Magazines

ప్రభుత్వ రంగం ధ్వంసం
కార్మికవర్గానికి ద్రోహం

8 నిమిషాల క్రితం

public sector; Betrayal
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 23, 2026 | 2 నిమిషాల చదవడం

పుస్తకావిష్కరణ సభలో ప్రొఫెసర్‌ ‌హరగోపాల్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

విదేశీ కార్పొరేట్ పెట్టుబడికి గేట్లు తెరిచి ప్రభుత్వ రంగ సంస్థలకు, కార్మికులకు భారత ప్రభుత్వాలు ద్రోహం చేశాయని ప్రొఫెసర్ హరగోపాల్ ‌విమర్శించారు. భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఇప్టూ) రాష్ట్ర కార్యదర్శి ఎం. శ్రీనివాస్ రచించిన 'కార్పొరేట్ కబంద హస్తాల్లో ప్రైవేటు రంగం, జీవించే హక్కుకై' అనే పుస్తకాల ఆవిష్కరణ సభను ఆదివారం హైదరాబాద్‌‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఐ. కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో హరగోపాల్‌ ‌మాట్లాడుతూ ప్రభుత్వాలు ప్రభుత్వ రంగ సంస్థలను వ్యాపార దృక్పథంతో చూస్తున్నాయన్నారు. మొదట్లో లాభాలు రావట్లేదనీ, నష్టాల్లో ఉన్న కంపెనీలను అమ్మాయని తెలిపారు. ఆ తర్వాత కాలంలో లాభాల్లో ఉన్న కంపెనీలనూ అమ్ముతుండటం ఇవాళ చూస్తున్నామని గుర్తు చేశారు. ఇదేమిటని ప్రశ్నిస్తే నష్టాల్లో ఉన్నకంపెనీలను ఎవరు కొంటారనీ, అందుకే లాభాల్లో ఉన్న కంపనీలు అమ్ముతున్నామని ప్రభుత్వం అంటోందన్నారు. ప్రభుత్వ విధానాలను లోతుగా పరిశీలిస్తే కార్పొరేట్ పెట్టుబడికి అనుకూలంగా రాజ్యమే పెట్టుబడులు ఉపసంహరించుకుంటూ కావాలనే కంపెనీలను ప్రయివేటుకు దారాదత్తం చేస్తుందని పేర్కొన్నారు. ఈ విధానం వల్ల అధిక ఆదాయం పొందే కార్మికులు నష్టపోతున్నారని, తక్కువ వేతనం, అధిక శ్రమ చేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘జీవించే హక్కుకై’ పుస్తకాన్ని వీక్షణం మాస పత్రిక సంపాదకులు ఎన్. వేణుగోపాల్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలో ఆచరణలో ఉన్నవారికి, ఆలోచనలో ఉన్నవారికి ఒక అడ్డుగోడని కార్మిక నాయకుడు, పుస్తక రచయిత ఎం. శ్రీనివాస్ అధిగమించాడని తెలిపారు. దేశంలోని సమస్యలన్నిటికీ మూలాలు నూతన ఆర్థిక విధానాల్లో ఉన్నాయని, వాటిని అర్థం చేసుకోవానికి శ్రీనివాస్ రాసిన జీవించే హక్కుకై పుస్తకం దోహదపడుతుందన్నారు. సామరస్యంతో పరిష్కరించగలిగే వాటిని కూడా ప్రభుత్వాలు బలప్రయోగానికి దిగుతున్నాయని, రాజ్యాంగంలోని జీవించే హక్కుని కల్పించే ఆర్టికల్ 21ని ప్రభుత్వాలు ఎలా ఉల్లంఘిస్తున్నాయో జి.ఎన్. సాయిబాబా జీవితంలో మనం చూడొచ్చని, జీవించే హక్కు కోసం పోరాడేవాళ్లపై ప్రభుత్వాలు ఎంత తీవ్రంగా నిర్భందం విధిస్తాయో తెలుసుకునేందుకు సాయిబాబా జీవితం ఒక పాఠం లాంటిదని చెప్పారు. అనంతరం ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత, ఐఎఫ్‌‌టీయూ జాతీయ ఉపాధ్యక్షుడు ప్రదీప్, పుస్తక రచయిత శ్రీనివాస్ మాట్లాడారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్