Friday, August 28, 2026
E-PAPER
Homeజాతీయంరూ.100 బాకీకి 3 పైసలే చెల్లింపు

రూ.100 బాకీకి 3 పైసలే చెల్లింపు

- Advertisement -

రూ.22,000 కోట్ల రుణానికి రూ.6.5 కోట్లతో పరిష్కారం!
జీ గ్రూప్‌ సుభాష్ చంద్ర అప్పులు రద్దు
రుణదాతల తీవ్ర అభ్యంతరం
దివాలా ప్రక్రియకు ఎన్‌సీఎల్‌టీ ఆమోదం
ఇది గుండు గీయడమే : ప్ర‌తిప‌క్షాలు


న్యూఢిల్లీ : ప్రజాధనానికి రక్షణగా ఉండాల్సిన బ్యాంకింగ్ వ్యవస్థకు మరొక కోలుకోలేని దెబ్బ తగిలింది. బిజెపి ప్రభుత్వ హయంలో కార్పొరేట్‌ ‌గద్దలకే న్యాయం దక్కుతుందని మరోసారి నిరూపణ జరిగింది. జీ గ్రూప్ వ్యవస్థాపకుడు సుభాష్ చంద్రకు చెందిన ఏకంగా రూ.22,006.57 కోట్ల వ్యక్తిగత రుణ బకాయిలను కేవలం రూ. 6.5 కోట్లు చెల్లించి వదిలించుకునే పరిష్కార ప్రణాళికకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌‌సిఎల్‌‌టి) ఆమోదం తెలిపింది. గతంలో ఈ కేసును విచారించిన ఎన్‌సిఎల్‌‌టి ఇద్దరు సభ్యుల బెంచ్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడంతో ఇటీవల ట్రిబ్యునల్ ప్రెసిడెంట్ ఈ వ్యవహారాన్ని థర్డ్ మెంబర్‌గా జ్యుడీషియల్ మెంబర్ నిలేష్ శర్మకు బదిలీ చేశారు. ఎన్‌‌సిఎల్‌‌టి మూడో న్యాయ సభ్యుడు నీలేశ్‌ శర్మ మంగళవారం దివాళా పరిష్కార నియమావళి (ఐబిసి)లోని సెక్షన్‌ 114 కింద ఈ ప్రణాళికను ఆమోదించారు. ప్రతిపాదిత మొత్తం చాలా తక్కువగా ఉందని, దీనిని ఆమోదించడానికి చట్టపరమైన లేదా ఆర్థికపరమైన ఆధారం లేదని రుణదాతలు చేసిన అభ్యంతరాలను ఆయన తిరస్కరించారు. దీంతో వేల కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని అప్పులుగా తీసుకుని ఎగ్గొట్టిన పారిశ్రామికవేత్తలకు దివాలా చట్టం వేదికగా రెడ్ కార్పెట్ పరుస్తున్నారనే విమర్శలకు బలంచేకూర్చేలా ఈ తీర్పు ఉండటం గమనార్హం.

​రూ.100 బాకీకి 3 పైసలే చెల్లింపు..!
ఎన్‌‌సిఎల్‌‌టి తీర్పుతో సుభాష్ చంద్రకు అప్పులిచ్చిన బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఏకంగా రూ.99.97 శాతం నష్టాన్ని భరించాల్సి వస్తోంది. అంటే బ్యాంకర్లకు రావాల్సిన ప్రతి వంద రూపాయల బాకీలో కేవలం 3 పైసలు మాత్రమే రికవరీ కానుంది. మిగిలిన 99.97 రూపాయలు తుడిచిపెట్టుకుపోనున్నాయి. ఇది ప్రత్యక్షంగా బ్యాంకింగ్ రంగానికి భారీ కన్నం వేయడమేనని ఆర్థిక విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సామాన్యుడు కేవలం వేల రూపాయల గృహ లేదా వాహన రుణం కట్టకపోతే రికవరీ ఏజెంట్లతో ఇళ్లు వేలం వేసే బ్యాంకులు, దిగ్గజ పారిశ్రామికవేత్తల విషయంలో మాత్రం చేతులెత్తేస్తున్నాయనే ఆరోపణలు మరోసారి రుజువయ్యాయి.

