వయసు మళ్లినవారి జీవితాలపై పత్రికల్లో వచ్చిన కథలు ఒక పుస్తకంగా రావడం విశేషమే. సాధారణంగా రాసేవాళ్లే తమ రచనలను సంపుటాలుగా తెచ్చుకుంటారు. ఓపికున్నవారు వాటిని చదువుతుంటారు. పాఠకుడి బాధ్యత అంతటి తీరిపోతుంది. తాము చదివిన కథల్లో నచ్చిన వాటిని పుస్తకంగా వేసే సాహితీప్రియులు అరుదే. ఈ సంపుటి రాక వెనుక వారిని వెంటాడిన సందేశాత్మకత ఒకటుంది. సమాజంలో ముసలి తల్లిదండ్రులు పడుతున్న బాధలు నలుగురికి తెలియాలనే ఆలోచన వీరిది. వృద్ధాప్యం అనే ఇరుసు చుట్టూ తిరిగే కథలను ఏరుకొని రాము ఇటిక్యాల్, దామరకుంట శంకరయ్య సంపాదకులుగా 'శిశిర యామిని' అనే శీర్షికతో పెద్దల కథలు అనే పుస్తకం తెచ్చారు. ఇవి 'పెద్దలకు మాత్రమే' బాపతు కథలు కావు, పెద్దల బతుకులు వివరించేవి.
వృద్ధాప్యపు శిశిరంలో వణుకుతున్న జీవులు దిక్కుతోచని చీకటిలో చిక్కుకొని కష్టాల, కలతల రాపిడిలో చచ్చి బతుకుతున్నారని తెలియచెప్పడమే ఈ కథల ఎంపిక, సంపుటీకరణ వెనుక ఉన్న ఆలోచన. ఇంటింటా సాగుతున్న ఈ దుర్మార్గ తతంగాన్ని చూస్తూ ఊరుకోలేక ఒక్క ఇంటిలోనైనా వెచ్చని వెలుగులు పూయకపోతాయా అనే చిరు ఆశతో ఈ పుస్తక రాకకు వీరు పూనుకున్నారు. తాము ఏమి ఆశించి ఇందుకు పూనుకున్నామో అనే సంగతులను సంపాదకులు ముందు మాటలో ఓపిగ్గా వివరించారు. 'పీడితులైన వయోధికులు యాచనతో, అవమానాలతో, వేధింపులతో అతలాకుతలమై.. అగౌరవంగా బతుకుటగానీ, మరణించుట గానీ జరగకూడదు' అనే విలక్షణ ఆకాంక్ష మాది, కనీస కదలిక మొదలు కావాలనే ఆశయం మాది' లాంటి మరిన్ని వాక్యాల్లో వారి ఆశల్ని పొందుపరచారు.
ఈ సందేశాన్ని తెలియపరచడానికి వారు 25 కథలను ఎంచుకున్నారు.
అమ్మహాతల్లి అనే తొలి కథలో ఎదిగిన కొడుకులతో ఏగలేని తల్లి.. భూమిని అమ్మి వృద్ధాశ్రమం ఏర్పాటు చేస్తుంది. కథ చివరలో పాటల కార్యక్రమం ఉంటుంది. అందులో ఓ చరణం 'నీవిడిచిపెట్టిన బువ్వ నాకిస్తే తిందును, కోడలు తిట్టి బుస కొట్టే దాన్నేమందును, పెంపుడు కుక్కకు మీదున్న ప్రేమైన లేదాయెరా, మనసు విప్పి నాతో మాటలు కరువాయే' అని ఉంటుంది. దీని రచయిత నడిమెట్ల రామయ్య. డా. ధరణికోట రమేష్ కుమార్ రాసిన అరణ్య రోదన 'ఎందుకేడుస్తావురా.. మనం పనికి రానొల్లమని తేల్చిండ్రు కద. ఒట్టిపోయిన బర్రెల్నేం చేస్తరు. మన మాంసం ఎవరికీ పనికి రాదాయె. లేకపోతేనా?' అనే ఓదార్పు వాక్యంతో కథ ముగుస్తుంది.
కన్నవారిని ఆడిపోసుకొనే కొడుకులు, కోడళ్ల బాధ పడలేక.. అనుకోకుండా ఓ గుడిలో కలిసిన ఆడ, మగ 'ఈ సమాజం దృష్టిలో లేచిపోయిన వృద్ధజంటగా' మిగిలిపోవడానికి సిద్దపడతారు. ఈ కథ పేరు ఆలంబన, రచయిత సంహితా నాయుడు. 'ఇంట్లో ఎవరికేమైనా అందరు పరుగులు తీస్తారు. వయసు మళ్లినవాళ్లకు అనారోగ్యమైతే ఎవరైనా ఒకరు ఆసుపత్రికి తోడుగా వస్తారు. ఆ వచ్చినవాళ్లు కూడా ఈ ముసలివాళ్లు తమవాళ్లు కాదన్నట్లుగా మొహాలు తిప్పుకుంటారు' అని పలమనేరు బాలాజీ రాసిన 'కొత్త నడక' కథలో ఉంది.
భూములు అమ్మేసిన కొడుకుల మోసాన్ని నిలదీస్తూ ఓ తండ్రి 'వయసు మళ్ళిన మేం మీ కళ్ళకు పంట కోసిన పొలాల్లో మిగిలిపోయిన 'కొయ్యకల్లు' గా కనిపిస్తున్నాం కదరా' అంటారు రచయిత రావుల పుల్ల చారి. కడుపున పుట్టిన కొడుకులు ఇంట్లోంచి వెళ్లగొడితే బిచ్చమెత్తుకుంటూ భార్యను పోషించే దీనగాథ అయోధ్యరెడ్డి రాసిన 'చావు వాసన ' కథలో ఉంది. తన దగ్గరే ఉందురని ముసలివాళ్ల నీడను అమ్మేసుకుంటాడు కొడుకు. 'కొడుకు గిట్లుంటే ఇంకా నా కోడలుకు మేమంటే బిచ్చగాళ్ల తీర్గ. పెండ్లాం మాటలు విని అయ్యవ్వలను ఛీ కొట్టిండు. ఇంట్లకెల్లి ఎల్లగొట్టిన్రు' అని వీరయ్య చెప్పుకుంటాడు. కీ.శే. ఇల్లందుల సరస్వతీ దేవి రాసిన కథ 'తీయని పలకరింపు'. ఇల్లు ఇప్పుడే రాయించుకోవాలన్న కోడలు, ఈ జబ్బు వస్తే తగ్గదు, డాక్టర్ ఎందుకు అనే కొడుకు పీడను వదిలించుకొని గంగాధరరావు ఆశ్రమంలో చేరిపోతాడు. ఈ తీయని పలకరింపు ఇంట్లో వాళ్ళది కాదు. వృద్ధాశ్రమంలో విమల అనే పరిచారికది.
మరో ఆశ్రమ జీవి కథ కూతురు రామిరెడ్డి రాసిన 'నా కొడుకులు'. ఇందులో తండ్రి మానసికంగా, శారీరకంగా పడిన బాధ అంతా ఇంతా కాదు. కథ చివరలో కొడుకుకు రాసే ఉత్తరంలో ఆ ఏకరువు చూడొచ్చు. 'మీ చెర నుంచి బయటపడి ఈ ఆశ్రమంలో చేరాను. ఇప్పుడు హాయిగా ఉన్నాను' అనడం చదువరికి కూడా హాయినిస్తుంది. ఎవరూ బయటకు తీసికెళ్లని ముసలి భద్రమ్మకు ఓట్ల రోజున తప్పనిసరిగా బయటికెళ్లే అవకాశం ఎంత సంబరాన్ని ఇచ్చిందో సమ్మెట ఉమాదేవి 'సంతకం' కథలో చూడొచ్చు.
మిగతా పెద్దల కథలు కూడా పేరున్న రచయితలవే. మధురాంతకం నరేంద్ర, వంజారి రోహిణి, తగుళ్ల గోపాల్, రామా చంద్రమౌళి, ఈతకోట సుబ్బారావు, అట్టాడ అప్పలనాయుడు, బోరి మురళీధర్ తదితరులవి. తల్లిదండ్రులను హీనంగా చూస్తున్న నేటి సమాజానికి, సంతానానికి కనువిప్పు కలగాలనే ఈ ప్రయత్నం ఎంతో గొప్పది. రాము ఇటిక్యాల్, దామరకుంట శంకరయ్య ఆశించిన ఫలితం దక్కాలి.
బద్రి నర్సన్, 9440128169







కామెంట్లు (0)