ప్రొఫెసర్ రామచంద్రయ్య
నవతెలంగాణ బ్యూర -హైదరాబాద్
విద్యార్థులు శాస్త్రీయంగా ఆలోచించేలా ప్రశ్నించడం నేర్పాలని ప్రొఫెసర్ రాంచంద్రయ్య సూచించారు. స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్టీఎఫ్ఐ) ఆధ్వర్యంలో హైదరాబాద్ టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం రెండో రోజు దక్షిణాది ప్రాంతీయ శిక్షణా తరగతుల్లో ఆయన ‘శాస్త్రీయ ఆలోచన - ఉపాధ్యాయుల పాత్ర’ అనే అంశంపై మాట్లాడారు.
ప్రశ్నిస్తే హేతుబద్ధమైన ఆలోచనకు దారి తీస్తుందని తెలిపారు. దాని నుంచే శాస్త్రీయ అవగాహన అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ప్రశ్నించడం ద్వారానే అనేక ఆవిష్కరణలు వచ్చాయంటూ ఉదాహరణలతో వివరించారు. ప్రశ్నించడాన్ని పాలకులు సహించలేకపోతున్నారని విమర్శించారు. ప్రశ్నించకుండా ఉండేలా అశాస్త్రీయ అంశాలను, సూడో సైన్స్ ను శాస్త్రీయ అంశాలుగా నమ్మించే దానిపై పాలకవర్గాలు దృష్టి పెడుతున్నాయన్నారు. అందులో భాగంగా చరిత్రలో, సైన్సులో మార్పులను చేస్తున్నాయనీ, వీటిని ఉపాధ్యాయులు గమనించాలని కోరారు. పాలకవర్గాల కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండి వాటిని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. విశాలంగా ఆలోచించడం వల్లే అభివృద్ధి చెందగలుగుతామన్నారు.
విశ్వాసాల ఆధార చరిత్రతో ఉపయోగం లేదు : సి.రామకృష్ణన్
వ్యక్తిగత విశ్వాసాల ఆధారంగా చెప్పే చరిత్రతో వర్తమానం, భవిష్యత్తుకు ఎలాంటి ఉపయోగం లేదని సి.రాధాకృష్ణన్ కొట్టిపారేశారు. భారతీయ విద్య - ఎన్ఈపీ 2020 అమలుతో పరిణామాలు అనే అంశంపై ఆయన మాట్లాడారు. అశాస్త్రీయ అంశాలను విద్యలో జోడించడం, వాస్తవాల ఆధారంగా చెప్పాల్సిన చరిత్రను విశ్వాసాల ఆధారంగా చెప్పడం అత్యంత ప్రమాదకరమని హెచ్చరించారు. ప్రజల వాడుకలో లేని, ఉపయోగం లేని సంస్కృత భాషను, వేద గణితాన్ని బలవంతంగా రుద్దేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు విద్యను కేంద్రీకరించడం, ప్రయివేటీకరణకు పెద్ద పీట వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లౌకిక విలువలను తొలగించి, రాజ్యాంగ స్ఫూర్తిగా విరుద్ధంగా ఎన్ఈపీ 2020 ఉందని అభ్యంతరం వ్యక్తం చేశారు. విద్య కేంద్రీకరణలో భాగంగా ఒకే పరీక్ష పేరుతో ఎన్టీఏ ద్వారా నిర్వహించిన నీట్ పరీక్షలో చోటు చేసుకున్న అవకతవకలను ఆయన ఉదహరించారు. ఈ విధానాలను నిరసిస్తూ ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎస్టీఎఫ్ఐ ప్రధాన కార్యదర్శి, టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చావ రవి, ఎస్టీఎఫ్ఐ ఉపాధ్యక్షులు నక్క వెంకటేశ్వర్లు, మైలు కోశాధికారి టి.ఏ.కె.షఫీ, కార్యదర్శులు మాయోవన్, అరుణకుమారి, ఏకే బీనా, టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ.వెంకట్ తదితరులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)