క్యాబినెట్ నోట్లు, టెండర్ పత్రాలు, పాలసీ డాక్యుమెంట్లను సంక్షిప్తం చేసే సాఫ్ట్‌వేర్.. ఉమంగ్, డీజీలాకర్ వంటి ప్రభుత్వ యాప్‌లలో చాట్‌బాట్లు.. ప్రాంతీయ భాషల్లో వాయిస్ ఆధారిత సేవలు..సర్టిఫికెట్లు, ఐడీలు, స్కాన్ చేసిన పత్రాల నుంచి డేటా సేకరణ..ముఖ గుర్తింపు ఆధారిత హాజరు, డిజిటల్ ఆన్‌బోర్డింగ్.. ఇలా ఇవన్నీ ప్రతిపాదనలో ఉన్నాయి. ఇలా అత్యంత సున్నితమైన డేటాతో వ్యవహరించే వ్యవస్థలను ప్రయివేట్ ఏజెన్సీల ద్వారా నిర్మిస్తున్నప్పుడు.. డేటా భద్రత, గోప్యత, బాధ్యత ఎవరిది? అన్నది ప్రశ్నార్థకంగా మారింది.
‘ఏఐ భారత్’ కాదు.. ‘కాంట్రాక్ట్ భారత్’!
టెక్నాలజీని ప్రభుత్వంలోకి తీసుకురావడాన్ని ఎవరూ వ్యతిరేకించరు. కానీ సాంకేతికత పేరుతో ప్రజాధనం ఖర్చు చేస్తున్నప్పుడు దానికి సమానమైన జవాబుదారీతనం కూడా ఉండాలి. ప్రభుత్వంలోనే శాశ్వత ఏఐ నైపుణ్యాన్ని పెంచకుండా.. కాంట్రాక్టు మోడల్‌పై ఆధారపడటం దీర్ఘకాలిక పరిష్కారమా? డేటా భద్రతకు బాధ్య ఎవరిది? అనే ప్రశ్నలు అందరిలోనూ మెదులుతున్నాయి.
ఏఐకి లక్షలు.. పాలనకు ప్రశ్నలు!
దేశంలో ఏఐ నైపుణ్యాలకు డిమాండ్ పెరిగింది. ప్రభుత్వం కూడా ప్రతిభను ఆకర్షించేందుకు పోటీ పడుతోంది. కానీ మోడీ ప్రభుత్వం ‘మినిమమ్ గవర్నమెంట్, మ్యాక్సిమమ్ గవర్నెన్స్’ అంటూ ప్రచారం చేసిన నేపథ్యంలో ఇప్పుడు మరో ప్రశ్న ఎదురవుతోంది. ప్రభుత్వానికి శాశ్వతంగా అవసరమైన సాంకేతిక నైపుణ్యాలను ప్రభుత్వ వ్యవస్థలోనే ఎందుకు పెంచకూడదు? ప్రతిసారి ప్రయివేటు ఏజెన్సీల ద్వారా నిపుణులను తీసుకోవాల్సిందేనా? ప్రజాధనంతో చెల్లించే ఈ భారీ రేట్లకు ఫలితాలను కొలిచే పారదర్శక వ్యవస్థ ఉందా? ఇవే అసలు ప్రశ్నలు.


