ఇండ్లు, వైన్స్ షాపులు,
వ్యవసాయ బావులే వారి టార్గెట్
రూ.20 లక్షల సొత్తు స్వాధీనం
8 కేసుల ఛేదింపు : ఎస్పీ నరసింహ
నవతెలంగాణ-సూర్యాపేట
మద్యం, జల్సాలకు అలవాటుపడి సులభంగా డబ్బు సంపాదించాలని ముఠాగా ఏర్పడి ఇండ్లు, వైన్స్ షాపులు, వ్యవసాయ బావుల వద్ద చోరీలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా దొంగలు ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి నగదు, బంగారు, వెండి ఆభరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, వ్యవసాయ పరికరాలు, మద్యం సీసాలు, వాహనాలు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం విలేకర్ల సమావేశంలో ఎస్పీ నరసింహా వివరాలు వెల్లడించారు. పాత సూర్యాపేట ఎక్స్ రోడ్డు వద్ద సూర్యాపేట-దంతాలపల్లి రహదారిపై పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో మూడు ద్విచక్ర వాహనాలపై వ్యవసాయ మోటార్‌తో అనుమానాస్పదంగా వెళ్తున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా చోరీల విషయం వెలుగులోకి వచ్చింది. నిందితులు పాత సూర్యాపేటకు చెందిన సురికంటి నరేష్ అలియాస్ నరేష్ రెడ్డి, మేరెడ్డి మహిపాల్ రెడ్డి అలియాస్ ప్రీతం రెడ్డి, పన్నాల గిరిధర్ రెడ్డి, శివరాత్రి అరవింద్ అలియాస్ అరుణ్, కాసాల ఉదయ్ కిరణ్ రెడ్డి అలియాస్ కిరణ్ రెడ్డిగా గుర్తించారు.
ఏడాది కాలంగా ముఠాగా ఏర్పడి సూర్యాపేట జిల్లాలోని వివిధ ప్రాంతాలతో పాటు నల్లగొండ జిల్లా నకిరేకల్ పరిధిలో చోరీలకు పాల్పడ్డారు. ఆత్మకూర్(ఎస్) పరిధిలో 2, చివ్వెంల పరిధిలో 2, సూర్యాపేట రూరల్ పరిధిలో 3, నకిరేకల్ పరిధిలో ఒక చోరీ కేసుతో మొత్తం 8 కేసులను పోలీసులు ఛేదించారు. నిందితుల నుంచి రూ.1.20 లక్షల నగదు, 7.5 తులాల బంగారం, 20.5 తులాల వెండి, మూడు స్మార్ట్ టీవీలు, సౌండ్ బార్, మైక్రోవేవ్ ఓవెన్, ఇన్వర్టర్, బ్యాటరీ, రెండు 5 హెచ్‌పీ సబ్‌మర్సిబుల్ మోటార్లు, 30 మీటర్ల కరెంట్ వైరు, 740కి పైగా మద్యం సీసాలు, మూడు మోటార్‌సైకిళ్లు, ఐదు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ముఠాను పట్టుకోవడంలో డీఎస్పీ వి. ప్రసన్న కుమార్ ఆధ్వర్యంలో సూర్యాపేట రూరల్ సీఐ పర్యవేక్షణలో ఆత్మకూర్(ఎస్) ఎస్‌ఐ ఎం.ఐలయ్య, పోలీస్ సిబ్బంది సమన్వయంతో చేశారు. నిందితులను చాకచక్యంగా పట్టుకున్న పోలీసు అధికారులను, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ప్రజలు ఇండ్లలో నగదు, విలువైన వస్తువుల భద్రతపై అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ సూచించారు.
అంతర్‌జిల్లా దొంగల ముఠా అరెస్ట్
53 నిమిషాల క్రితం

Rajabapu Odela
ప్రచురించబడింది అక్టో 06, 2026 | 2 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)