Magazines

సమతా ఫ్రీ షిప్ స్కీంలో ఉచితంగా ఉన్నత విద్య

55 నిమిషాల క్రితం

Free higher education
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 20, 2026 | 2 నిమిషాల చదవడం

ఆదివాసీలు, ట్రాన్స్ జెండర్లు, వికలాంగులకు అవకాశం

డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం


నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఆదివాసీలు, ట్రాన్స్ జెండర్లు, వికలాంగులకు ఉచితంగా ఉన్నత విద్యనందిస్తున్నట్టు డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం తెలిపింది. ఈ మేరకు సోమవారం విశ్వవిద్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. వారికి ఉన్నత విద్యనందించేందుకు అమలు చేస్తున్న స్కీం “సమతా ఫ్రీ షిప్” కింద 516 మంది ఆదివాసీలు, నలుగురు ట్రాన్స్ జెండర్లు, 146 మంది వికలాంగులు నమోదు చేసుకున్నట్టు తెలిపింది. 1982లో ప్రారంభమైన విశ్వవిద్యాలయంలోకి ఇంకా అడుగుపెట్టని వారికి అవకాశాలు కల్పించేందుకు 2025-26 విద్యా సంవత్సరంలో ఈ స్కీంను విశ్వవిద్యాలయం అందుబాటులోకి తెచ్చింది. తెలంగాణ అడవుల్లోని గోండు, కోయ, చెంచు, కొండరెడ్లు తదితర ఆదిమ తెగల పిల్లలకు డిగ్రీ పూర్తిగా ఉచితంగా యూనివర్సిటీ అందిస్తోంది. ఈ వర్గాల వారికి ఏడాదికి రూ. 3,200 ఫీజు కూడా భారమే అని గ్రహించి, ట్యూషన్ ఫీజును పూర్తిగా మాఫీ చేసింది. కేవలం రూ. 500 రిజిస్ట్రేషన్ ఫీజు మాత్రమే చెల్లించి డిగ్రీ లో చేరొచ్చు. ఉచిత పాఠ్య పుస్తకాలు, ఆడియో-వీడియో పాఠాలు, వారి గూడెం దగ్గరే సమీపంలోని స్టడీ సెంటర్లో చదువుకునేలా యూనివర్సిటీ ఏర్పాట్లు చేసింది. ఈ పథకం ద్వారా గత విద్యా సంవత్సరంలో 376 మంది విద్యార్ధులు పలు కోర్సుల్లో చేరగా ఈ విద్యా సంవత్సరం 516 మంది ఆదివాసీ తెగల విద్యార్థులు ఉన్నత విద్యలో అడుగుపెట్టారు.


తెలంగాణలో 10+2 అర్హత ఉన్న ఏ ట్రాన్స్ జెండర్ అయినా ఏ డిగ్రీ కోర్సులోనైనా చేరవచ్చు. రూ.500తో అడ్మిషన్ పొందితే మిగిలిన ఫీజు మొత్తం మాఫీ అవుతుంది. దేశంలోనే ఇలాంటి అవకాశం కల్పించిన మొదటి విశ్వవిద్యాలయంగా డా. బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంగా నిలిచింది. క్లాసుకు వచ్చినా, ఇంటి నుంచేచదివినా ఒక్క రూపాయి అదనంగా కట్టనక్కర్లేదు. దీంతో 2025-26 విద్యా సంవత్సరంలో ముగ్గురు విద్యార్ధులు పలు కోర్సుల్లో చేరగా ఈ విద్యా సంవత్సరం 2026-27లో నలుగురు విద్యార్ధులు అడ్మిషన్ పొందారు. వికలాంగులకు 40 శాతంపైగా వైకల్యం ఉన్న వారికి కూడా ఇదే పథకం కింద ఉచిత విద్యను యూనివర్సిటీ అందుబాటులోకి తెచ్చారు. అందులో భాగంగా 2025-26 విద్యా సంవత్సరంలో 94 మంది దివ్యంగా విద్యార్ధులు పలు కోర్సుల్లో చేరగా ఈ విద్యా సంవత్సరం 2026-27 లో 146 మంది వికలాంగ విద్యార్ధులు అడ్మిషన్ తీసుకున్నారు. ఈ మూడు వర్గాల నుంచి రానున్న ఐదేండ్ల కాలంలో కనీసం ఒక వెయ్యి మందిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాలని యూనివర్సిటీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే జైళ్లలో ఖైదీలతో పాటు, దేశ సరిహద్దుల్లో కాపలా కాసే సైనికులకు యూనివర్సిటీ ఉచిత విద్యను అందిస్తున్న సంగతి తెలిసిందే. మరిన్ని వివరాలకు యూనివర్సిటీని: http://braou.ac.in, http://braouonline.in లేదా టోల్ ఫ్రీ: 18005990101, హెల్ప్ డెస్క్: 040-23680333 / 555లలో సంప్రదించొచ్చు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్