Wednesday, July 15, 2026
E-PAPER
Homeఖమ్మంనాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరాకు పటిష్ట చర్యలు

నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరాకు పటిష్ట చర్యలు

- Advertisement -

– ఇన్సులేటెడ్ కవర్డ్ కండక్టర్ల ఏర్పాటు ప్రారంభం
– ఎన్పీడీసీఎల్ ఎస్ఈ మహేందర్
నవతెలంగాణ – అశ్వారావుపేట

విద్యుత్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరా కోసం పటిష్ట చర్యలు చేపడుతున్నామని ఎన్పీడీసీఎల్ భద్రాద్రి సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ (ఎస్‌ఈ)  మహేందర్ తెలిపారు.దమ్మపేట 33 కేవీ సబ్ స్టేషన్ పరిధిలోని అశ్వారావుపేట మండలం గుర్రాలచెరువు గ్రామ పరిసరాల వ్యవసాయ క్షేత్రాల్లో బుధవారం ఇన్సులేటెడ్ కవర్డ్ కండక్టర్స్ (విద్యుత్ నిరోధక కవచపు తీగలు) ఏర్పాటు పనులను ఆయన లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా నవతెలంగాణతో మాట్లాడుతూ జిల్లాలో ప్రస్తుతం 73 సబ్‌స్టేషన్లు ఉండగా, గత ఏడాదిన్నర కాలంలో తెలంగాణ ప్రభుత్వం మరో 23 సబ్‌స్టేషన్లను మంజూరు చేసిందన్నారు. వీటిలో నాలుగు సబ్‌స్టేషన్ల నిర్మాణం పూర్తయిందని, మరో పది సబ్‌స్టేషన్ల పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయని, మిగిలిన తొమ్మిది సబ్‌స్టేషన్లకు టెండర్ ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు.

విద్యుత్ వినియోగం పెరుగుదలకు అనుగుణంగా జిల్లాలో 56 ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యాన్ని పెంచామని, గత రెండేళ్లలో 14 వేల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేశామని పేర్కొన్నారు.

ఎన్పీడీసీఎల్ ఎండీ వరుణ్ రెడ్డి ప్రత్యేక చొరవతో దట్టమైన అటవీ ప్రాంతాలు, పామాయిల్, జామాయిల్, సుబాబుల్ సాగు ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయాలను తగ్గించేందుకు తొలి దశలో 33 కేవీ సబ్‌స్టేషన్ల పరిధిలోని 39 ఫీడర్లలో 60 కిలోమీటర్ల మేర ఇన్సులేటెడ్ కవర్డ్ కండక్టర్లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఇందులో రెండు ఫీడర్ల పరిధిలో పనులు ఇప్పటికే పూర్తయ్యాయని తెలిపారు.

విద్యుత్ సిబ్బంది కొరతను అధిగమిస్తూ అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించేందుకు ఆరుగురు సభ్యులతో కూడిన తొమ్మిది ఈఆర్టీ (అత్యవసర స్పందన) బృందాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు.

రోడ్లకు ఇరువైపులా ఉన్న విద్యుత్ లైన్ల కింద మొక్కలు నాటవద్దని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. మొక్కలు పెరిగి విద్యుత్ తీగలను తాకడం వల్ల అంతరాయాలు ఏర్పడటంతో పాటు ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డీఈ నందయ్య, ఏడీఈ వెంకటరత్నం, ఏఈ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -