Tuesday, July 21, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఎస్ఎఫ్ఐ దీక్ష భగ్నం

ఎస్ఎఫ్ఐ దీక్ష భగ్నం

- Advertisement -

సీపీఐ(ఎం), ప్రజా సంఘాల మద్దతు
బలవంతంగా లాక్కెళ్లిన పోలీసులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
​విద్యా వ్యవస్థలో నెలకొన్న సంక్షోభం, ఎన్టీఏ వైఫల్యాలు, రద్దు, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే తదితర డిమాండ్లతో విద్యార్థులు, యువత దేశవ్యాప్తంగా చేపట్టిన ఉద్యమాలకు మద్దతుగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. సోమవారం బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు రజనీకాంత్, నాగరాజు, ఉపాధ్యక్షులు అశోక్, మమత, కిరణ్ తదితరుల చేపట్టిన దీక్షను సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ప్రారం భించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనీ, ఎన్టీఏను రద్దు చేయాలనీ, నీట్ పేపర్ లీక్ వల్ల ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలని ఈ సందర్భంగా విద్యార్థులు నినదించారు. పరీక్షల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, పర్యావరణ వేత్త సోనమ్ వాంగ్ చుక్ పోరాటానికి మద్దతు తెలిపారు. సీపీఐ(ఎం)తో పాటు, వివిధ ప్రజా సంఘాల నాయకులు దీక్షకు సంఘీభావం తెలిపారు. ఈ నేపథ్యంలో అక్కడే మొహరించిన పోలీసులు దీక్షా శిబిరంలో కూర్చున్న విద్యార్థులపై విరుచుకుపడ్డారు. వారిని అక్కడ్నుంచి లాక్కెళ్లి వాహనాల్లో తరలించారు. విద్యార్థుల అరెస్టుల పట్ల ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఎం రేవంత్‌ ‌రెడ్డి బీజేపీకి మద్దతుగా వ్యవహరిస్తున్నారా? అని ప్రశ్నించింది. విద్యార్థి ఉద్యమాలను అణచివేయడం సిగ్గుచేటని పేర్కొంటూ సోమవారం ఆ సంఘం ఒక ప్రకటన విడుదల చేసింది. అదే విధంగా జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న వారిపై లాఠీ చార్జ్, వాటర్ క్యానన్లు ప్రయోగించడం దుర్మార్గమని ఖండించింది. ఎస్‌ఎఫ్‌ఐ నాయకులపై నమోదు చేసిన కేసులను వెంటనే ఎత్తేయాలని, అరెస్టు చేసిన వారిని బేషరతుగా విడుదల చేయాలని ఈ సందర్భంగా నాయకులు డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా జాన్ వెస్లీ మాట్లాడుతూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దాదాపు 25 లక్షల మంది జీవితాలను నాశనం చేసిన వ్యవహారంపై ప్రధాని మోడీ నోరు విప్పాలని డిమాండ్‌ ‌చేశారు. నీట్, సీయూఈటీ తదితర పరీక్షల నిర్వహణలో తలెత్తిన సమస్యలపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళన నెలకొంటే కేంద్రం స్పందించడం లేదని విమర్శించారు. మంత్రిపై చర్యలు తీసుకోకపోగా ఆందోళనకారులపై పోలీసులను ప్రయోగిస్తూ అణచివేతకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి రాజీనామా చేయాలనీ, లేదంటే ఆయన్ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం రేవంత్‌ ‌రెడ్డి స్పష్టమైన వైఖరిని ప్రకటించాలని డిమాండ్‌ ‌చేశారు. ఆయన మోడీకి అనుకూలంగా, విద్యార్థులకు వ్యతిరేకంగా ఉన్నారా? అని ప్రశ్నించారు.

మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ విద్య కేంద్రీకరణతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల హక్కులను హరిస్తున్నదని విమర్శించారు. ఎన్టీఏను రద్దు చేసి, పారదర్శమైన, రాష్ట్రాల హక్కులను గౌరవించే ప్రవేశ పరీక్షల విధానాన్ని తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. మత విద్వేషాలు రెచ్చగొడుతూ పబ్బం గడుపుకుంటున్న బీజేపీపై దేవుళ్లు, పూజారులు, భక్తులు కూడా తిరగబడుతున్నారని తెలిపారు. విద్యార్థులకు ఏ విధంగా న్యాయం చేస్తారో ఇప్పటికైనా చెప్పాలని కేంద్రాన్ని డిమాండ్‌ ‌చేశారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఎస్.రజనీకాంత్ మాట్లాడుతూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు తమ పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ విద్యాశాఖను నిర్వహించడంలో ప్రధాన్ విఫలమయ్యారని విమర్శించారు. డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి అనగంటి వెంకటేశ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వానికి నిజంగా ధైర్యముంటే పేపర్ లీకులపై పార్లమెంటులో చర్చించాలని డిమాండ్ చేశారు. కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి టి.స్కైలాబ్ బాబు మాట్లాడుతూ 84 సార్లు ప్రశ్నాపత్రాలు లీకైనా ఇప్పటికీ మంత్రి రాజీనామా చేయలేదన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్రి ప్రసాద్ మాట్లాడుతూ పోటీ పరీక్షల లీకులతో కోచింగ్‌ ‌సెంటర్ల యజమానులు కోట్లాది రూపాయలను గడిస్తున్నారన్నారు. డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేశ్ మాట్లాడుతూ సోనమ్ వాంగ్ చుక్ దీక్షకు కారణమైన పేపర్ లీక్ పై మాట్లాడలేని బీజేపీ ఎన్టీఏకే మళ్లీ పరీక్షల నిర్వహణను ఎందుకు అప్పగిస్తున్నారని ప్రశ్నించారు. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్. రజనీకాంత్, రాష్ట్ర కార్యదర్శి టి. నాగరాజు, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం. మమత, డి. కిరణ్, కె. అశోక్ రెడ్డి, రాష్ట్ర నాయకులు విఘ్నేష్, ప్రశాంత్, అభిషేక్, నాగకృష్ణ, రవీందర్, సందీప్, ప్రవీణ్, అర్జున్, శ్వేత తదితరులను పోలీసులు అరెస్ట్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -