ఏఐతో ప్రమాదాలకు చెక్
ప్లాస్టిక్ వ్యర్థాలతో రోడ్ల నిర్మాణాలు
ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్(ఐఆర్సీ) 85వ సదస్సులో నిపుణులు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గ్రామీణ రహదారుల అభివృద్ధికి డిజిటల్ ప్రాధాన్యత సాధనం దోహదపడుతున్నదనీ, ఏఐ టెక్నాలజీ ద్వారా ప్రమాదాలకు చెక్ పెట్టవచ్చునని ప్రొఫెసర్లు, నిపుణులు తెలిపారు. ప్లాస్టిక్ వ్యర్థాలతో రోడ్ల నిర్మాణాలు చేపట్టే విధానాల గురించి వివరించారు. హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ (ఐఆర్సీ) 85వ వార్షిక సదస్సులో భాగంగా శుక్రవారం పలు సెషన్లను నిర్వహించారు. ముంబైలోని సర్దార్ పటేల్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ సివిల్ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ ప్రశాంత్ పి. నాగ్రాలే, పరిశోధక విద్యార్థి ప్రవీణ్‌కుమార్ ఎస్. జాగాప్ పరిశోధన చేపట్టి రహదారి డేటా సేకరణ, విశ్లేషణ, ర్యాంకింగ్ వరకు మొత్తం ప్రక్రియను ఆటోమేట్ చేసేలా పైథాన్ ఆధారిత పీపీ25 సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేశారు.మహారాష్ట్రలోని థానే జిల్లా అంబర్నాథ్ బ్లాక్ పరిధిలో 25 గ్రామీణ రహదారి విభాగాలపై ఈ సాఫ్ట్‌వేర్‌ను పరీక్షించి విజయవంతమయ్యారు. దానికి సంబంధించిన జర్నల్స్‌ను సదస్సులో ప్రవేశపెట్టారు.
ప్లాస్టిక్ వ్యర్థాలతో రహదారులు.. స్టెయిన్లెస్ స్టీల్‌తో మన్నికైన వంతెనలు
రహదారులు, వంతెనల నిర్మాణంలో పర్యావరణ పరిరక్షణ, మన్నిక, భద్రత, దీర్ఘకాలిక వ్యయ తగ్గింపే లక్ష్యంగా సరికొత్త సాంకేతిక పరిష్కారాలను అనుసరించాలని నిపుణులు సూచించారు. సీఎస్ఐఆర్-సీఆర్ఆర్ఐ పరిశోధకులు మిశ్రమ ప్లాస్టిక్ వ్యర్థాలను నేరుగా వినియోగించి జియోసెల్స్ తయారు చేసే విధానాన్ని వివరించారు. ఈ సాంకేతికత ద్వారా 500 మీటర్ల రహదారి నిర్మాణానికి సుమారు 50 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను వినియోగించవచ్చనీ, సబ్గ్రేడ్పై ఒత్తిడిని 15–20 శాతం తగ్గించవచ్చని వెల్లడించారు. పాత కాంక్రీట్ వంతెనల పునరుద్ధరణలో ఎక్స్టర్నల్ పోస్ట్-టెన్షనింగ్ యాంకరేజీల సరైన జ్యామితీయ రూపకల్పన షియర్ వైఫల్యాల ముప్పును తగ్గిస్తుందని నిపుణులు తెలిపారు. నిర్మాణాల్లో స్టెయిన్లెస్ స్టీల్ వినియోగం తుప్పు సమస్యలను తగ్గించి, జీవితకాల నిర్వహణ వ్యయాన్ని గణనీయంగా ఆదా చేస్తుందని వివరించారు. అలాగే ఐఓటీ సెన్సార్లు, ఏఐ ఆధారిత కాంట్రాక్ట్ మేనేజ్మెంట్ ద్వారా నిర్మాణ పనుల పర్యవేక్షణ, రిస్క్ అంచనా, సమయపాలన, పారదర్శకతను మెరుగుపరచవచ్చని పేర్కొన్నారు.
ఏఐతో ప్రమాదాలకు చెక్
రహదారులపై ఏర్పడే పగుళ్ల నుంచి ప్రమాదకర పరిస్థితుల వరకు ముందుగానే గుర్తించి, సకాలంలో మరమ్మతులు చేపట్టేలా కృత్రిమ మేధస్సు(ఏఐ), డిజిటల్ టెక్నాలజీని విస్తృతంగా వినియోగించాలని నిపుణులు సూచించారు. సుస్థిర మౌలిక సదుపాయాలు, వాతావరణ మార్పులను తట్టుకునే రహదారులు, స్మార్ట్ హైవే నిర్వహణ, రోడ్డు భద్రత, ఎలక్ట్రిక్ మొబిలిటీ, డిజిటల్ ఇంజినీరింగ్‌పై జరిగిన సెషన్లో వివిధ సంస్థల ప్రతినిధులు ప్రదర్శనలు ఇచ్చారు. ఎన్హెచ్ఏఐ ప్రవేశపెట్టిన ఏఐ ఆధారిత రహదారి తనిఖీ విధానం ద్వారా 50 వేల కిలోమీటర్లకు పైగా జాతీయ రహదారుల నెట్‌వర్క్‌లో లోపాలను గుర్తించిన ప్రక్రియను వివరించారు. త్రీడీ లేజర్ ప్రొఫైలర్లు, డాష్‌క్యామ్ వీడియోలతో 765 ప్రాజెక్టుల్లో 91,700కుపైగా లోపాలను గుర్తించినట్లు తెలిపారు. 2030 నాటికి రోడ్డు ప్రమాద మరణాలను 50 శాతం తగ్గించేందుకు కృషిచేస్తున్నామన్నారు. హైవే నిర్వహణలో ట్రాఫిక్ పర్యవేక్షణ, ప్రమాదాల గుర్తింపు కెమెరాలు, 1033 హెల్ప్‌లైన్, టోల్ వ్యవస్థలు విడివిడిగా పనిచేయకుండా ఒకే సమగ్ర వ్యవస్థలో అనుసంధానించాల్సిన అవసరాన్ని ఆర్కాడిస్ సంస్థ ప్రతినిధులు వివరించారు.
మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల రూపకల్పన నుంచి నిర్మాణం, నిర్వహణ వరకు ప్రతి దశలో డిజిటల్ ఇంజినీరింగ్, ఏఐ వినియోగం పెరగాలని రోయిక్ కన్సల్టెంట్స్ ప్రతినిధి నిరంజన్ సింఘాల్ సూచించారు. శాటిలైట్ చిత్రాలు, లైడార్ సాంకేతికతతో రహదారి అలైన్మెంట్ల ఎంపిక, గూగుల్ మ్యాప్స్, ఫాస్టాగ్ డేటాతో ట్రాఫిక్ అంచనాలు, డీపీఆర్‌లలో లోపాలు, అనుగుణ్యత తనిఖీలు, టెండరింగ్ ప్రక్రియల్లో ఏఐ వినియోగం ద్వారా ప్రాజెక్టుల జాప్యాన్ని తగ్గించవచ్చన్నారు. రోడ్డిక్ డిజిటల్ ప్లాట్ఫామ్లో రహదారి ఆస్తుల పర్యవేక్షణ, సమాచార విశ్లేషణ, ఏఐ అసిస్టెంట్, బ్రిడ్జి సామర్థ్య అంచనా, డీపీఆర్ తయారీ వంటి సేవలను వివరించారు. రోడ్డు భద్రతపై జరిగిన చర్చల్లో ప్రమాదాల నివారణకు నిర్మాణాత్మక మార్పులతో పాటు ప్రజల్లో అవగాహన, ప్రమాద బాధితులకు తక్షణ వైద్య సహాయం అవసరమని ట్రాన్స్అర్బన్ నార్త్ అమెరికా ప్రతినిధులు సూచించారు.
వర్క్జోన్లలో ఆటోమేటెడ్ వేగ నియంత్రణ చర్యలతో పెన్సిల్వేనియాలో అతివేగ ఘటనలు 43 శాతం తగ్గినట్లు, ప్రమాద స్థలాలను త్వరగా క్లియర్ చేయకపోతే ద్వితీయ ప్రమాదాల ముప్పు పెరుగుతుందని వివరించారు. ప్రశ్నోత్తరాల సమావేశంలో ఎన్హెచ్ఏఐ ప్రతినిధులు 25 వేల కిలోమీటర్ల జాతీయ రహదారుల పరిధిలో 25 నుంచి 30 శాతం సైన్‌బోర్డులు లోపభూయిష్టంగా ఉన్నట్లు తెలిపారు. గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే వాహనాలకు అనువైన హైవే కారిడార్ల కోసం కొత్త మార్గదర్శకాలు, వంతెనల తనిఖీలకు డ్రోన్లు, నాన్-డిస్ట్రక్టివ్ టెస్టింగ్ విధానాల అమలుపై ప్రణాళికలను వెల్లడించారు. రహదారి భద్రతకు ప్రాధాన్యతనిస్తూ ఏఐ ఆధారిత భవిష్యత్ హైవే నెట్‌వర్క్‌ను తీర్చిదిద్దాలని సమావేశం ముగింపులో నిపుణులు అభిప్రాయపడ్డారు.






కామెంట్లు (0)