పంతంగి టోల్‌గేట్ వద్ద బారులు
చౌటుప్పల్, చిట్యాలలో బంపర్ టు బంపర్ ప్రయాణం
నవతెలంగాణ–చౌటుప్పల్
దసరా, బతుకమ్మ పండుగల నేపథ్యంలో శనివారం హైదరాబాద్ -విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ భారీగా పెరిగింది. నగరవాసులు సొంతూళ్లకు పయనమవడంతో హైవేపై వాహనాల రాకపోకలు పెరిగాయి. దీనికి తోడు వీకెండ్ కావడంతో వాహనాల ప్రవాహం మరింత అధికమైంది. యాదాద్రిభువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్‌గేట్ వద్ద వాహనాలు బారులు తీరాయి. పలుచోట్ల ట్రాఫిక్ నెమ్మదిగా సాగడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.చౌటుప్పల్ పట్టణంలో ఫ్లైఓవర్ నిర్మాణ పనులు కొనసాగుతుండటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. నిర్మాణ పనుల కారణంగా రహదారి ఇరుకుగా మారడంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. మరోవైపు చౌటుప్పల్,చిట్యాల పట్టణాల్లో వాహనాలు బంపర్ టు బంపర్‌గా ముందుకు సాగుతున్నాయి. ట్రాఫిక్‌లో చిక్కుకోవడంతో గమ్యస్థానాలకు చేరుకోవడానికి ఎక్కువ సమయం పడుతోంది.
ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో పోలీసులు
హైవేపై పెరిగిన రద్దీని దృష్టిలో ఉంచుకుని పోలీసులు అప్రమత్తమయ్యారు. అంతరాయం కలగకుండా ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తున్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాల రద్దీని తగ్గించేందుకు ప్రత్యామ్నాయ మార్గాల్లో మళ్లింపు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా లక్కారం నుంచి అంకిరెడ్డిగూడెం స్టేజ్ వద్దకు వాహనాలను మళ్లించి, అక్కడి నుంచి తిరిగి జాతీయ రహదారిపైకి పంపిస్తున్నారు. ప్రధాన కూడళ్ల వద్ద ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకుంటూ వాహనాలు సజావుగా వెళ్లేలా పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలి..
దసరా పండగ, వీకెండ్ నేపథ్యంలో హైవేపై రద్దీ కొనసాగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వాహనదారులు ప్రయాణానికి అదనపు సమయం కేటాయించుకోవాలని, ట్రాఫిక్ పోలీసుల సూచనలను పాటించా లని పోలీసులు సూచిస్తున్నారు. తొందరపడి వాహనాలు నడపకుండా, ట్రాఫిక్ నిబంధనలను అనుసరిస్తూ గమ్యస్థానాలకు సురక్షితంగా చేరుకోవాలని కోరుతున్నారు.






కామెంట్‌లు (0)