Saturday, August 8, 2026
E-PAPER
Homeసోపతిఅక్షరసైన్యం తిరుగుబాటు

అక్షరసైన్యం తిరుగుబాటు

- Advertisement -

అణగిమణిగి ఉండే అక్షరం నేడు గాయపడింది
తమ జీవితాలతో చెలగాటం అపమన్నందుకు
అహంకార అధికారం లాఠీలు
భాష్పవాయుగోళాలతో పాశవికంగా
దాడిచేసి రక్తమోడేలా చేసినా
ఎత్తిన పిడికిళ్లు దించక
అన్యాయమంటూ గొంతులన్నీ ఏకమై
రాజధాని నడివీదుల్లో నినదిస్తూ పార్లమెంటును కుదిపేసి
అధికారం మెడలు వంచిన
అజేయశక్తి అక్షర సైన్యానిది !
విద్యాలయమే సమానత్వానికి తొలి పునాది
పుస్తకమే ప్రజాస్వామ్యపు మొదటి రాజ్యాంగం
ప్రశ్నాపత్రం పవిత్రమైతేనే
విద్యార్థి కలలకు రెక్కలు తొడుగుతాయి
లీకైన ప్రశ్నాపత్రం పరీక్షల్నేకాదు
లక్షల విద్యార్థుల ఆశల్ని
తల్లిదండ్రుల నమ్మకాన్ని
దేశభవిష్యత్తునే కూల్చివేస్తుంది
చరిత్రను చెరిపేసి ఇష్టానుసారం
కొత్తకథలు రాస్తే సత్యం మౌనంగా ఉండదు
సైన్సు సూత్రాలను రాజకీయ కుతంత్రాల
బలిపీఠంపై ఉంచితే జ్ఞానం తలవంచదు
విజ్ఞానం వికసించే చోట కుసిద్ధాంతాల సంకెళ్లు వేస్తే
ప్రయోగశాలలే తిరుగు బాట్లను ఆవిష్కరిస్తాయి
చరిత్ర పుటలను చింపేసి అబద్ధాలతో అతికిస్తే ప్రతివిద్యార్థి
పిడికిళ్లతో కొత్త చరిత్రను తిరగరాస్తాడు
ఆలోచనలను బంధించే గోడలు
ఏనాటికైనా కూలిపోక తప్పవు
కవుల జ్వలన కలాలు మేధావి ఆలోచనలు
న్యాయవాది వాదనలు కార్మికుని చెమట
నేలను కడిగే రైతు స్వేదం
యువత ఉద్యమాలు సగటు మనిషి ఆగ్రహం
అన్నీ కలిసినప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది
కోపాన్ని కాదు చైతన్యాన్ని పెంచుకోవాలి
ద్వేషాన్ని కాదు ప్రశ్నించే ధైర్యాన్ని పొందాలి
యువత మేల్కొన్న దేశమే రేపటి కొత్తచరిత్రను
గర్వంతో రాయగల అజేయశక్తి
చదువును చిల్లర సరుకుచేసి
లాభాల అంగడిలో అమ్ముతున్న వ్యవస్థ
కలలను వేలం వేస్తే యువత మౌనంగా ఉండదని
చరిత్ర మళ్లీ రుజువు చేసింది!
నిస్ఫ్రుహలో కృంగిన యువతను కీటకాలంటూ
అవమానాల రాళ్లు విసిరినంత మాత్రాన
ఆలోచనలు రక్తం కార్చవు
ఆరాళ్లే నేడు ఉద్యమాల మైలురాళ్లయ్యాయి
యువతలేచి జూలువిదిలించిన సింహాలై
కలం ఓ చేతపట్టి మరోచేత ప్రశ్నను జెండాగా ఎగరేసి
న్యాయాన్ని నినాదంగా మార్చి ఢిల్లీవీధుల్ని
నేడు విశ్వవిద్యాలయాలుగా మార్చేశాయి
జంతర్‌ మంతర్‌ కూడలి
దేశ మనస్సాక్షిగా మారింది
ఒక నిరాహార దీక్ష లక్షల ఆక్రోశాలకు ప్రతిధ్వనైంది
ఒక మనిషి మౌనం
కోటి గొంతుకల సమూహ నినాదమైంది
తుపాకీ శబ్దం కంటే
ఎలుగెత్తి పలికే నినాదం
తలెత్తిన అక్షరం బలమైనది
జైళ్ల గోడల కంటే పుస్తకాల పుటలే ఎత్తైనవి
అబద్ధాల ప్రచారం కంటే
సత్యం నడకే అసలైన గమ్యం చేరే మార్గమని
యువతను ఓడించగలిగే శక్తి
ఏ అనైతిక ప్రభుత్వానికి లేదని
యువత చైతన్యంతో కాలమే ఆగిపోతుందని
విద్యార్థి ప్రశ్నిస్తే చరిత్ర జవాబు చెప్పక తప్పదు
చదువు కోసం మొదలైన పోరాటం
దేశ ఆత్మగౌరవ యాత్రగా మారిన రోజిది
ఇదే అసలైన ప్రజాస్వామ్య విజయం!
పుస్తకాన్ని కాపాడుదాం, శాస్త్రాన్ని నిలబెడదాం
చరిత్రను నిజంతో లిఖిద్దాం
దేశ భవిష్యత్‌ ను భుజాలపై మోసే యువశక్తితో
నవభారతావనిని నిర్మిద్దాం
యువ జెన్‌ జి తరం జనానికి నేర్పిన పాఠం
మౌనం వీడి మనం మాట్లాడాలని
మాటలే మనల్ని కలిపే మహత్తర బంధమని
వట్టి మాటల మాయలోడి ఆటలు ఇకసాగవని
మాటలే ఆయుధాలై మౌనగొంతుకలన్నీ
గళాలెత్తి మాటల మంటల్ని రాజేసి
మరో నవచరిత్రను లిఖిస్తాయి ఖబడ్దార్‌ !

డా. కె. దివాకరాచారి, 9391018972

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -