ప్రజలకు ఇబ్బంది కలగడం నిజమే : 22 ఏపై
మంత్రి పొంగులేటి
15 రోజుల్లోగా నిషేధిత భూములపై దరఖాస్తులకు పరిష్కారం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
22 ఏ నిషేధిత భూముల అంశంలో ప్రజలకు ఇబ్బందులు కలిగాయంటూ రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విచారం వ్యక్తం చేశారు. అందుకు సారీ చెప్పారు. సోమవారం హైదరాబాద్ లోని సచివాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో 22 ఏ నిషేధిత భూముల సమస్యను పరిష్కరించేందుకు ఉన్నతస్ధాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. 22 ఏపై హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాల కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, ఆర్డీవోలు, జిల్లా రిజిస్ట్రార్లు, సబ్‌రిజిస్ట్రార్లతో సుదీర్ఘంగా సమీక్షించినట్టు చెప్పారు. ఈ నాలుగు జిల్లాల్లోనే సమస్య ఎక్కువగా ఉందని, మేడ్చల్- మల్కాజ్‌గిరి జిల్లాలో 511 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. వీటితోపాటు మిగిలిన జిల్లాల్లో 22 ఏ దరఖాస్తులన్నింటినీ ఈ నెలాఖరులోగా పరిష్కరించాలని ఆదేశించామన్నారు. దీనికోసం అవసరమైతే స్లాట్ బుకింగ్‌ల సంఖ్య పెంచాలంటూ సూచించామని చెప్పారు. నిషేధిత భూములపై సమాచారానికి టోల్‌ఫ్రీ నెంబర్ 1800 5994788 ను ఏర్పాటు చేశామని తెలిపారు. ఎవరు దీనికి సమాచారం పంపినా కనీసం మూడు రోజల్లో సమాధానం అందుతుందని తెలిపారు. పరిష్కారానికి చర్యలు చేపడతారని వెల్లడించారు. రిజిస్ట్రేషన్ చేయడానికి అవకాశం లేని కేసుల్లో ఎందుకు చేయలేమో ప్రజలకు స్పష్టమైన కారణం చెబుతారని వివరించారు. రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించినట్లయితే నిబంధనల ప్రకారం తిరిగి చెల్లించాలని ఆదేశించినట్టు తెలిపారు. రాష్ట్రంలోని భూదాన్ భూములు వాటికి సంబంధించిన పెండింగ్ సమస్యలు, వివాదాలు, పరిష్కార మార్గాలపై సమగ్ర నివేదిక రూపొందిస్తున్నట్టు చెప్పారు. యూఎల్‌సీ జాబితాను సరి చేస్తున్నామని, అసలైన హక్కుదారులకు న్యాయం చేస్తూ మరో రెండ్రోజుల్లో తగు చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇచ్చామని మంత్రి పొంగులేటి తెలిపారు.
హైదరాబాద్ జిల్లాలో ఒక ఆస్తికి సర్వేశాఖ నుంచి టీఎస్ఎల్ఆర్, సర్వే నెంబర్లు ఇచ్చినట్టు చెప్పారు. అదేవిధంగా జీహెచ్ఎంసీ కూడా ఇచ్చిందని మంత్రి తెలిపారు. ఈ రెండింటినీ సూపర్ ఇంపోజ్ చేసే సమయంలో ఏర్పడిన సమస్యలను కూడా పరిష్కరిస్తున్నామన్నారు. రంగారెడ్డి జిల్లాలో 12 ఎకరాలు ఉంటే అందులో రెండు ఎకరాలు భూధాన్ భూములుగా పేర్కొంటూ మొత్తం 12 ఎకరాలను 22ఎలో పెట్టడం జరిగిందని చెప్పారు. ఇలాగే కొన్ని దేవాదాయ , అటవీ భూములు కూడా నిషేధిత జాబితాలో ఉన్నాయని జియో ట్యాగింగ్ ద్వారా అసలు స్థలాలకు రిజిస్ట్రేషన్ చేసి మిగిలిన భూములను ఫ్రీహోల్డ్ చేయాలంటూ ఆదేశించామన్నారు. గతంలో హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో అప్పట్లో అధికారులు నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించిన భూముల వివరాలను వదిలేయడంతో అవి నేటికీ కొనసాగుతూ నిషేధిత జాబితాలో ఉండిపోయినందున అధికారుల చర్యలతో సామాన్యులు కూడా ఇబ్బంది పడ్డారని మంత్రి క్షమాపణలు తెలిపారు. నిషేధిత భూముల పేరిట అసలైన యజమానులకు ఎటువంటి అన్యాయం జరగదని హామీ ఇచ్చారు. ఓ వైపు ప్రభుత్వ భూములను పరిరక్షిస్తూనే భవిష్యత్తులో ఎటువంటి పొరపాట్లు జరగనివ్వబోమని వెల్లడించారు. సిఎస్-7, సిఎస్ -14కు సంబంధించి కొన్ని దశాబ్దాలుగా కోర్టు కేసుల్లో మగ్గుతున్నాయన్నారు. ఒకవైపు కోర్టులో హియరింగ్స్ నడుస్తుండగానే మరోవైపు కొన్ని చోట్ల రెగ్యులరైజేషన్ జరిగిందని తెలిపారు. వీటన్నింటిని కూడా పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. హైదరాబాద్ లోని ఆల్విన్, ఆజ్‌బెస్టాస్ కాలనీల్లోని ప్రయివేటు భూములను విభజించి అక్కడ రిజిస్ట్రేషన్లకు ఇబ్బంది లేకుండా చేయాలని ఆదేశించామని మంత్రి పొంగులేటి తెలిపారు.
సారీ.. చింతిస్తున్నా..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



