Magazines

మతసామరస్యం, జాతీయ సమైక్యతే రాజీవ్‌ ఆశయం

52 నిమిషాల క్రితం

Religious harmony and national
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 20, 2026 | 2 నిమిషాల చదవడం

మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, 
ఎమ్మెల్సీ బి. మహేశ్ కుమార్‌ గౌడ్‌

చార్మినార్‌ వద్ద ఘనంగా 
సద్భావన యాత్ర సంస్మరణ వేడుకలు

డాక్టర్‌ మల్లికార్జున్‌కు సద్భావన 
అవార్డు ప్రదానం


నవతెలంగాణ–చార్మినార్‌
మతసామరస్యం, జాతీయ సమైక్యత, సోదరభావమే దివంగత మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ ఆశయాలని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ బి. మహేశ్ కుమార్‌ గౌడ్‌ అన్నారు. 1990 అక్టోబర్‌ 19న చార్మినార్‌ నుంచి రాజీవ్‌ గాంధీ ప్రారంభించిన సద్భావన యాత్రను స్మరించుకుంటూ సోమవారం చార్మినార్‌ వద్ద సద్భావన యాత్ర సంస్మరణ వేడుకలను ఘనంగా నిర్వహించారు. టీపీసీసీ అధ్యక్షులు కాంగ్రెస్‌ జెండాను ఆవిష్కరించి కార్యక్రమాన్ని ప్రారంభించగా, మంత్రి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ వైద్యులు డాక్టర్‌ మల్లికార్జున్‌కు సద్భావన అవార్డు ప్రదానం చేశారు. అనంతరం జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ.. రాజీవ్ గాంధీ దేశ ఐక్యత, శాంతి, సోదరభావం, మతసామరస్యానికి ప్రాధాన్యతనిచ్చిన నాయకుడని గుర్తుచేశారు. భిన్న మతాలు, భాషలు, సంస్కృతులకు చెందిన ప్రజలు పరస్పర గౌరవంతో, ఐకమత్యంతో జీవించినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు. రాజీవ్‌ గాంధీ ప్రారంభించిన సద్భావన యాత్ర సందేశం నేటికీ సమాజానికి అవసరమని, ప్రజాస్వామ్య, రాజ్యాంగ విలువలను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడం, రాజ్యాంగ విలువలను గౌరవించడం, సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు సమాన అవకాశాలు కల్పించడం అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణానికి అవసరమని తెలిపారు.

పదేండ్ల బీఆర్‌ఎస్, అంతకుముందు టీడీపీ పాలనలో వేలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, గతంలో కష్టపడిన కార్యకర్తలకు గుర్తింపు, మర్యాద, గౌరవం అందించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజా సంక్షేమం, అభివృద్ధి, సామాజిక న్యాయం లక్ష్యంగా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల ప్రాధాన్యతను వివరించారు. ప్రజలకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు చేరడం, సామాన్య కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడం, మహిళలు, రైతులు, పేదలు, అర్హులైన వర్గాల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం ప్రభుత్వ సంక్షేమ విధానాల్లో కీలక అంశాలని తెలిపారు. రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర ఆశయాలను స్మరించుకుంటూ ప్రజల మధ్య ఐక్యతను పెంపొందించడం, ప్రజాస్వామ్య విలువలను కాపాడటం, సమాజంలోని అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేయడం ప్రతి నాయకుని బాధ్యత అని అన్నారు. స్వాతంత్ర్య పోరాటంలో ఎలాంటి భాగస్వామ్యం లేని బీజేపీ నేతలు నేడు దేశభక్తి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. గాంధీ, నెహ్రూ చరిత్రను చెరిపివేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు.


ఈ సందర్భంగా నాయకులు తెలంగాణ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్రంలో శాంతి, సౌభాగ్యం, సోదరభావం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. డాక్టర్‌ మల్లికార్జున్‌కు సద్భావన అవార్డు వైద్యరంగంలో విశేష సేవలందిస్తున్న ప్రముఖ యూరాలజిస్ట్‌, ట్రాన్స్‌ప్లాంట్‌ సర్జన్‌, ఏఐఎన్‌యూ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ మల్లికార్జున్‌కు సద్భావన అవార్డును అందజేసి ఘనంగా సత్కరించారు. ప్రజారోగ్య పరిరక్షణలో వైద్యుల సేవలు ప్రశంసనీయమని నాయకులు తెలిపారు. చార్మినార్‌ జోన్‌ డీసీపీ ఖేర్‌ కిరణ్‌ ప్రభాకర్‌ ఆదేశాల మేరకు ఏసీపీ పి. చంద్రశేఖర్‌, సీఐ టి. రాంబాబు, ట్రాఫిక్‌ విభాగం-3 డీసీపీ రాహుల్‌ హెగ్డే ఆదేశాల మేరకు ట్రాఫిక్‌ ఏసీపీ కె. లక్ష్మణ్‌, చార్మినార్‌ ట్రాఫిక్‌ సీఐ వి.ఎస్‌. సుంకరి తదితరులు భారీ బందోబస్తు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి సచిన్‌ సావంత్‌, ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు, మాజీ మంత్రి గీతారెడ్డి, మాజీ ఎంపీ అంజన్‌ కుమార్‌ యాదవ్‌, రాజ్యసభ సభ్యులు అనిల్‌ కుమార్‌ యాదవ్‌, ఫిరోజ్‌ ఖాన్‌, గిడుగు రుద్రరాజు, టీపీసీసీ మేధో విభాగం చైర్మెన్‌ ఎ. శ్యామ్‌ మోహన్‌, హైదరాబాద్‌ డీసీసీ అధ్యక్షులు సయ్యద్‌ ఖాలిద్‌ సైఫుల్లా తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్