భారతీయ సినిమా చరిత్రలో తెలంగాణ ప్రాంత స్థానం ఎక్కడా.. అనుకున్నప్పుడు అది నిస్సందేహంగా మూకీల కాలంలోనే కలకత్తా, బొంబాయితో ముడిపడి ఉంది. మద్రాసు కన్నా ముందుగానే హైదరాబాదు, సికిందరాబాదుల్లో సినిమాల ఉనికి ఉన్నది. 1896లోనే పీప్ హోల్ షోస్ సికింద్రాబాద్ నుండి మద్రాస్ మీదుగా దేశమంతటికి వెళ్లినది. 1897లోనే ప్రొఫెసర్ స్టీవెన్సన్ అన్న విదేశీయుడు మద్రాసు నుండి వచ్చి హైదరాబాదులో మొదటిసారిగా మూకీల ప్రదర్శన నిర్వహించాడు. (Prof.steavenson, when film came to madras bioscope south asia film studies 2-2010) ఇందుకు కారణం సికింద్రాబాద్లో బ్రిటీష్ సైనికదళాలు ఉండటం. ఇంత నేపథ్యం ఉండటం వల్లనే 1908 హైదరాబాద్ మూసీ వరదల దృశ్యాలను చిత్రీకరించడానికి ఆరవ నిజాం నవాబు మహబూబ్ అలీపాషా కలకత్తా నుండి జె.ఎఫ్. మదన్ బృందాన్ని రప్పించాడు. 1910లోనే కర్నూల్ విలియమ్స్ సికింద్రాబాదులో 8 ఎంఎం, 16 ఎం.ఎం. ప్రొజెక్టర్లతో తన కుటుంబానికి సైలెంట్ సినిమాలను ప్రదర్శించిన చరిత్ర హైదరాబాద్కు ఉంది.
ఇంత గొప్పమూకీల చరిత్ర ఉన్న హైదరాబాదు నుండి సినిమాలలో నటించడానికి బొంబాయికి వెళ్ళిన వారి చరిత్ర తక్కువేమీ కాదు. కరీంనగర్ వాడైన పైడి జైరాజ్ 1929లోనే బొంబాయి వెళ్లి మూకీల్లో నటించిన విషయం చరిత్రకారుల విస్మరణకు గురైంది. అయితే అంతకన్నా ముందుగా బొంబాయి వెళ్లిన తార మరొకరున్నారు. ఆమె పేరు రామ్ప్యారి. 1927లోనే బొంబాయి వెళ్లిన రామ్ప్యారి 1927 నుండే మూకీల్లో నటించింది. ఇక్కడ కొసమెరుపేమిటంటే రామ్ప్యారి కన్నా ముందుగానే 1925లో హిమాంశురాయ్ తీసిన ‘ద లైట్ ఆఫ్ ఆసియా’లో సరోజినీనాయుడు చెల్లెండ్లు మృణాళినీదేవి, సువాళినీదేవి నటించిన విషయం అసలెవరికీ తెలియదు. ఇదంతా మూకీల సంగతి.
ఇక రాంప్యారీ విషయానికి వద్దాం...
హైదరాబాదులో అచ్చ తెలుగు కుటుంబానికి చెందిన కళాకారిణి రాంప్యారి. 1908 ఆగస్టు 27న జన్మించిన ఈమెది సంగీత నాట్య రంగాలలో ప్రవేశం కలిగిన కళావంతుల కుటుంబం. వారి ముందు తరాల వారంతా తారామతి, ప్రేమామతికి చెందిన వారు. గోల్కొండ తానీషా అతిథులు వచ్చినప్పుడు తన ఆస్థానంలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి వీరిని ఆహ్వానించేవారు. ఆ తర్వాత హైదరాబాద్ సంస్థానం నుండేగాక ఇతర రాజాస్థానాల నుండి కూడా వారికి సంగీత, నృత్య కచేరీలు చేయడానికి ఆహ్వానాలు అందేవి. అయితే గోల్కొండ ప్రభువుల పాలన అంతమైన తర్వాత ఆ కుటుంబాలన్నీ చెల్లాచెదురయ్యాయి. అలా విడిపోయిన వారంతా మాదన్నపేట, హయత్ నగర్ వంటి ప్రాంతాలకు తరలివెళ్లగా, మరికొందరు మద్రాసు ప్రెసిడెన్సీ ప్రాంతాలకు వెళ్లిపోయారు. వీరిలో ఒక చిన్న కుటుంబాల సమూహం నేటి హైదరాబాద్లోని పాతనగరంలో ఉన్న ‘నాగులచింత’ ప్రాంతంలో స్థిరపడ్డారు. అప్పట్లో ఈ ప్రాంతమంతా చింతచెట్లతో నిండి నాగుపాములకు నిలయమై ఉండటంతో ‘నాగుల చింత’ అనే పేరు వచ్చింది.
