Magazines

గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు ఐక్యంగా పోరాడాలి : టీఎస్ యూటీఎఫ్

1 గంట క్రితం

Gazetted principals should fight unitedly:
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 14, 2026 | 3 నిమిషాల చదవడం

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్

రాష్ట్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల విద్యా ప్రమాణాలను పెంపొందించడానికి, గెజిటెడ్ హెడ్‌మాస్టర్లు ఎదుర్కొంటున్న అకడమిక్, పరిపాలనా, ఆర్థిక, సర్వీసు సంబంధిత సమస్యల పరిష్కారానికి సమష్టిగా కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్ యూటీఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి పిలుపునిచ్చారు. విద్యారంగంలో ప్రజాస్వామిక విలువలు, సామాజిక న్యాయం, సమాన విద్యావకాశాలను పరిరక్షించడమే లక్ష్యంగా ప్రధానోపాధ్యాయులందరినీ ఐక్యం చేసి పోరాడతామని స్పష్టం చేశారు. పాఠశాలల నిర్వహణలో ప్రధానోపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలపై మంగళవారం నిర్వహించిన రధానోపాధ్యాయుల రాష్ట్ర వర్క్‌షాప్‌నకు రవి అధ్యక్షత వహించి మాట్లాడారు.

నూతన రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా ఏకీకృత సర్వీసు నిబంధనలు రూపొందించి ప్రధానోపాధ్యాయులకు ఉన్నత స్థాయి పదోన్నతులు ఇవ్వాలని రవి డిమాండ్ చేశారు. అలాగే, అన్ని జిల్లాలకు డీఈవో, అన్ని డివిజన్లకు డిప్యూటీ డీఈవో, అన్ని మండలాలకు ఎంఈవో పోస్టులు మంజూరు చేయాలని కోరారు. పాఠశాలల్లో కనీస బోధనేతర సిబ్బంది లేకపోవడంతో హెడ్‌మాస్టర్లపై తీవ్ర అదనపు భారం పడుతోందని, ప్రతి పాఠశాలకు కంప్యూటర్ ఆపరేటర్‌ను నియమించాలని, మధ్యాహ్న భోజన పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి నిధులను పెంచాలని విజ్ఞప్తి చేశారు. పాఠశాలల నిర్వహణలో ఎదురవుతున్న సమస్యలు, వాటి పరిష్కారాలపై రూపొందించిన చర్చా పత్రాన్ని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ. వెంకట్ ప్రతిపాదించగా, వివిధ జిల్లాల నుంచి హాజరైన గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు చర్చలో పాల్గొని పలు విలువైన సూచనలు చేశారు. అనంతరం ఈ క్రింది ముఖ్యాంశాలతో కూడిన తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు

ఆమోదించిన తీర్మానాలు

1. ప్రతి సంవత్సరం బదిలీలు, పదోన్నతులు నిర్దిష్ట సమయంలో నిర్వహించడానికి ప్రత్యేక క్యాలెండర్‌ను విడుదల చేయాలి; సమగ్రమైన నిబంధనలు రూపొందించాలి.

2. సీనియారిటీ, వేతన స్థిరీకరణ, సెలవులు, పదవీ విరమణ ప్రయోజనాలు తదితర సర్వీసు సమస్యలను త్వరితగతిన, పారదర్శకంగా, న్యాయబద్ధంగా పరిష్కరించాలి. పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారానికి నిర్దిష్ట కార్యాచరణ చేపట్టాలి.

3. ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, ప్రధానోపాధ్యాయ, బోధనేతర సిబ్బంది పోస్టులను ప్రాధాన్యతా క్రమంలో భర్తీ చేయాలి. విద్యార్థుల సంఖ్య, పాఠశాల అవసరాలకు అనుగుణంగా సిబ్బందిని కేటాయించాలి.

4. హెడ్‌మాస్టర్లు బోధన, విద్యా పర్యవేక్షణపై దృష్టి సారించేలా అనవసరమైన నివేదికలు, పునరావృత ఆన్‌లైన్ ఎంట్రీలు, ఒకే సమాచారాన్ని వివిధ పోర్టళ్లలో నమోదు చేసే విధానాన్ని తగ్గించాలి. ఒకసారి నమోదు చేసిన సమాచారాన్ని అన్ని విభాగాలు వినియోగించుకునేలా సమీకృత డిజిటల్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి.

