హెచ్-1బీ వర్కర్లు, విద్యార్థులకు మరో కష్టం
వాషింగ్టన్ : అమెరికాకు వలసొచ్చే వారిపై ఇప్పటికే అనేక ఆంక్షలు విధించిన ట్రంప్ సర్కార్… ఇప్పుడు ఇమిగ్రేషన్ విధానంలో మరిన్ని కొత్త రూల్స్ తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. అంతర్జాతీయ విద్యార్థులకు వీసాల జారీలో మార్పులు, పని అనుమతుల పొడిగింపును నిలిపివేయడం వంటి నిబంధనలు తీసుకురానున్నట్టు తెలుస్తోంది. దీంతో హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్ మరింత కఠినతరం కానుంది. అంతేకాక విదేశీ ఉద్యోగులను నియమించుకునే సంస్థలపై అదనపు భారం పడనుంది. ఈ మేరకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ, కార్మిక శాఖ తాజా రెగ్యులేటరీ ఎజెండాల్లో ఈ ప్రతిపాదిత మార్పులను పేర్కొంది. వీటిల్లో కొన్నింటిని ఈ నెలలోనే అమల్లోకి తెచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇమిగ్రేషన్ విధానాల్లో కొన్ని మార్పులను తుది నిబంధనల కింద ప్రకటించనున్నారు. మిగతా వాటిని ప్రతిపాదనల కింద ప్రకటించి.. ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించనున్నట్టు తెలుస్తోంది. కొత్త మార్పులు అమల్లోకి వస్తే.. భారతీయ వృత్తి నిపుణులు, విద్యార్థులు, హెచ్-4 వీసాదారులపై ఎక్కువగా ప్రభావం పడనుంది. అయితే, ఈ ప్రతిపాదిత విధానాలపై అమెరికా సర్కారు నుంచి అధికారిక ప్రకటన రాలేదు.
ఇమిగ్రేషన్ విధానంలో ట్రంప్ ప్రణాళికలు..
ప్రస్తుతం అమెరికాలో 50 మందికి పైగా ఉద్యోగులున్న కంపెనీలు.. అర్హత కలిగిన హెచ్-1బీ పిటిషన్లకు అదనంగా 4000 డాలర్లు, ఎల్-1 పిటిషన్లకు 4500 డాలర్ల చొప్పున ఫీజును చెల్లిస్తున్నాయి. అయితే, తొలిసారి అమెరికాకు వచ్చిన ఉద్యోగి లేదా సంస్థ మారిన ఉద్యోగిని స్పాన్సర్‌ను చేసినప్పుడు మాత్రమే ఈ ఫీజు వర్తిస్తుంది. కానీ, ఇప్పుడు ప్రతిపాదిత నిబంధనల ప్రకారం.. వీసా పొడిగింపు పిటిషన్లకు కూడా ఈ అదనపు ఫీజులు చెల్లించాల్సి వస్తుంది. ఈ కొత్త రూల్స్ ఈనెలలోనే అమల్లోకి రానున్నట్టు తెలుస్తోంది.
ఈసారి థర్డ్ పార్టీ క్లయింట్ లొకేషన్‌లో హెచ్-1బీ ఉద్యోగుల నియామకాలపై కూడా అమెరికా దృష్టిపెట్టింది. కొత్త రూల్స్ ప్రకారం.. ఇకపై క్లయింట్ సైట్‌లో నియామకాలు చేపట్టినప్పుడు.. ఉద్యోగి-యజమాని వాస్తవ సంబంధాలను ఆయా కంపెనీలు నిరూపించుకోవాల్సి ఉంటుంది. అంతేగాక, ఆ లొకేషన్లలో పనిచేసే వృత్తి నిపుణుల అసైన్‌మెంట్ రికార్డులను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి తెలియజేయాల్సి ఉంటుంది. సాధారణంగా థర్డ్‌పార్టీ క్లయింట్ లొకేషన్ నియామకాలను ఎక్కువగా భారత ఐటీ, కన్సల్టింగ్ సంస్థలు చేపడుతుంటాయి.
