Thursday, August 20, 2026
E-PAPER
Homeబీజినెస్ఏడో రోజూ నిఫ్టీ కుదేలు

ఏడో రోజూ నిఫ్టీ కుదేలు

- Advertisement -

బెంబెలెత్తిస్తున్న చమురు సెగలు
సెన్సెక్స్‌ మరో 326 పాయింట్లు పతనం

అమెరికా-ఇరాన్ మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ గడువు ముగిసినప్పటికీ దౌత్యపరమైన పరిష్కారం లభించకపోవడం, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు విపరీతంగా పెరగడం దలాల్‌ ‌స్ట్రీట్‌‌ను బెంబేలెత్తిస్తున్నాయి. ఈ ప్రతికూల పరిణామాల నేపథ్యంలో దేశీయ సూచీలు బుధవారం కూడా తీవ్ర నష్టాలతో ముగిశాయి. బిఎస్‌ఇ సెన్సెక్స్ వరుసగా నాలుగో రోజు క్షీణించగా, ఎన్ఎస్ఇ నిఫ్టీ వరుసగా ఏడో రోజూ పతనాన్ని చవి చూసింది. బుధవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 325.78 పాయింట్లు లేదా 0.42 శాతం నష్టపోయి 76,909.68కు పరిమితమయ్యింది. ట్రేడింగ్ సమయంలో ఒక దశలో ఇది 412.57 పాయింట్లు పడిపోయి 76,822.89 కనిష్ట స్థాయికి చేరింది. కాగా.. గత నాలుగు రోజుల్లోనే సెన్సెక్స్ ఏకంగా 1,170.28 పాయింట్లు లేదా 1.49 శాతం కోల్పోయింది. మరోవైపు, 50 షేర్ల ఎన్ఎస్ఇ నిఫ్టీ 76.60 పాయింట్లు లేదా 0.32 శాతం పడిపోయి 24,078.30 వద్ద ముగిసింది. గత ఏడు సెషన్లలో నిఫ్టీ ఏకంగా 505.5 పాయింట్లు లేదా 2 శాతం పతనమవ్వడం ఇన్వెస్టర్లను తీవ్ర నిరాశకు గురి చేస్తోంది.
అమెరికా-ఇరాన్ మధ్య 60 రోజుల తాత్కాలిక సడలింపు గడువు ముగియడం, ఇంధన సరఫరాలో అంతరాయాలు తలెత్తుతాయనే భయాలతో గ్లోబల్ ఆయిల్ బెంచ్ మార్క్ బ్రెంట్ క్రూడ్ ధర 1.04 శాతం పెరిగి బ్యారెల్‌కు 91.97 డాలర్లకు చేరింది. దీనికి తోడు అమెరికా ఫెడరల్ రిజర్వ్ ద్రవ్యోల్బణ నియంత్రణ చర్యలు కొనసాగుతాయనే భావనతో యుఎస్ ఎఫ్ఓఎమ్‌సి మినిట్స్ విడుదలకానున్న వేళ ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహారించారు. ఆసియా మార్కెట్లలో దక్షిణ కొరియా కోస్పి దాదాపు 6 శాతం పడిపోగా, జపాన్ నిక్కీ 3 శాతానికి పైగా నష్టపోయింది. యూరప్ మార్కెట్లు కూడా నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్-30లో పవర్ గ్రిడ్, బాజాజ్ ఫైనాన్స్, లార్సన్ అండ్ టూబ్రో, ఐటిసి, హిందుస్థాన్ యూనిలీవర్, రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రధానంగా నష్టపోగా.. హెచ్‌సిఎల్ టెక్, ఎటర్నల్, కోటక్ మహీంద్రా బ్యాంక్, సన్ ఫార్మా షేర్లు లాభాల్లో ముగిశాయి. బిఎస్ఇ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.73 శాతం పడిపోయింది. రంగాలవారీగా పవర్ (1.69 శాతం), క్యాపిటల్ గూడ్స్ (1.59 శాతం), యుటిలిటీస్ (1.25 శాతం) రంగాలు నష్టాలను చవి చూశాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -