ఇకపై నేను ఎన్నికల్లో పోటీ చేయను: సిద్ధరామయ్య
నిజాయతీకి చోటు లేకుండా పోయిందని ఆవేదన
బెంగళూరు: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై కర్నా టక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత రాజకీయాలు అవినీతి మయం అయ్యాయని 2028 అసెంబ్లీ ఎన్నికలు సహా భవిష్యత్తులో ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయబోనని ప్రకటించారు. వయసుతో పాటు అనారోగ్య సమస్యలు కూడా ఒక కారణమని తెలిపారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేశారు. 2028 అసెంబ్లీ ఎన్నికల నాటికి తనకు 82 ఏండ్లు వస్తాయని సిద్ధరామయ్య తెలిపారు. గతంలో లాగా ఉత్సాహంతో పని చేయడం తనకు ఇక సాధ్యం కాదని రాసుకొచ్చారు. ఎన్నికల్లో పోటీ చేయకపోయినా ప్రజా జీవితంలో చురుగ్గా ఉంటానని అన్నారు. ప్రజల తరఫున గళం వినిపిస్తూనే ఉంటానని స్పష్టం చేశారు.
అయితే, వరుణ నియోజకవర్గం నుంచి మళ్లీ పోటీ చేయాలని ప్రజలు కోరినప్పటికీ వాటిని తిరస్కరించినట్టు సిద్దరామయ్య వెల్లడించారు. గతంలో తాను పోటీ చేసినప్పుడు ప్రజలే విరాళాలు సేకరించి తనను గెలిపించారని అన్నారు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేస్తే ప్రజలకే డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి ఉందన్నారు. నేటి రాజకీయాలు పూర్తిగా భ్రష్టుపట్టాయని, నిజాయతీకి చోటు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సిద్ధరామయ్య వివరించారు. మాండ్య జిల్లా కేఆర్ పేటలో శనివారం జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో సిద్దరామయ్య ఈ వ్యాఖ్యలు చేయగా, ఆ తర్వాత తన నిర్ణయాన్ని వివరిస్తూ ఎక్స్‌లో సుదీర్ఘ పోస్ట్ పెట్టారు.
‘ఆ సంతృప్తి నాకు ఉంది’
కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశాల మేరకు సిద్ధరామయ్య మే 28న ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అనంతరం డీ.కే. శివకుమార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది. అయితే, రాజీనామా అనంతరం కాంగ్రెస్ అధిష్ఠానం ఆఫర్ చేసిన రాజ్యసభ సీటును తాను సున్నితంగా తిరస్కరించానని సిద్ధరామయ్య చెప్పారు. తాను 1978లో తాలూకా బోర్డు సభ్యుడిగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించానని, విజయాలు, ఓటములు రెండింటినీ చూశానని పేర్కొన్నారు. కానీ, తాను నమ్మిన సూత్రాలకు విరుద్ధంగా ఎప్పుడూ ప్రవర్తించకపోవడం, అంతరాత్మకు ద్రోహం చేయకపోవడం అనే సంతృప్తి ఉందని తెలిపారు. ఇదిలా ఉండగా, కొన్ని నెలల క్రితం సిద్ధరామయ్య స్వచ్ఛందంగా కర్నా టక సీఎం పదవి నుంచి వైదొలిగారు. అనంతరం ఆయన్ను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సభ్యుడిగా నియమిస్తున్నట్లు పార్టీ ప్రకటించింది. ప్రస్తుతం డీకే శివకుమార్ కర్ణాటక ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
మంత్రివర్గ విస్తరణ- ఢిల్లీకి సీఎం
రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు సమయం ఆసన్నమవుతున్న వేళ ముఖ్యమంత్రి డీకే శివకు మార్ సోమవారం దిల్లీకి బయలుదేరనున్నారు. అక్కడ పార్టీ పెద్దలతో సమావేశమై మంత్రివర్గ విస్తరణకు పచ్చజెండా ఊపే అవకాశం ఉంది. కర్నా టక భవన్‌లో కేంద్ర మంత్రులు, కర్నా టకకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలతో సమావేశం కానున్నారు. అనంతరం, పెండింగ్‌లో ఉన్న మంత్రివర్గ విస్తరణకు అనుమతి కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై రాహుల్ గాంధీతో చర్చించే అవకాశం ఉందని వర్గాలు తెలిపాయి.
అయితే, మంత్రి పదవి కోసం కొంతమంది ఎమ్మెల్యేలు చివరి నిమిషంలో లాబీయింగ్ చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నారని సమాచారం. ఇందుకోసం దిల్లీకి పయనమయినట్లు సమాచారం. కాగా, గత వారం, నీట్ పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీకి సంబంధించి రాహుల్ గాంధీ నేతృత్వంలో జరిగిన ఆందోళన కారణంగా, ముఖ్యమంత్రి డీకే, మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు బీకే హరిప్రసాద్ మంత్రివర్గ విస్తరణపై చర్చించలేకపోయారు. ఇప్పుడు నీట్ పోరాటం ముగిసింది కాబట్టి, రాహుల్ గాంధీతో కలిసి మంత్రివర్గ విస్తరణకు అనుమతి పొంది, మంత్రుల జాబితాను ఖరారు చేసే అవకాశం ఉందని వర్గాలు చెబుతున్నాయి. మంత్రివర్గ విస్తరణ ఏ క్షణంలోనైనా జరగవచ్చని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఇప్పటికే స్పష్టం చేశారు.
రాజకీయాలు అవినీతిమయం
- Advertisement -
- Advertisement -



