అయోధ్య విరాళాల కేసులో సంచలన నిజాలు
సిట్ విచారణలో వెలుగులోకి దొంగతనంపై ప్రాథమిక దర్యాప్తు పూర్తి
షూస్, దుస్తుల్లో నోట్ల కట్టలు దాచిన వైనం
లక్నో: అయోధ్య ఆలయ విరాళాల చోరీ ఉదంతం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరుపుతున్న ఉన్నత స్థాయి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సమర్పించిన ప్రాథమిక నివేదికలో దిగ్భ్రాం తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. విరాళాల కౌంటింగ్ రూమ్‌లో పనిచేసే సిబ్బంది అత్యంత చాకచక్యంగా నోట్ల కట్టలను తమ దుస్తులు, జేబులు, షూస్. వ్యక్తిగత వస్తువుల్లో దాచి బయటకు తరలించినట్టు సిట్ నిర్ధారించింది. భద్రతా లోపం వల్లే ఇది సాధ్యమైందని తెలిపింది. లక్నో డివిజనల్ కమిషనర్ విజయ్ విశ్వాస్ పంత్, ఐజీ కిరణ్ ఎస్, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి నీల్ రతన్‌లతో కూడిన త్రిసభ్య సిట్ బృందం ఆలయ కౌంటింగ్ రూమ్‌కు సంబంధించిన భద్రతపై లోతైన దర్యాప్తు చేపట్టింది. ఏప్రిల్ 27 నుంచి జూన్ 5 వరకు రికార్డైన సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించింది. సిబ్బంది నగదును మాయం చేస్తు న్న సుమారు 70 అనుమానాస్పద ఘటనలు కెమె రాలకు చిక్కాయి. ఇది ఏదో ఒక రోజు అనుకో కుండా జరిగిన పొరపాటు కాదని, ఒక క్రమప ద్ధతిలో సాగిన సుదీర్ఘ దొంగతనమని సిట్ తన ప్రాథమిక నివేదికలో పేర్కొంది. లెక్కింపు సిబ్బంది కరెన్సీ కట్టలను తమ జేబుల్లో, బూట్లలో కుక్కు కుంటూ, మరికొన్ని నోట్లను కౌంటింగ్ రూమ్‌కు అనుబంధంగా ఉన్న వాష్ రూమ్‌లలో దాచినట్లు సీసీటీవీల ద్వారా సిట్ అధికారులు గుర్తించారు.
రామాలయ ప్రాంగణంలోని భద్రతా లోపాలే చోరీకి అవకాశం కల్పించాయని సిట్ అధికారులు గుర్తించారు. ఆలయంలో అమలు కావాల్సిన నిర్వహణా విధానాలు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయని దర్యాప్తులో తేల్చారు. కౌంటింగ్ హాల్ లోపలికి వచ్చేటప్పుడు, బయటకు వెళ్లేటప్పుడు సిబ్బందిని శారీరకంగా తనిఖీ చేసే సరైన వ్యవస్థ లేదని గుర్తించారు. ఉద్యోగులు తమ వ్యక్తిగత బ్యాగులు, ఇతర వస్తువులను యథేచ్ఛగా కౌంటింగ్ ఏరియాలోకి తీసుకెళ్లినా ఎవరూ అడ్డుకోలేదని తమ దర్యాప్తులో తేలినట్టు వెల్లడించారు. విభిన్న హుండీల నుంచి వచ్చిన నగదును విడివిడిగా లెక్కించకుండా, అంతా కలిపి ఒకేసారి లెక్కించడం వల్ల ఎంత సొమ్ము వచ్చిందనే దానిపై స్పష్టత లోపించింది. దీన్నే నిందితులు అనుకూలంగా మార్చుకున్నన్నట్టు సమాచారం. అనుమానితులైన కొందరు ఉద్యోగుల బ్యాంకు ఖాతాలను పరిశీలించగా, వారి అధికారిక ఆదాయ వనరుల కంటే విపరీతమైన నగదు డిపాజిట్లు, లావాదేవీలు జరిగినట్టు సిట్ గుర్తించింది.



