"Travelling it leaves you speechless then turns you in to a story teller" - ibn battuta ప్రతిమనిషి తాను పుట్టి పెరిగిన ప్రాంతం నుంచి జీవిత కాలంలో ఎంత దూరం పర్యటించగలడో, ఎన్నెన్ని విభిన్నమైన జీవన సంస్కృతులను, ప్రత్యేకతల్ని కళ్లారా చూస్తాడో మనసారా ఆనందిస్తాడో అంతగా విజ్ఞానాన్ని సంపాదించుకోగలడు. సందర్శన పర్యటన అనేది ఒకరకమైన జ్ఞాన సముపార్జనకు మార్గంగా ఉంటుందనడంలో సందేహం లేదు. సామాన్య మానవుడి నుంచి విద్యార్థులు, యువకులు, మహిళలు వయోవృద్దుల వరకు పర్యటనలు చేయడం అవసరం. మానసిక వికాసానికి దోహదపడుతుంది.
ఆధునిక కాలంలో సమాచార సాంకేతికత మనల్ని చుట్టుముట్టింది. ప్రపంచమంతా సెల్ఫోన్లో ఒదిగిపోయింది, టెక్నోక్రసీ పెరిగింది. అయినప్పటికీ అమ్మ ఒడిలాంటి చల్లదనం, స్వేచ్చ, వికాసం వివిధ ప్రదేశాలను సందర్శించినపుడు మాత్రమే కలుగుతుందని కవులు, మానసిక శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతుంటారు. భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో చూడదగిన చారిత్రక, సామాజిక, సాంస్కృతిక అంశాల ప్రతీకలు ఎన్నో ఉన్నాయి. మనదేశానికి ప్రపంచ నలుమూలల నుంచి పర్యటించడానికి టూరిస్టులు వస్తుంటారు. కేవలం పర్యాటకరంగం మీదనే ఆధారపడిన రాష్ట్రాలు చాలా ఉన్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో పర్యాటకులను ఆహ్లాదపరిచే ప్రాంతాలు ప్రతి జిల్లాలో ఉన్నాయి. ఇటీవల తెలంగాణ పర్యాటక శాఖ రైజింగ్ తెలంగాణ -2047లో భాగంగా విభిన్నంగా Empowering youth-Elevating telangana అంశంగా విభిన్నమైన పద్ధతిలో ఆలోచనను ఆవిష్కరించింది.
టూరిజం ఆర్థికాభివృద్ధిలో కీలకాంశం. తెలంగాణలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలల్లో 2024లో యువటూరిజం క్లబ్బులను ఒక స్పష్టమైన లక్ష్యంతో ప్రారంభించింది. విద్యార్థులను పర్యాటక రంగానికి అనుసంధానం చేయడంతో పాటు భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించింది. కాలానుగుణంగా ఉపాధి అవకాశాలను సృష్టించడంతోపాటు సాంస్కృతిక వారసులుగా తీర్చిదిద్దడంతోపాటు, విద్యార్థి కేంద్రంగా తెలంగాణ చరిత్ర, సాహిత్యం సంస్కృతికి వారసత్వ సంపదగా ముందు తరాలకు అందించేందుకు వినూత్నమైన టూరిజం క్లబ్బులను స్థాపించినది. ఇందులో యాభై నుంచి వంద మంది విద్యార్థులు ప్రత్యక్షభాగస్వాములై ఉంటారు. వీరంతా ఓ సమన్వయకర్త ఆధ్వర్యంలో ప్రతినెలా సమావేశాలు నిర్వహించుకుంటారు. తమ మండలం, జిల్లా సమీపంలో ఉన్న పర్యాటక ప్రదేశాలను గుర్తిస్తారు. ఆయాప్రాంతాలకు చెందిన ప్రజల జీవనవిధానం, ఆర్థిక సాంస్కృతిక, ఆహారపు అలవాట్లు తదితర అంశాలను అధ్యయనం చేస్తారు.
మన చుట్టూ ఉన్న ప్రత్యేకతల్ని మన యువ విద్యార్థులుకు తెలియపరచడం క్లబ్బుల మొదటి లక్ష్యం. అదేవిధంగా పర్యవరణహిత టూరిజానికి తొలి ప్రాధాన్యతను ఇస్తుంది. తెలంగాణ దర్శిని ద్వారా టూరిస్ట్ గైడ్లుగా ఉపాధి కల్పించడం మలి లక్ష్యం. స్థానిక సంస్కృతులకు రాయబారులుగా విద్యార్థులు ఉండేందుకు ఉపయుక్తమైన వేదికగా ఉంటుంది.
తెలంగాణ విద్యా కమీషనరేట్, తెలంగాణ పర్యాటక శాఖ సంయుక్తంగా డిగ్రీ స్థాయి విద్యార్థులకు దోస్త్ ద్వారా ప్రవేశాలు పొందే సమయంలోనే టూరిజం ఒక సబ్జెక్టుగా ప్రవేశ పెట్టింది. ఈక్రమంలో డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులకు వెంటనే ఉపాధి అవకాశాలు కలుగుతాయి. మరోవైపు సృజనాత్మక ప్రతిభావంతులుగా విద్యార్థులను మలిచే క్రమంలో టూరిజం క్లబ్ ద్వారా వ్యాసరచన, వక్తృత్వం, డ్రామా, నృత్యం, పెయింటింగ్, స్లోగన్ రైటింగ్, కవిత్వరచన, ఫొటోగ్రఫీ తదితర అంశాలలో కళాశాల జిల్లా రాష్ట్ర స్థాయిల్లో పర్యాటక సంబంధిత అంశాలపై పోటీలు నిర్వహిస్తారు. రానున్న రోజుల్లో పర్యాటకరంగంలో వివిధ రకాలుగా విస్తరించేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గ్లోబల్ ప్రపంచంలో లోకల్ అవకాశాలు విస్తృతమౌతాయి. వారసత్వ, ఆధ్యాత్మిక పర్యావరణ, వన్యప్రాణి, సాంస్కృతిక, గ్రామీణ, ఆహార, వ్యాపార, హాస్పిటల్, సినిమా, షాపింగ్ వంటివి పర్యాటక రంగాలు ఇప్పటికే విస్తరించాయి. విద్యార్థులకు వీటిలో అధిక ఉపాధి అవకాశాలు ఉంటాయి. తద్వారా యువత కల్చరల్ టూరిజం రిసోర్స్ పర్సన్స్గా రాణిస్తారు. హోమ్ స్టేస్ పెరుగుతున్నాయి. ఈరంగంలో ఒడిశా ముందంజలో ఉంది. మనరాష్ట్రంలోనూ ఇటువంటి పర్యాటకరంగం పెరుగుతున్నది. అతిధిదేవోభవ అంటూ ముందుకు సాగాలి. మనం ఏది కోల్పోతామో దానిని తిరిగి తెచ్చుకోలేం. వారసత్వమే సంపదగా భావించాలి. ఆ దిశగా భవిష్యత్తులోకి అడుగు పెట్టాలి. పర్యాటక రంగాన్ని పునర్నిర్మించడానికి డిజిటల్, కృత్రిమమేదస్సును ఉపయోగించడమే ఈ ఏడాది పర్యాటక దినోత్సవ ప్రత్యేకత.
ప్రభుత్వ డిగ్రీ కళాశాలల విద్యార్థులకు యువ టూరిజం క్లబ్బులు రానున్న కాలంలో ఉపాధి కల్పించడానికి దీపదారులుగా నిలుస్తాయి. మరోవైపు పర్యాటక రంగానికి వారసులుగా ఎదుగుతారు. ఈనాటి విద్యార్థులే.. రేపటి సాంస్కృతిక రాయబారులుగా తీర్చిదిద్దడమే తెలంగాణ రాష్ట్ర యువజన సర్వీసులు పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణి ప్రసాద్, కళాశాల విద్యా కమిషనర్ దేవసేన సంకల్పం. ఆ ఉద్దేశంతోనే యువ టూరిజం క్లబ్బులకు రూపకల్పన చేశారు. ఈతరం విద్యార్థులకు విజ్ఞానం ఉపాధి కల్పించడమే లక్ష్యంగా తీర్చిదిద్దుతున్నారు.
