నవంబర్ 20, 21 తేదీల్లో తెలంగాణ ఆరో బాలోత్సవం : తెలంగాణ బాలోత్సవ కమిటీ కార్యదర్శి ఎన్.సోమయ్య
పోస్టర్ ఆవిష్కరణ
నవతెలంగాణ-ముషీరాబాద్
బాలబాలికల్లో దాగి ఉన్న సృజనాత్మకత, కళా నైపుణ్యాలను వెలికితీసి.. వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడమే బాలోత్సవ లక్ష్యమని తెలంగాణ బాలోత్సవ కమిటీ కార్యదర్శి ఎన్. సోమయ్య తెలిపారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 20, 21 తేదీల్లో హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ఆరో బాలోత్సవాన్ని నిర్వహించనున్నట్టు వెల్లడించారు. బాలోత్సవ పోస్టర్‌ను శుక్రవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఉత్సవాల్లో ఒకటి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు పాల్గొనవచ్చని తెలిపారు. జానపద, శాస్త్రీయ నృత్యాలు, వక్తృత్వం, కథా రచన, చెస్, వంట, చిత్రలేఖనం, మ్యాజిక్ చైర్, వందేమాతరం తదితర 25 విభాగాల్లో సాంస్కృతిక, సృజనాత్మక పోటీలు నిర్వహించనున్నట్టు చెప్పారు. బాలోత్సవానికి భాషా సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.వి. రమణాచారి, రిసెప్షన్ కమిటీ అధ్యక్షులు సీహెచ్ వేణుగోపాల్‌రెడ్డి, ప్రముఖ గేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ హాజరుకానున్నారని తెలిపారు. విద్యార్థుల నుంచి వస్తున్న విశేష స్పందనతో తొలుత నవంబర్ 10 వరకు ఉన్న దరఖాస్తుల గడువును 17వ తేదీ వరకు పొడిగించినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బాలోత్సవం అధ్యక్షులు భూపతి వెంకటేశ్వర్లు, కోశాధికారి జి.బుచ్చిరెడ్డి, సహాయ కార్యదర్శి కె.సుజాత, మహేష్, దుర్గ తదితరులు పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)