సినిమాల్లో అవకాశం
రామ్
ప్యారీ తెలుగు, ఉర్దూ, మరాఠి, కన్నడ, ఇంగ్లీష్ భాషలు బాగా మాట్లాడగలిగేది. ఆమె పాడటంలోనే గాక నాట్యంలో కూడా శిక్షణ పొందింది. 1918లో పదేళ్ల వయసులో మద్రాసుకు వెళ్లిన ఆమె అక్కడ తన పెదతల్లి పెంపకంలో భరతనాట్యం నెచ్చుకుంది. నాలుగేళ్ల శిక్షణ తర్వాత మద్రాసులో పేరున్న నాట్యకారిణిగా వెలుగులోకి వచ్చింది. 1926లో మద్రాసులో ఒక నాట్య ప్రదర్శన ఇస్తుండగా కోహినూర్ ఫిలిం కంపెనీ (బొంబాయి)కి చెందిన ఒక నిర్మాత చూసి సినిమాల్లో అవకాశం కల్పిస్తానని బొంబాయికి ఆహ్వానించాడు. మూకీల కాలంలో చందూలాల్ షా తీసిన ‘గుణ సుందరి’ (1927)లో తొలిసారిగా ఒక చిన్న పాత్ర చేసి సినిమా రంగానికి పరిచయమైన రాంప్యారి రెండో సినిమా ‘వైల్ విమెన్’ (1928)లో తన నృత్య సన్నివేశాల్లో ప్రేక్షకులను ఆకట్టుకున్నది. దాంతో నాయికగా అవకాశాలు వచ్చినవి. 1930ల నాటికి జనాదరణ ఉన్న హీరోయిన్ స్థాయికి చేరుకుంది. ఈ క్రమంలో ఆమె సిల్వర్ క్లౌడ్, నీలం మనేక్, కుంజ్ కిశోరి, హామ్లెట్, డ్రీమ్ లాండ్, డిటెక్టివ్ కుమార్(1925), రెవల్యూషన్, రాజ్ హింస, మిస్ డాలి, జై సోమ్ నాథ్, హతిం తాయి, ఫిమేల్ ఫేట్, డేరింగ్ రాథోడ్ యాస్మినా, ది వాయిలెంట్, డేర్ డెవిల్, ఇమ్మోర్టల్ గ్లోరి, లయన్స్, డాషింగ్ యూత్ వంటి మొత్తం 22 మూకీ చిత్రాల్లో నటించింది.
టాకీ సినిమాల్లో...
టాకీలు వచ్చిన 1931లోనే ఆమె వరుసగా పాక్ దామన్, లైలామజ్ను, ఘర్ కీ లక్ష్మి అనే మూడు టాకీల్లో నటించింది. ఆ తర్వాత గుణసుందరి, ఠీ నజర్, జీవన్ నాటక్, ఆజాద్ అబల, అపరాధి, బండేట్ ఆఫ్ ఎయిర్, సునెహర సన్సార్, జాన్బాజ్ మలీక్, మిలన్, సముందీశ్వరి (తమిళం), ఖుదాయి, ఖిద్మత్ దార్, ప్రేమ్ సాగర్, బారాత్, ఆశీర్వాద్, ఘజల్, గీత గోవింద్, కౌన్ పరదేశీ, మంజూర్ వంటి చిత్రాల్లో రామ్ ప్యారీ నాయికగా, ఇతర ప్రధాన పాత్రధారిణిగా నటించింది. పృథ్వీరాజ్ కపూర్, మాధవ్ కాలే, జైరాజ్ వంటి హీరోలతో ఆమె కలిసి నటించింది. అంతేకాదు దేవకీబోస్ దర్శకత్వంలో ‘విద్యాపతి’ చిత్రంలో నటించింది. తాను అభిమానించే రూబీమేయర్ సులోచన, గౌహర్లతో రంజిత్ మూవీస్ చిత్రాల్లోనూ నటించించామె.
దక్షిణ భారతమంతా...
మూకీల కాలంలో నటిస్తున్న రామ్ ప్యారీ ఆయా చిత్రాలు ప్రదర్శితమయ్యే థియేటర్లలో విరామ సమయంలో పరదాల ముందు నర్తించేదని తొలితరం దర్శకులు సి. ఎస్.రావు ప్రస్తావించారు. అలా దక్షిణ భారతమంతా ఆమె నృత్య ప్రదర్శనలిచ్చింది. అలాగే శ్రీలంక వంటి పొరుగు దేశాల్లో కూడా ప్రదర్శనలిచ్చింది. ‘సిలోన్ లేబర్ యూనియన్ ఆమెను బంగారు జ్ఞాపికతో సత్కరించింది. సినిమా రంగంలో విరివిగా అవకాశాలు రావడంతో 1930 నాటికి ఆమె బొంబాయిలోనే స్థిరపడిపోయింది. దాంతో ఆమెకు హైదరాబాదులో సంబంధాలు దాదాపుగా తెగిపోయినవి. అయితే హైదరాబాదు అభిమానులకు మాత్రం దూరం కాలేదు. హైదరాబాదు నుండి వెళ్లిన అభిమానులతో దఖనీ ఉర్దూలో ఆప్యాయంగా పలకరించేది. అయితే సినిమాలకు దూరమైనాక ఆమె తర్వాతి జీవిత విశేషాలేవీ తెలిసి రావడం లేదు. పూనాకు చెందిన సినీ చరిత్రకారుడు సురేష్ సర్వయ్య అందించిన సమాచారం మేరకు 1970 ఆగస్టు 28న ఆమె కన్ను మూసింది. ఏది ఏమైనా బొంబాయి వెళ్లిన తొలి తెలంగాణ నటిగా హైదరాబాదీగా రామ్ ప్యారి తెలంగాణ సినిమా చరిత్రలో నిలిచిపోయింది.
హెచ్.రమేష్బాబు, 93916 34727







కామెంట్లు (0)