(సెప్టెంబర్ 27 ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా)
తెలంగాణ దర్శిని యువక్లబ్
తరగతి గదిలో చదువుకునే పాఠ్యాంశాలలో ఉండే చారిత్రక ప్రదేశాలు దశాబ్దాల కట్టడాలు చూసే అవకాశం రావడం అదృష్టం సహవిద్యార్థులతో చిన్నప్పుడు ఎక్స్ కర్షన్ కి వెళ్లినప్పుడు కలిగే అనుభూతి అద్భుతమైనది.ఇప్పడు పర్యటన చేసినపుడు కలిగే ఆనందం విజ్ఞానం తో కలిసినది కళాశాల స్థాయిలో అపురూపమైనది.
- ఎస్.కె సమీర్, బి.ఏ ద్వితీయ
యువటూరిజం విశిష్టమైనది
మా ఖమ్మం జిల్లాలో పర్యాటక దర్శనీయ ప్రదేశాలున్నాయని యువ టూరిజం క్లబ్బులో సభ్యురాలిగా చేరాకే తెలిసింది. ప్రతి ప్రాంతం ప్రత్యేకమైనదేనని అనిపించింది. చరిత్ర సంస్కృతి అధ్యయనంలో భాగంగా భిన్న ప్రాంతాలను సందర్శించాలనే ఆలోచన కలిగింది. సమూహంగా ఖమ్మం కళ్ల ముందు కనిపించే ఖిల్లాను సందర్శించి చారిత్రక విషయాలను తెలుసుకోవడం క్లబ్ ద్వారానే సాధ్యమైంది. కొత్త అనుభూతిని కలిగించింది.
- గుండ్ల అంబిక, బి.కాం సెకండ్ ఇయర్
పర్యాటకం.. ప్రగతి మార్గ దర్శని
యువ టూరిజం క్లబ్బు ద్వారా విజ్ఞానం.. వినోదం రెండింటిని పొందవచ్చు. మనం ఉండే ప్రాంతంలోనే మనకు తెలియని, చూడని ప్రదేశాలు ఉన్నాయని క్లబ్లో చేరాక తెలిసింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పులి గుండాల వంటి ఎకో టూరిస్ట్ ప్రదేశం ఉందని ఈ మధ్యనే తెలిసినది. త్వరలో ఆ ప్రాంతంలో పర్యటిస్తాం. అలాగే కిన్నెరసాని ప్రాజెక్టును కూడా సందర్శిస్తాం.
- మహేందర్, బీఎస్సీ
విజ్ఞాన సర్వస్వం
తెలుగులో యాత్రా చరిత్రలున్నాయి. వాటి గురించి చదివినపుడు మనం అక్షరం ద్వారా సందర్శించిన అనుభూతికి లోనవుతాం. ఇక్కడ ప్రత్యక్షంగా సందర్శించవచ్చు. నేలకొండపల్లి బౌద్ధారామాన్ని బృదంగా పర్యటించడం వలన కొత్త అంశాలను తెలుసుకున్నాం. డిగ్రీ స్థాయి విద్యార్థులకు యువ టూరిజం క్లబ్ ద్వారా నిర్వహించే సృజనాత్మక పోటీలు క్విజ్ వ్యాసరచన పోటీలు పర్యాటకం మీద ఆసక్తిని కలిగిస్తాయి
- ఎం.డి.జరీనా, బి.ఏ సెకండ్ ఇయర్
- డా.ఎం.వి.రమణ
9989000265







కామెంట్లు (0)