ఇక, కొత్త నిబంధనల్లో హెచ్-1బీ ఉద్యోగుల వేతనాల అంశాన్ని ప్రస్తావించారు. ఎంట్రీ లెవల్ ఉద్యోగాల్లో కనీస వేతన పరిమితిని రెట్టింపు చేసేలా ప్రతిపాదనలు చేశారు. దీని వల్ల విదేశీ వృత్తి నిపుణులను స్పాన్సర్ చేసే కంపెనీలపై అదనపు భారం పడనుంది. ఇక, హెచ్-4 భాగస్వాముల పని అనుమతులను ఆటోమేటిక్‌గా పొడిగించే వ్యవస్థకు స్వస్తి పలకనున్నారు. మరోవైపు, అంతర్జాతీయ విద్యార్థులకు ప్రస్తుతమున్న ‘డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్’ వ్యవస్థను తొలగించి ఫిక్స్‌డ్ పీరియడ్ వీసా జారీ వ్యవస్థను తీసుకురానున్నారు. ప్రస్తుతం ఎఫ్-1 వీసాలపై అమెరికా లో ఉన్న అంతర్జాతీయ విద్యార్థులు, జే-1 వీసాలపై వచ్చిన ఎక్స్ఛేంజ్ విజిటర్లకు ‘డ్యూరేషన్ ఆఫ్ స్టే’ వెసులుబాటు ఉంది. అంటే.. వారు ఎంతకాలం చదవాలనుకుంటే లేదా ఇంటర్న్ ప్రోగ్రామ్‌లో పాల్గొనాలనుకుంటే.. అంతకాలం అమెరికాలో ఉండొచ్చు. ఇకపై దాన్ని తొలగించి ‘పరిమిత కాల నివాస అనుమతి’తో కూడిన వీసాలను మంజూరు చేయాలని ట్రంప్ సర్కారు యోచిస్తోంది. ఇది కూడా ఈ నెలలోనే అమల్లోకి వచ్చే అవకాశాలున్నాయి.
భారతీయులపై ప్రభావం
అమెరికా ఏటా జారీ చేసే హెచ్-1బీ వీసాల్లో భారతీయులకే అగ్రభాగం దక్కుతున్నాయి. ఇప్పుడు కొత్త నిబంధనల వల్ల అమెరికాలో విదేశీ ఉద్యోగుల నియామకాలు తగ్గితే.. ఆ ప్రభావం మన వృత్తి నిపుణులపై పడుతుంది. మరోవైపు, 2024-25 విద్యా సంవత్సరం డేటా ప్రకారం.. అగ్రరాజ్యంలో 3.6లక్షల మంది భారతీయ విద్యార్థులున్నారు. అమెరికాలోని మొత్తం విదేశీ విద్యార్థుల్లో వీరు 31 శాతానికి సమానం. ఇక, దాదాపు లక్ష మంది భారతీయులు హెచ్-4 వీసాలపై ఉద్యోగాలు చేస్తున్నారు.
అమెరికా కంపెనీలకూ ఇబ్బందులే
మరోవైపు, ఇప్పటికే ఉన్న వీసా నిబంధనల కారణంగా అమెరికా కంపెనీలు విదేశీ వృత్తి నిపుణులను పెద్ద సంఖ్యలో కోల్పోవాల్సి వస్తోంది. గడిచిన ఏడాది కాలంలో అగ్రరాజ్యంలో దాదాపు 65 శాతం కంపెనీలు కనీసం ఒక విదేశీ ఉద్యోగినైనా కోల్పోయినట్టు ‘ఎన్వాయ్ గ్లోబల్’ అనే ఇమిగ్రెంట్ సేవల సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. అయితే వీసా ప్రాసెసింగ్ ఆలస్యాలు, కఠిన పరిశీలన తదితర కారణాల వల్ల విదేశీ ఉద్యోగులను వేగంగా నియమించు కోలేకపోతున్నామని ఆయా కంపెనీలు చెబుతున్నాయి.
అమెరికా వీసాలకు కొత్త రూల్స్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



