జంతర్ మంతర్పై నిషేదం ఎత్తి వేయాలి
23 న రాష్ట్రవ్యాప్త ఆందోళనలు : ఏఐఏడబ్ల్యూయూ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం (ఏఐఏడబ్ల్యూయూ) ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ డిమాండ్ చేశారు. మంగళవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సర్ను రద్దు చేయడంతో పాటు జంతర్ మంతర్పై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలన్నారు. మోడీ ప్రభుత్వం అదానీ, అంబానీ వంటి బడా కార్పొరేట్ల ప్రయోజనాలే పరమావధిగా పని చేస్తోందని విమర్శించారు.
దేశ సంపద కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతమవుతుండగా నిరుద్యోగం, ధరల పెరుగుదల, ప్రజల కొనుగోలు శక్తి క్షీణత, ఆర్థిక అసమానతలు తీవ్రమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు, విద్యార్థులు, యువత ఉద్యమిస్తుంటే, వారి సమస్యలను పరిష్కరించకుండా నిరసన తెలిపే వేదికలను మూసివేయడం సరికాదన్నారు. డిమాండ్ల సాధన కోసం వ్యవసాయ, గ్రామీణ కార్మికుల జాతీయ వేదిక ఆధ్వర్యంలో అక్టోబర్ 23న దేశవ్యాప్తంగా జరిగే ఆందోళనలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
ఎన్నికల సంస్కరణలకు ఐక్య ఉద్యమం...
ఎన్నికల సంస్కరణలు, జ్ఞానేశ్ కుమార్ రాజీనామా, సర్ రద్దు తదితర డిమాండ్ల సాధన కోసం అఖిల భారత స్థాయిలో విశాల ఐక్య ఉద్యమాన్ని నిర్మించాలని నిర్ణయించినట్టు వెంకట్ తెలిపారు. మంగళవారం ఢిల్లీలోని హరికిషన్ సింగ్ సుర్జీత్ భవన్లో సివిల్ సొసైటీ సంస్థలు, ప్రజాసంఘాలు, ప్రముఖులు, మేధావులు, రాజకీయ పార్టీల నేతలతో సన్నాహక సమావేశం నిర్వహించినట్టు తెలిపారు. ఈ సమావేశంలో ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్, సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్, సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఏ. బేబీ, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి. రాజా తదితరులతో పాటు విద్యార్థి, యువజన, కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక, మహిళా సంఘాల ప్రతినిధులు హాజరయ్యారని తెలిపారు.






కామెంట్లు (0)