‘భారత్ సమ్మిట్’ ముగింపు వేడుకల్లో మంత్రి శ్రీధర్ బాబు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ప్రపంచంతో అనుసంధానమవుతూనే సామాజిక న్యాయానికి కట్టుబడి ఉండొచ్చనీ, అభివృద్ధి, సంక్షేమం, ప్రజల ఆత్మ గౌరవం కలిసే ముందుకు సాగొచ్చని తెలంగాణ రాష్ర్టం నిరూపిస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. అంతర్జాతీయ అంశాలపై పరిశోధన, విధానపరమైన చర్చలు, ప్రపంచ సమస్యలకు పరిష్కార మార్గాల అన్వేషణకు శక్తిమంతమైన గ్లోబల్ థింక్ ట్యాంక్‌గా ‘అవర్ వరల్డ్ ఇన్స్టిట్యూట్’ను తీర్చిదిద్దుతామని చెప్పారు. రాహుల్ గాంధీ ఆలోచనలకు కార్యరూపం ఇచ్చేందుకు భారత్ సమ్మిట్ వేదికగా ఈ సంస్థను ప్రారంభించామన్నారు. శనివారం హెచ్ఐసీసీలో నిర్వహించిన ‘భారత్ సమ్మిట్ – 2026’ ముగింపు వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏఐ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో సమానత్వం, వాతావరణ మార్పులు, శాంతి, మీడియా భవిష్యత్తు, ప్రజాస్వామ్య వ్యవస్థల పనితీరు తదితర అంశాలపై నిర్వహించిన చర్చల్లో వివిధ దేశాల ప్రతినిధులు, మేధావులు పాల్గొన్నారని చెప్పారు. డిసెంబర్ 7 నుంచి 9 వరకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2.0’కు హాజరు కావాలని దేశ, విదేశీ ప్రతినిధులను ఆహ్వానం పలికారు.






కామెంట్లు (0)