తెలుగు వెండితెరపై మరో భక్తి రస చిత్రం ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఆధ్యాత్మికత, భక్తి, భావోద్వేగాలను మేళవిస్తూ తెరకెక్కనున్న నూతన చిత్రం ‘శివాలయం’.
ఈ సినిమా పూజా కార్యక్రమాలతో తెలుగు ఫిలిం ఛాంబర్ లో ఘనంగా ప్రారంభమైంది.
ఆచంట మహేష్, కాంచన దీప్తిరెడ్డి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి వెంకట్‌రెడ్డి నంది దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
ఈ సందర్భంగా ముహూర్తపు షాట్‌కు దిల్ రమేష్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా, ఘర్షణ శ్రీనివాస్ క్లాప్ కొట్టారు. వ్యవసాయవేత్త కళ్లెం నరసింహారెడ్డి చిత్ర బృందానికి శుభాకాంక్షలు అందించారు.
చిత్ర దర్శకుడు, నిర్మాత వెంకట్‌రెడ్డి నంది మాట్లాడుతూ,‘శివుడి లీలలు, మహిమలు, భక్తి భావనను ప్రేక్షకులకు ఆవిష్కరించాలనే ఉద్దేశంతో ఈ చిత్రానికి శ్రీకారం చుట్టాం. ఈ కథపై ఎంతో కాలంగా కసరత్తు చేస్తున్నాం. గత ఆరు నెలలుగా ప్రీ-ప్రొడక్షన్ పనులను పూర్తి స్థాయిలో నిర్వహించాం. ప్రేక్షకులకు భక్తితో పాటు మంచి కథ, భావోద్వేగాలు, వినోదాన్ని అందించేలా ఈ సినిమాను రూపొందించనున్నాం. సెప్టెంబర్ నెలలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. సినిమా కథ, ఇతర నటీనటులు, సాంకేతిక అంశాలు, షూటింగ్ వివరాలతో పాటు పూర్తి వివరాలను త్వరలోనే అధికారికంగా వెల్లడిస్తాం’ అని తెలిపారు.
‘శివుడి నేపథ్యంలో వచ్చిన పాటలు, కథాంశంతో తెరకెక్కిన సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అలాంటి మంచి కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో భాగం కావడం చాలా సంతోషంగా ఉంది. మంచి కథ, బలమైన భావోద్వేగాలతో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా ప్రతి ఒక్కరినీ అలరిస్తుందని నమ్ముతున్నాను’ అని ఘర్షణ శ్రీనివాస్ చెప్పారు.
ఈ సినిమాకి సంగీతం: డ్రమ్స్ రాము, కొరియో గ్రఫీ: నిహారిక చౌదరి, ఛాయాగ్రహణం (డి.ఓ.పి): డి.యాదగిరి.
‘శివాలయం’ మొదలైంది
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



