Magazines

న్యాయాన్ని వృత్తిగా చూడొద్దు

58 నిమిషాల క్రితం

Do not view the legal profession merely as a job.
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 04, 2026 | 5 నిమిషాల చదవడం

అది గాంధీ చెప్పిన సిద్ధాంతం..నిరు పేదలకు దూరం కాకూడదు
పిల్లల సైబర్‌ భద్రత చాలా ముఖ్యం : ‘నల్సా’ సౌత్‌‌జోన్‌ సదస్సులో సీఎం రేవంత్‌‌రెడ్డి
న్యాయం తీర్పుతోనే ముగిసిపోదు : కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి రాంమేఘవాల్
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
న్యాయాన్ని కేవలం వృత్తిగా చూడొద్దనేది జాతిపీత గాంధీజీ సిద్ధాంతమని, ఆయన దాన్ని బలంగా నమ్మారని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌‌రెడ్డి అన్నారు. మహాత్ముడు ముందుగా న్యాయవాది అని సీఎం గుర్తు చేశారు. పేదలు, బలహీనుల కోసం గాంధీజీ న్యాయాన్ని ఒక ఆయుధంగా ఉపయోగించారని తెలిపారు. అదే స్ఫూర్తితో న్యాయ సేవా సంస్థలు కూడా పనిచేస్తున్నాయని చెప్పారు. ప్రతి ఒక్కరికీ న్యాయం అందాలనీ, డబ్బు లేకపోవడం వల్ల ఎవరికీ న్యాయం దూరం కాకూడదని అభిప్రాయపడ్డారు. మన దేశం, యావత్ ప్రపంచం మహాత్మా గాంధీ జయంతి రోజున ఆ మహనీయుడిని స్మరించుకుందని వివరించారు. శనివారం జాతీయ న్యాయ సేవా ప్రాధికార సంస్థ (నల్సా) ఆధ్వర్యంలో “డిజిటల్ వేదికలపై పిల్లలకు రక్షణ, సులభంగా న్యాయం అందించడం, ఆన్‌లైన్ లైంగిక వేధింపులను అరికట్టడం, పిల్లలకు అనుకూలమైన న్యాయ వ్యవస్థను బలోపేతం చేయడం” అనే అంశంపై దక్షిణాది ప్రాంతీయ సదస్సును హైదరాబాద్‌లో నిర్వహించారు. రెండు రోజులపాటు కొనసాగే ఈ జాతీయ సదస్సులో ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. నల్సా ఆధ్వర్యంలో జరుగుతున్న దక్షిణ మండల ప్రాంతీయ సదస్సుకు హైదరాబాద్ వేదిక కావడం సంతోషదాయకమని తెలిపారు. పిల్లల సైబర్ భద్రత అనే చాలా ముఖ్యమైన అంశాన్ని సదస్సు ఎంచుకున్నందుకుగాను జస్టిస్ విక్రమ్ నాథ్ కు, నల్సాకు ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం పిల్లలు ఎక్కువ సమయం ఆన్‌లైన్‌లో గడుపుతున్నారని చెప్పారు. కానీ తమ పిల్లలు ఇంటర్నెట్‌లో ఏం చేస్తున్నారనేది చాలా మంది తల్లిదండ్రులకు తెలియడం లేదని వ్యాఖ్యానిం చారు. ఇంటర్నెట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన జీవితాలను ఎంతో సులభతరం చేశాయని వివరించారు. ప్రపంచంలోని సమాచారం మొత్తం మన చేతిలోకి వచ్చిందనీ, ఎక్కడున్న వారితోనైనా, ఎప్పుడైనా మాట్లాడగలుగుతున్నా మని వివరించారు. కానీ పిల్లలు అమాయకులనీ, ఏది నిజం ? ఏది అబద్ధం? ఏది మంచి ? ఏది చెడు? అనే విషయాలు వారికి తెలియకపోవటం వల్ల వారు చేసే చిన్నచిన్న పొరపాట్లు కూడా పెద్ద సమస్యలకు దారితీయొచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. వాటి ప్రభావం పిల్లలపైనే గాక వారి కుటుంబాలపై, సమాజంపై కూడా పడుతుందని హెచ్చరించారు. ఇంటర్నెట్ అనేది నేరాలను సృష్టించబోదని సీఎం ఈ సందర్భంగా వ్యాఖ్యనించారు. అయితే అది నేరాలను ప్రపంచవ్యాప్తంగా విస్తృతం చేయటాన్ని సులభతరం చేసిందని వివరించారు. తల్లిదండ్రులకు తమ పిల్లల విషయంలో ఏం జరుగుతుందో తెలియకపోవచ్చనీ, భయంతో పిల్లలు తమ సమస్యలను ఎవరికీ చెప్పలేకపోవటమే దీనికి కారణమని తెలిపారు. అందుకే మన ముందున్న ప్రశ్నలు చాలా ముఖ్యమైనవని తెలిపారు. పిల్లలపై సైబర్ నేరాలను ఎలా అరికట్టాలి ? మన పిల్లలను ఎలా సురక్షితంగా ఉంచాలి ? బాధిత పిల్లలకు న్యాయం ఎలా అందించాలి ? అనే అంశాలపై ఆలోచించాల్సిన అవసర ముందని నొక్కిచెప్పారు. రాష్ట్రంలో మహిళలు, పిల్లల రక్షణకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని వివరించారు. పోలీసులు, భరోసా కేంద్రాలు, చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్లు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు, ప్రత్యేక కోర్టులు, న్యాయ సేవా సంస్థలన్నీ సమన్వయంతో పని చేసినప్పుడే ప్రతీ బిడ్డకూ పూర్తి రక్షణ కల్పించగమని స్పష్టం చేశారు. మన భరోసా కేంద్రాల్లో మహిళలు, పిల్లలకు ఒకే చోట పోలీసు సహాయం, వైద్య సేవలు, న్యాయ సహాయం, కౌన్సెలింగ్ అందిస్తున్నారని తెలిపారు. అందులో భాగంగానే దేశంలోనే తొలి చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టును హైదరాబాద్‌లో ఏర్పాటు చేశామన్నారు. పిల్లల రక్షణ కోసం పోలీసు శాఖలోని విమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో ‘షీ’-భరోసా సైబర్ ల్యాబ్‌లు పనిచేస్తున్నాయని గుర్తు చేశారు. ‘సైబ్‌‌హర్‌’ యాప్ ద్వారా విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఆన్‌లైన్ భద్రతపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. విద్యార్థులనే సైబర్ అంబాసిడర్లుగా తయారు చేసి, తమ తోటి విద్యార్థులకు సైబర్ భద్రతపై అవగాహన కల్పిస్తున్నామని వివరించారు. మరోవైపు బాధితులకు అవసరమైన ప్రతి సహాయాన్ని ప్రభుత్వం అందిస్తోందని వివరించారు. ఆర్థిక సహాయం నుంచి ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశం కల్పించడం వరకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇందులో భాగంగా టీజీఎస్‌-ఎల్‌ఎస్‌ఏ పాఠశాల విద్యాశాఖతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నామని గుర్తు చేశారు. దీంతో ఉపాధ్యాయులు పిల్లలకు వారి చట్టపరమైన హక్కులపై అవగాహన కలుగుతోందని వివరించారు. ఇప్పటివరకు మూడు వేల మందికి పైగా చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులకు శిక్షణ ఇచ్చామని చెప్పారు.. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న తెలంగాణ హైకోర్టుకు, టీజీఎస్‌ఎల్‌ఎస్‌కు సీఎం ధన్యవాదాలు తెలిపారు. న్యాయం అంటే కేవలం నేరస్తుడికి శిక్ష పడటం కాదని, బాధితుడి జీవితాన్ని తిరిగి నిలబెట్టడమని అన్నారు. న్యాయం అంటే అతనికి గౌరవాన్ని తిరిగి ఇవ్వడం, ముఖ్యంగా ఒక బిడ్డ కోల్పోయిన బాల్యాన్ని తిరిగి అందించడమే నిజమైన న్యాయమని నొక్కి చెప్పారు. తెలంగాణ హైకోర్టు, టీజీఎస్-ఎల్‌ఎస్‌ఏతో కలిసి చర్చించి ఆన్‌లైన్ నుంచి పిల్లల భద్రత కోసం ‘సమగ్ర చైల్డ్ ఆన్‌లైన్ సేఫ్టీ ఫ్రేమ్‌వర్క్‌’ను సిద్ధం చేయాలని ఆదేశించారు.

