Magazines

‌ప్రజల కన్నీళ్లు తుడిచే అవకాశం పోలీసులకే ఉంది

1 గంట క్రితం

పోలీసు యూనిఫాం
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 13, 2026 | 3 నిమిషాల చదవడం

నేరాల తీరు మారింది... పోలీసింగ్‌ మారాలి
విధుల్లో ఫిట్‌‌నెస్‌, స్మార్ట్‌‌నెస్‌ తప్పనిసరి : డీజీపీ సీవీ ఆనంద్‌

పోలీసు అకాడమిలో 112 మంది
 డీఎస్పీల పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌

నవ తెలంగాణ - ప్రత్యేక ప్రతినిది

పోలీసు యూనిఫాం ధరించడం గొప్పదనీ, ప్రజలకు సేవ చేయడంతోపాటు వారి ప్రాణాలను కాపాడే అరుదైన అవకాశం పోలీసు శాఖలో పనిచేసేవారికే లభిస్తుందని డీజీపీ సీవీ ఆనంద్‌ అన్నారు. ప్రజల కన్నీళ్లు తుడిచే అవకాశం పోలీసులకే దక్కుతుందని చెప్పారు. రాష్ట్రంలో నాలుగు కోట్ల జనాభాలో సుమారు 90 వేల మందికే పోలీసు యూనిఫాం ధరించే అవకాశముందని వివరించారు. నిజాయితీ, నైతిక విలువలను విస్మరించరాదనీ, కుల, మత, రాజకీయ రాగద్వేషాలకు అతీతంగా విధులు నిర్వహించాలని స్పష్టం చేశారు. తెలంగాణ పోలీసు అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్న 112 మంది డీఎస్పీల పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌‌ను సోమవారం హైదరాబాద్‌‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014 తర్వాత పూర్తిస్థాయిలో శిక్షణ ముగించుకుని బయటకు వస్తున్న తొలి డీఎస్పీ బ్యాచ్‌ కావడంతో దీనికి ప్రత్యేకత ఉందన్నారు. 44 వారాలపాటు చట్టాలు, దర్యాప్తు విధానాలు, ఔట్‌డోర్‌ శిక్షణ, క్రీడల్లో శిక్షణ పొందిన అధికారులను అభినందించారు. శిక్షణలో ప్రతిభ కనబరిచిన వారిని ప్రశంసిస్తూ, అకాడమి అధికారులు, అధ్యాపకులు, సిబ్బందికి శుభాకాంక్షలు చెప్పారు. కొన్ని కారణాల వల్ల ముఖ్యమంత్రి పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌కు హాజరు కాలేకపోయారని వివరించారు.

30 ఏండ్ల వృత్తి జీవితానికి పునాది

పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ సందర్భంగా చేసే ప్రమాణం అధికారుల 30–35 ఏండ్ల వృత్తి జీవితానికి మార్గదర్శకంగా నిలవాలని సీవీ ఆనంద్‌ సూచించారు. రాజ్యాంగం పట్ల నిబద్ధతతో, ప్రజలకు నిజా‌యితీగా, రాగద్వేషాలకు అతీతంగా విధులు నిర్వహిస్తానని చేసిన ప్రమాణాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోవాలన్నారు.

నాయకత్వ లక్షణాలను విధుల్లో నిరూపించుకోవాలని అన్నారు. ధైర్యం, దార్శనికత, నైతిక విలువలు, నిష్పాక్షికత, బృంద స్ఫూర్తి, సంభాషణ నైపుణ్యాలు, కష్టపడే తత్వం, సాంకేతిక పరిజ్ఞానం, నూతన ఆలోచనలు, వినయం. ఈ పది లక్షణాలను ప్రతి అధికారి అలవర్చుకోవాలని సూచించారు. విధుల నిర్వహణలో నైతిక విలువలను ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించరాదన్నారు.

