ఆరోగ్య కేంద్రం, తహసీల్దార్ కార్యాలయం తనిఖీ చెసిన కలెక్టర్ రాహుల్ శర్మ
నవతెలంగాణ – మల్హర్ రావు
సీజనల్ వ్యాధులపై వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. మంగళవారం తాడిచెర్లలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం,తహసీల్దార్ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అందుతున్న వైద్య సేవలు,సిబ్బంది పనితీరు, రోగులకు అందుతున్న సేవలు,మందుల లభ్యత తదితర అంశాలను ఆయన పరిశీలించారు. పీహెచ్‌సీకి వైద్య సేవలకు వచ్చిన జిల్లా కలెక్టర్ నేరుగా మాట్లాడి ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని,ఆసుపత్రికి వచ్చే ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
పాము, తేలు కాటుకు అవసరమైన అత్యవసర ఔషధాలను అందుబాటులో ఉంచాలని వైద్యాధికారులను కలెక్టర్ ఆదేశించారు.అనంతరం జిల్లా కలెక్టర్ తాడిచర్ల తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. కార్యాలయంలో రెవెన్యూ అంశాలపై సమీక్ష నిర్వహించారు.కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన భూ సేకరణ ప్రక్రియ,భూ వివరాలు,పెండింగ్ అంశాలు, రైతులకు సంబంధించిన సమస్యలు, పరిష్కరించాల్సిన అంశాలపై తహసీల్దార్‌ను అడిగి తెలుసుకున్నారు. భూ సేకరణకు సంబంధించిన ప్రక్రియను నిబంధనల ప్రకారం వేగవంతంగా పూర్తి చేయాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.అలాగే తాడిచర్ల డేంజర్ జోన్‌కు సంబంధించిన విచారణ అంశాలపై కూడా జిల్లా కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు.
విచారణకు సంబంధించిన రికార్డులు,నివేదికలు, పెండింగ్ అంశాలను పరిశీలించి,నిబంధనల ప్రకారం అవసరమైన చర్యలు చేపట్టాలని విచారణ వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.ప్రజలకు పారదర్శక సేవలు అందించాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు.ఈ కార్యక్రమంలో కాటారం ఆర్డిఓ రవీందర్, శిక్షణా డిప్యూటి కలెక్టర్ నవీన్ రెడ్డి,తహసీల్దార్ రవికుమార్,డిటి ఇమామ్ బాషా, సర్పంచ్ బండి స్వామి, వైద్యలు తదితరులు పాల్గొన్నారు.