న్యాయ సేవా సంస్థల కార్యక్రమాలకు పూర్తి సహకారం
న్యాయ సేవాసంస్థలు చేస్తున్న మంచి కార్యక్రమాలు రాష్ట్రం లోని ప్రతి జిల్లాకు, ప్రతిగ్రామానికి చేరేలా తమ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని సీఎం తెలిపారు. కార్యక్రమంలో పిల్లల తల్లిదండ్రులను కూడా భాగస్వాములను చేయాలని సూచించారు. పిల్లల ఆన్‌లైన్ భద్రతపై జరిగే ప్రతి చర్చలో తల్లిదండ్రులు భాగం కావాలని సూచించారు. ప్రతి పిల్లవాడు, ప్రతి తల్లీదండ్రీ సైబర్ నేరాల కట్టడి కోసం – 1930, చైల్డ్ హెల్ప్‌లైన్ కోసం – 1098 నంబర్లను తప్పక గుర్తుంచుకోవాలని కోరారు. ‘మీ పిల్లలతో మాట్లాడండి. వారు ఇంటర్నెట్‌లో ఏం చేస్తున్నారు ? ఎవరితో మాట్లాడుతున్నారు ? ఏం చూస్తున్నారు? తెలుసుకోండి. వారిని తప్పుపట్టేలా కాకకుండా, ఆసక్తితో, అవగాహనతో మాట్లాడాలి. వాళ్లు మన పిల్లలు, వారికి మన మద్దతు కావాలి, మన మార్గదర్శకత్వం కావాలి. అన్నింటికంటే ముఖ్యంగా మన ప్రేమ, మన అవగాహన కావాలి. మన పిల్లలను సురక్షితంగా ఉంచేందుకు మనమంతా కలిసి పనిచేద్దాం, ఈ సదస్సు విజయవంతం కావాలి. ఇందులో జరిగే చర్చలు, అందించే సిఫారసులు తెలంగాణకే కాదు దేశానికే మార్గదర్శకంగా నిలవాలి...’ అని సీఎం ఆకాంక్షించారు.

న్యాయం కోసం సాగే ప్రయాణం కేవలం తీర్పుతో ముగిసిపోదు
న్యాయం కోసం సాగే ప్రయాణం కేవలం తీర్పుతో ముగిసిపోదని కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి రాంమేఘవాల్ అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ... తీర్పును దాటి, బాధితుడైన బిడ్డకు కౌన్సెలింగ్, అవసరమైన వైద్య సేవలు, విద్య కొనసాగింపు, పరిహారం, సురక్షిత పునరావాసం కల్పించేలా చూడటం కూడా అందరి బాధ్యతని గుర్తు చేశారు. 2024 నుంచి అమల్లో ఉన్న నల్సా 'పిల్లలకు అనుకూలమైన న్యాయ సేవల పథకం' ఆవశ్యకతను గుర్తించిందన్నారు. ఈ పథకం మానసిక ఆవేదనను పరిగణనలోకి తీసుకునే, లింగ-సున్నితత్వంతో కూడిన, దివ్యాంగుల పట్ల సానుకూల దృక్పథం కలిగిన విధానాన్ని అనుసరిస్తోందని వివరించారు. పిల్లల శ్రేయస్సే పరమావధిగా, బాలల సంక్షేమ కమిటీ, కుటుంబం, సహాయక సంస్థల మధ్య నిరంతర పర్యవేక్షణ కొనసాగాలని సూచించారు. ఈ సదస్సులో సుప్రీంకోర్టు న్యాయమూర్తి, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌ జస్టిస్ విక్రమ్ నాథ్ , సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ ఆర్ మహదేవన్ , జస్టిస్ అలోక్ అరాధే , తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ప్యాట్రన్-ఇన్-చీఫ్, జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ పాల్గొన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్, కర్నాటక, కేరళ, ఒడిశా, సిక్కిం, తమిళనాడు, త్రిపుర హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి, తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌ జస్టిస్ శ్యామ్ కోషి , తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, కేరళ, మధ్యప్రదేశ్, ఒడిశా, తమిళనాడు హైకోర్టుల న్యాయమూర్తులు, ఉన్నతాధికారులు, పలువురు మాజీ న్యాయమూర్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంచార లోక్ అదాలత్ వాహనాలను సీఎం రేవంత్‌‌రెడ్డి ప్రారంభించారు.

చిన్నారులే గొప్ప ఆస్తి: సుప్రీంకోర్టు న్యాయమూర్తి పిఎస్‌ నరసింహ
‘మానవాళికి ఉన్న గొప్ప ఆస్తులన్నింటిలోకీ అత్యంత విలువైన ఆస్తి ‘చిన్నారి’ మాత్రమే. అయితే, ఈ నాగరికత, సంస్కృతి దీనిని ఒక అత్యంత ముఖ్యమైన ప్రాథమిక సూత్రంగా ఎందుకో గుర్తించలేకపోయింది. విప్లవకారుడు అరవిందో స్వాతంత్ర్య పోరాటం నుంచి వైదొలిగినప్పుడు, ‘‘మీరు స్వాతంత్ర్య పోరాటంలో ఎందుకు పాల్గొనడం లేదు? ’’అని అడిగితే, ‘‘నాకు అంతకంటే ముఖ్యమైన పని ఉంది, నేను మన దేశ భవిష్యత్తును సురక్షితం చేయాలి,’’ అని సుప్రీం కోర్టు న్యాయమూర్తి పి.ఎస్. నరసింహ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘మన పిల్లల భవిష్యత్తును సురక్షితం చేయడమే దాని అర్థం. మొదటగా, చిన్నారి కంటే గొప్ప ఆస్తి మరేదీ లేదని మనం గ్రహించాలి’’

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్