సైబర్‌‌ నేరాలే ప్రధాన సమస్య

తాము యూనిఫాం ధరించిన రోజుల్లో నక్సలిజం ప్రధాన సవాలుగా ఉండేదనీ, ఆ సమస్యను పోలీసులు సమర్థంగా ఎదుర్కొన్నారని సీవీ ఆనంద్‌ గుర్తుచేశారు. ప్రస్తుతం సైబర్‌ నేరాలు, వ్యవస్థీకృత నేరాలు, రోడ్డు భద్రత, ఇతర కొత్త తరహా సవాళ్లు పోలీసుల ముందున్నాయని అన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి ఆదేశాల మేరకు పోలీసు శాఖలో సంస్థాగత మార్పులు చేపట్టామని చెప్పారు. గ్రేహౌండ్స్‌ తదితర విభాగాల పునర్వ్యవస్థీకరణతోపాటు ఈగల్‌ ఫోర్స్‌, సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో, టీజీ ఫాస్ట్‌, టీజీ స్పార్క్‌ వంటి విభాగాలను బలోపేతం చేసి కొత్త సవాళ్లను ఎదుర్కొనేలా చర్యలు తీసుకున్నామని వివరించారు. నేరాలు మారాయనీ, పోలిసింగ్‌ ‌కూడా మారాలని చెప్పారు. పోలీసు శాఖలో శారీరక దారుఢ్యం, చురుకుదనం, వృత్తిపరమైన నైపుణ్యాలు అత్యంత ముఖ్యమని అన్నారు. యూనిఫాం ధరించిన తొలిరోజు ఉన్న ఉత్సాహం, క్రమశిక్షణ, ఫిట్‌నెస్‌ 30 ఏండ్ల తర్వాత కూడా కొనసాగాలని ఆకాంక్షించారు.

న్యాయం చేయడమే పోలీసుల విధి
112 సంఖ్యకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంద‌ని తెలంగాణ పోలీస్‌ అకాడమి డైరెక్టర్‌ అభిలాశ్‌బిస్త్‌ అన్నారు. ప్రజల అత్యవసర సేవల కోసం తెలంగాణ పోలీసు వ్యవస్థలో 112 సేవలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. 112 మందిలో 74 మంది పురుషులు, 38 మంది మహిళలు ఉన్నారని చెప్పారు. పోలీసుల విధి ప్రజలకు న్యాయం చేయడమేననీ, వారి పనితీరును బట్టే అంచనా వేస్తారని అన్నారు. పోలీస్‌ శిక్షణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన నేహా అగర్వాల్‌‌ ముఖ్యమంత్రి రివాల్వర్‌తోపాటు మరో మూడు పురస్కారాలను అందుకున్నారు. బెస్ట్‌ ఆల్‌రౌండ్‌ పెర్ఫార్మెన్స్‌కు సీఎం రివాల్వర్‌, రాజా బహదూర్‌ వెంకట రామారెడ్డి బంగారు పతకం, కోన రామచంద్రారెడ్డి స్మారక బంగారు పతకం, ఇండోర్‌ సబ్జెక్టుల్లో ప్రతిభకు హోంమంత్రి బేటన్‌ ఆమెకు లభించాయి. రాజా బహదూర్‌ వెంకట రామారెడ్డి బంగారు పతకంతోపాటు రూ.5,000 నగదు బహుమతి కూడా అందుకున్నారు. ఇతర విభాగాల్లో ప్రతిభ కనబరిచిన వారిలో ఔట్‌డోర్‌ సబ్జెక్టుల్లో ఎల్‌ శ్రీకాంత్‌ డీజీపీ ట్రోఫీ, ఫైరింగ్‌లో టి జాకబ్‌ అభిషేక్‌ ఉత్తమ పురస్కారం అందుకున్నారు. ఫోరెన్సిక్‌ సైన్స్‌లో డి చందన, క్రిమినాలజీలో చి ఆది శేషు రెడ్డి ఎన్‌ఐసీఎఫ్‌ఎస్‌ పతకాలు సాధించారు. దర్యాప్తులో ఉత్తమ ప్రతిభకు ఆర్‌ సాయి కిరణ్‌ రెడ్డి డైరెక్టర్‌ పతకాన్ని దక్కించుకున్నారు. - అభిలాశ్‌‌బిస్త్‌

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్