5. హెడ్‌మాస్టర్లకు పాఠశాల విద్యా ప్రణాళిక, ఉపాధ్యాయుల సమన్వయం, విద్యార్థుల అభ్యసన పురోగతి సమీక్ష, బోధనా పద్ధతుల మెరుగుదల వంటి అంశాలలో తగిన అధికారాలు, స్వేచ్ఛ కల్పించాలి.

6. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పెంపొందించడానికి తెలంగాణ హైస్కూల్ లెర్నింగ్ ఇంప్రూవ్‌మెంట్ ప్రోగ్రామ్‌ను సమర్థంగా అమలు చేయాలి.

7. పాఠశాలల నిర్వహణ, మరమ్మతులు, పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్, బోధనా సామగ్రి అవసరాలకు తగిన నిధులను సకాలంలో విడుదల చేయాలి. నిధుల వినియోగంలో పారదర్శకతను పాటిస్తూ, నిబంధనల పరిధిలో హెడ్‌మాస్టర్లకు అవసరమైన ఆర్థిక అధికారాలు కల్పించాలి.

8. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో తగిన తరగతి గదులు, సురక్షిత భవనాలు, ప్రత్యేక మరుగుదొడ్లు, తాగునీరు, విద్యుత్, గ్రంథాలయం, ప్రయోగశాలలు, కంప్యూటర్లు, క్రీడా సదుపాయాలు కల్పనకు దివ్యాంగ విద్యార్థులకు అనుకూలమైన వసతులను అభివృద్ధి చేయాలి.

9. పాఠశాల పరిపాలన, విద్యా నాయకత్వం, డిజిటల్ సాంకేతికత, ఆర్థిక నిర్వహణ, సిబ్బంది సమన్వయం వంటి అంశాలపై నాణ్యమైన శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలి.

10. హెడ్‌మాస్టర్ల బాధ్యతలు, అధికారాలు, జవాబుదారీతనాన్ని స్పష్టంగా నిర్దేశించాలి. సంబంధిత అధికారాలు ఇవ్వకుండా బాధ్యతలను మాత్రమే పెంచే విధానాన్ని నివారించాలి.

11. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం, రాజ్యాంగ విలువలు, లింగ సమానత్వం, పర్యావరణ పరిరక్షణ, ప్రజాస్వామిక చైతన్యం పెంపొందేలా చూడాలి. మానసిక ఆరోగ్యం, కెరీర్ మార్గదర్శనం, క్రీడలు, కళలకు ప్రాధాన్యత ఇవ్వాలి.

12. హెడ్‌మాస్టర్లు ఎదుర్కొంటున్న పరిపాలనా సమస్యలు, వివాదాల పరిష్కారానికి జిల్లా, రాష్ట్ర స్థాయిలో సమర్థవంతమైన ఫిర్యాదుల పరిష్కార వేదికను ఏర్పాటు చేయాలి. తదితర 20 అంశాలపై తీర్మానాలను సమావేశం ఆమోదించింది.

విద్యా విధానాల రూపకల్పనలో ప్రధానోపాధ్యాయులకు తగిన భాగస్వామ్యం, అధికారాలు, వనరులు కల్పించినప్పుడే ప్రభుత్వ పాఠశాలలు మరింత సమర్థంగా పనిచేసి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించగలవని వర్క్‌షాప్ అభిప్రాయపడింది. హెడ్‌మాస్టర్ల ఐక్యతను బలోపేతం చేస్తూ, వారి వృత్తిపరమైన గౌరవం, హక్కులు మరియు బాధ్యతలను పరిరక్షించడానికి టీఎస్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో మరింత ఉధృతంగా కృషి చేయాలని ఏకగ్రీవంగా నిర్ణయించింది. వర్క్‌షాప్‌లో టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శులు రవికుమార్, రంజిత్ కుమార్, వెంకటప్ప, శారద, ప్రధానోపాధ్యాయులు వెంకట్ రెడ్డి, దామోదర్, చంద్రశేఖర్, డి.రాములు, రమేష్, నాగేంద్రమ్మ, రామలింగయ్య, రవీందర్, విజయలక్ష్మి, మనోహర్, కె. రాములు, కృష్ణారావు, ఉమారాణి, లక్ష్మారెడ్డి, రవిబాబు, ఆంజనేయులు, హరిశంకర్, వెంకటరత్నం, గోపాల్ నాయక్, శ్యామ్‌సుందర్, శంకర్ నాయక్ తదితరులు ప్రసంగించారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్