​ఇది గుండు గీయడమే : జైరామ్‌ ‌రమేష్‌
ఎన్‌‌సిఎల్‌‌టి తీర్పునపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ ఎక్స్ వేదికగా మండిపడ్డారు. సాధారణంగా అప్పు ఇచ్చిన వారు తమ బకాయిల్లో కొంత మొత్తాన్ని వదులుకుంటే ఆర్థిక పరిభాషలో దాన్ని హెయిర్‌కట్ అంటారని ఆయన గుర్తుచేశారు. కానీ.. రూ. 22,000 కోట్ల బాకీకి కేవలం రూ. 6.5 కోట్లు మాత్రమే చెల్లించి 99.97 శాతం వదులుకోవడం హెయిర్‌కట్ కాదని, ఇది బ్యాంకింగ్ వ్యవస్థకు గుండు గీయడమే అని ధ్వజమెత్తారు. 2016 నాటి ఇన్‌సాల్వెన్సీ అండ్ బ్యాంక్‌రప్సీ కోడ్ (ఐబిసి) చట్టాన్ని ఇది తీవ్రంగా గేలి చేయడమేనని విమర్శించారు.

​విజయ్ మాల్యా ఎద్దేవా..
విదేశాలకు పారిపోయిన వివాదాస్పద వ్యాపారవేత్త విజయ్ మాల్యా సైతం ఈ పరిణామంపై స్పందిస్తూ భారత బ్యాంకింగ్ వ్యవస్థ తీరును ఎద్దేవా చేశారు. ‘నా మిత్రుడు సుభాష్‌కి అభినందనలు. నా రూ. 6,203 కోట్ల రుణ డిమాండ్‌కు గాను బ్యాంకులు నా నుంచి ఏకంగా రూ. 14,100 కోట్లు గుంజాయి. కానీ మిగతా పెద్ద రుణగ్రహీతలు మాత్రం కేవలం సున్నా మొత్తానికే సెటిల్మెంట్లు చేసుకుంటున్నారు. మన దేశంలో రుణ పరిష్కార న్యాయం అంటే ఇదేనేమో.!. దీనిపై మీడియా ఎందుకు ప్రశ్నించదు.’ అని మాల్యా ట్వీట్ చేశారు.

​ఎల్‌ఐసి ఫైనాన్స్‌ ‌తీవ్ర అభ్యంతరం..
జీ సుభాష్‌ ‌చంద్ర ప్రతిపాదనపై ఎల్‌ఐసి హౌసింగ్ ఫైనాన్స్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ న్యాయపోరాటం చేసింది. తమకు రావాల్సిన రూ. 1,322.39 కోట్ల బకాయిలకు గాను కేవలం రూ. 38.09 లక్షలు (అంటే కేవలం 0.028 శాతం) మాత్రమే ఇస్తామనడం అత్యంత దారుణమని, ఇది చట్టవిరుద్ధమని వాదించింది. అయితే మెజారిటీ ఓటింగ్ కలిగిన ఇతర రుణదాతలు ఈ ప్లాన్‌కు ఆమోదం తెలిపారనే కారణంతో జడ్జి నిలేష్ శర్మ దీనిని ఆమోదించారు. సుభాష్ చంద్ర వ్యక్తిగత ఆస్తులు తక్కువగా ఉన్నాయని, ప్లాన్ తిరస్కరిస్తే ఆయన పూర్తిగా దివాలా తీస్తారని దానివల్ల బ్యాంకర్లకు మరింత నష్టం జరుగుతుందని 144 పేజీల తీర్పులో ట్రిబ్యునల్ పేర్కొంది. అప్పుడు ఈ రూ. 6.5 కోట్లు కూడా రావని ట్రిబ్యునల్ ఒక విధంగా బుకాయించడం ఆందోళనకరం.సామాన్యుల డిపాజిట్లతో నడిచే బ్యాంకులు, వేల కోట్ల రూపాయలను ఇలా తుడిచిపెట్టేస్తుండటం వల్ల అంతిమంగా నష్టపోయేది ప్రజలేనని, ఈ నిర్ణయం భవిష్యత్తులో కార్పొరేట్ రుణాల బకాయిల రికవరీపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -