మంచిర్యాల జిల్లా ఇందారంలో విషాదం
నవతెలంగాణ-జైపూర్
బట్టలు ఉతకడం కోసం వెళ్లి నీటికుంటలో పడి ముగ్గురు మృతిచెందిన ఘటన మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం గ్రామ శివారులోని కాసింపల్లి సమీపంలో ఆదివారం జరిగింది. బతుకుదెరువు కోసం ఉన్న ఊరు వదిలి వలస వచ్చిన కార్మికులను మృత్యుఒడికి చేరారు. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా మంగళగూడ గ్రామపంచాయతీ పరిధిలోని కొత్తూరుకు చెందిన 10 కుటుంబాలు ఉపాధి కోసం వలస వచ్చాయి. ఇందారం గ్రామశివారులో గూడారాలు ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నాయి. గ్యాస్ పొయ్యిలు, బ్యాగు జిప్పులు కుట్టుకుంటూ జీవనోపాధి పొందుతున్నాయి. ఈ క్రమంలో సమీపంలోని నీటికుంటలో బట్టలు ఉతకడం కోసం మనియమ్మ(24) మోటం కీర్తన(16), మదేని కావ్య(10) వెళ్లారు. ప్రమాదవశాత్తు కుంటలో పడిపోయి ప్రాణాలు వదిలారు. వారు ఎంతకి తిరిగిరాకపోవడంతో శిబిరాల్లో ఉన్నవారు నీటికుంట వద్దకు వెళ్లి చూసేసరికి విగతజీవులుగా పడి ఉండటం గుర్తించారు. విషయం తెలుసుకున్న జైపూర్ ఎస్ఐ భూమేష్ సంఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించిన అనంతరం మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.







కామెంట్లు (0)