Magazines

సామాన్యుడికి సీతాఫలం దూరం

1 గంట క్రితం

Custard apple
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 08, 2026 | 2 నిమిషాల చదవడం

ఎల్‌నినో ఎఫెక్ట్‌ కానరాని కాయలు

ఒకవైపు ప్రకృతి వైపరీత్యం.. మరోవైపు వనాల ధ్వంసం

భారీగా పెరిగిన ధరలు..

నష్టాల్లో వేలంలో వనాలు దక్కించుకున్న వ్యాపారులు


నవతెలంగాణ-మహబూబ్‌‌నగర్‌ ప్రాంతీయ ప్రతినిధి
​పేదల ఆపిల్ సీతాఫల్.. అక్టోబర్‌ ‌వచ్చే నాటికి గ్రామాల్లో చెట్టు.. పుట్ట.. గట్టు ఎక్కడ చూసినా సీతాఫల చెట్లు కాయలతో కళకళలాడేవి. నేడు ఆ పరిస్థితులు లేవు. వాతావరణ మార్పుల కారణంగా ప్రకృతి ప్రసాదించిన అమృతం లాంటి ‌ఫలం ఎల్‌నినో ప్రభావంతో దిగుబడి గణనీయంగా పడిపోయింది. దీంతో గ్రామీణ ప్రాంతాలే కాక పట్టణ ప్రాంతాల్లోనూ ఈ పండ్లు అందుబాటులో లేకుండా పోయాయి. రియల్ ఎస్టేట్ పేరుతో ఒకవైపు సీతాఫలం చెట్లను లేకుండా చేస్తూ ప్రకృతిని విధ్వంసం చేస్తుంటే.. మరోవైపు ఈ ఏడాది ఎల్‌నినో వంటి ప్రకృతి వైపరీత్యాలు ‌పండ్ల దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపాయి. కాపు బాగా వస్తుందని కొంతమంది వ్యాపారులు అటవీ అధికారుల వేలం పాటలో పాల్గొని లక్షలు ఖర్చుపెట్టారు. సీజన్ దాటుతున్నా సీతాఫలం మార్కెట్లోకి రావడం లేదు. ఎక్కడన్నా కనిపించినా ధరలు రెట్టింపు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సామాజిక అడవుల్లో సీతాఫలాల చెట్లను పెంచాలని వ్యాపారులు, రైతులు కోరుతున్నారు.


కానరాని కాయలు..
నాగర్‌‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట నల్లమల శివారు ప్రాంతాల్లో సీతాఫల చెట్లు అధికంగా ఉండేది. బల్మూరు, ఉప్పునుంతల, లింగాల, పెద్దకొత్తపల్లి, అమ్రాబాద్, పదర ఒంటి మండలాల్లో ఎక్కువగా ఈ చెట్లు ఉండేవి. ఇప్పుడు చెట్లను పూర్తిగా ధ్వంసం చేసి పంట పొలాలను చేసుకున్నారు. లింగాల, అవసలకుంట, పెద్దకారు పాముల వంటి గ్రామాల నుంచి అత్యధికంగా దిగుబడి వచ్చేది. ఈ ఏడాది వర్షాలు లేకపోవడంతో దిగుబడి 10 శాతానికి మించి రావడం లేదు. వచ్చినా సైజు పెరగడం లేదు. రుచిలోనూ తేడా వస్తోంది.


​ఫారెస్ట్‌ అధికారుల వేలం
ఉమ్మడి మహబూబ్‌‌నగర్‌ ‌జిల్లా గండీడు మండల పరిధిలో సుమారు 5000 ఎకరాల్లో సీతాఫల చెట్టు ఉన్నాయి. వీటిని ఫారెస్ట్ అధికారులు వేలం వేశారు. గాదిర్యాల గ్రామానికి చెందిన శంకరయ్య వేలం పాటలో రూ. 8 లక్షల 5 వేలకు దక్కించుకున్నారు. నారాయణపేటలో సైతం సామాజిక అడవులు ఉన్నాయి. వనపర్తి జిల్లా బుద్ధారం సమీపంలో దట్టమైన అడవులున్నాయి. అడవుల్లో అత్యధికంగా సీతాఫల చెట్లు ఉంటాయి. అడవుల్లో వేలాదిమంది పేదలు ఫలాలను సేకరించి మార్కెట్లో అమ్ముకొని జీవనం సాగిస్తుంటారు. ఎల్‌‌నినో ప్రభావం వల్ల ఈ ఏడాది మార్కెట్లోకి సీతాఫలం రావడం లేదు. పేదల జీవనాధారంపైనా తీవ్ర ప్రభావం పడింది.


​ఉచితంగా దొరికే పండ్లు ఖరీదయ్యాయి : ప్రశాంత్, అమిస్తాపూర్, మహబూబ్‌‌నగర్‌
మేము దసరా చెరువులకు ఇంటికి వచ్చి గట్లకు వెళ్లే వాళ్లం. కట్టల్లో ఉన్న చెట్లకు సీతాఫలాలు కోసుకొచ్చుకునేవాళ్లం. మాకు చెట్ల మీదనే పండ్లు దొరికేవి. ఈ ఏడాది చెట్లకు పూత లేదు.. ఖాతా లేదు. హైబ్రిడ్ కాయలు అధిక ధరకు కొనాల్సి వస్తోంది.


​ఖరీదైన పండ్లు

గతంలో డజను సీతాఫలాలు వంద రూపాయలకు లభించేవి. బుట్టల్లో అమ్మేవారు. బుట్టికి గతంలో 100 రూపాయలు ఉంటే ఈసారి రూ.500 ఉంది. జిల్లాలో సీతాఫలాల వనాలు అంతరించి పోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకంలో భాగంగా సీతాఫల చెట్టను అత్యధికంగా పెంచాలి. ప్రభుత్వ భూములు గుట్టలు కొండల్లో చెట్లను పెంచే ప్రయత్నం చేయాలి. అత్యధిక పోషకాలు గలిగిన సీతాఫల వనాలను పెంచడం ద్వారా పేదలకు కొంత పౌష్టికమైన ఆహారం లభిస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా ప్రయత్నం చేయాలని సామాజికవేత్తలు, ప్రజలు కోరుతున్నారు.


​నిండా మునిగాం..
ప్రతి ఏటా సామాజిక అడవులలో సీతాఫల చెట్లను వేలంలో తీసుకునేవాళ్లం. ఈసారి గండీడ్ మండల పరిధిలో ఉన్న 5వేల ఎకరాలను ఎనిమిది లక్షలు పెట్టి టెండర్ తగ్గించుకున్నాం. కొన్ని 
చెట్లు అక్కడక్కడా కాసినా సైజు పెరగలేదు. దీంతో ఆశించిన ధర రాక అప్పులు తీరే పరిస్థితులు లేవు.
- ‌శంకరయ్య, రైతు, గండీడ్‌

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్