రూ.9 లక్షల నగదు, బంగారం, వెండి ఆభరణాలు, టాటాసఫారీ కారుతో ఉడాయించిన నిందితులు :
వివరాలు వెల్లడించిన చౌటుప్పల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ డి.సతీష్‌రెడ్డి
నవతెలంగాణ–చౌటుప్పల్
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణంలోని బీసీ కాలనీలో జోగిని దారుణ హత్యకు గురయ్యాడు. అనంతరం నిందితులు రూ.9 లక్షల నగదు, వెండి, బంగారం ఆభరణాలు, టాటాసఫారీ కారుతో పరారయ్యారు. ఈ సంఘటన శనివారం రాత్రి చోటు చేసుకుంది. చౌటుప్పల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ డి.సతీష్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..చౌటుప్పల్ పట్టణంలోని బీసీ కాలనీకి చెందిన రాళ్లబండి సుధాకర్ జోగిని (50) దేవుడి పూజలు, కొలుపులు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో భక్తులు ఆయనకు డబ్బులు, బంగారు ఆభరణాలు సమర్పించేవారు.
అక్టోబర్ 31న రాత్రి 7 గంటలకు సుధాకర్ మేనల్లుడు సురేష్ తన భార్యతో కలిసి చౌటుప్పల్‌లోని ఇంటికి వచ్చి రాత్రి 9.30 గంటల వరకు మాట్లాడి తిరిగి ఇంటికి వెళ్లాడు. రాత్రి 11 గంటలకు మేనమామకు ఫోన్ చేయగా పవన్, అతని స్నేహితుడు హర్షు తన వద్దకు వచ్చారని, వారితో మాట్లాడిన తర్వాత నిద్రపోతానని చెప్పాడు. నవంబర్ 1వ తేది అర్ధరాత్రి 12.38 గంటలకు మృతుడి ఫోన్ నుంచి సురేష్‌కు రెండు వాట్సాప్ వాయిస్ మెసేజ్‌లు వచ్చాయి. దీంతో అనుమానం వచ్చిన సురేష్ మేనమామ ఇంటి సీసీ కెమెరాలను పరిశీలించగా అవి పనిచేయలేదు. వెంటనే ఇంటి వద్దకు వెళ్లి చూడగా గేటు, మెష్ డోర్ తెరిచి ఉండడంతో పాటు ఇంటి ముందు పార్క్ చేసిన టాటా సఫారీ కనిపించలేదు.
దీంతో డయల్ 112కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా ఇంట్లో వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. మొదటి అంతస్తులోని బెడ్రూమ్లో సుధాకర్ స్వామి మంచంపై బోర్లా పడి ఉండగా, చేతులు, కాళ్లు చీరలతో కట్టివేసి రక్తపు మరకల మధ్య మృతిచెంది ఉండడాన్ని గుర్తించారు. మృతుడి ఇంటి నుంచి బంగారు,వెండి ఆభరణాలు, సుమారు రూ.9 లక్షల నగదు, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్తోపాటు టాటా సఫారీ కారు (టీజీ 30 ఏ 5659) అపహరణకు గురయ్యాయి. మృతుని మేనల్లుడు సురేష్ తన స్నేహితుడు పవన్, అతని స్నేహితుడిపై అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గల కారణాలు, అపహరణకు సంబంధించిన వివరాలపై పోలీసులు విచారిస్తున్నారు.






కామెంట్లు (0)