రైతులకు నష్టపరిహారమిచ్చి ఆదుకోవాలి : సీపీఐ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఎల్నినోతో రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులున్న నేపథ్యంలో కరువు మండలాలను వెంటనే ప్రకటించాలనీ, రైతులకు నష్టపరిహారమిచ్చి ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సీపీఐ డిమాండ్ చేసింది. సోమవారం హైదరాబాద్లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర సమితి సమావేశం జరిగింది. అందులో పై తీర్మానాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు బాగం హేమంతరావు ప్రవేశపెట్టగా..రాష్ట్ర సమితి ఏకగ్రీవంగా ఆమోదించింది. సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జాతీయ నేత కె.నారాయణ, జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర సమితి పలు డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం ముందుంచింది. రాష్ట్రంలో నెలకొన్న తీవ్రమైన కరువు పరిస్థితుల నేపథ్యంలో తక్షణమే అన్ని పార్టీలు, రైతు సంఘాలతో అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరింది. కరువు సహాయక చర్యల కోసం ఎంత నిధి అవసరమో నివేదికలు రూపొందించి, కేంద్ర ప్రభుత్వానికి పంపాలని సూచించింది. పొట్టకొచ్చిన వరి పంటను రక్షించేందుకు సాగునీరందించాలని కోరింది.
కరెంట్ కోతలు లేకుండా సక్రమంగా, నాణ్యమైన విద్యుత్ అందించాలని విన్నవించింది.
నష్టపోయిన పంటలకు ఎకరాకు వరికి ఎకరాకు రూ. 30 వేలు, పత్తి, మిర్చికి రూ. 50 వేలు, ఇతర పంటలకు రూ. 20 వేల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని కోరింది. రాష్ట్రంలో ప్రాజెక్టులలో నీటి లభ్యతపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేసింది. తాగునీటి సమస్యను నివారించేందుకు గ్రామ పంచాయతీలకు ప్రత్యేక నిధులు ఇవ్వాలని కోరింది. విద్యుత్ కోతలను నివారించేందుకు విద్యుత్ ఉత్పత్తికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసింది. కౌలు రైతులను గుర్తించి పంట నష్ట పరిహారం ఇవ్వాలని కోరింది. వ్యవసాయ కార్మికులకు, కౌలు రైతులకు అదనపు పని దినాలు, విబిజి రామ్ జీ ద్వారా కల్పించాలని డిమాండ్ చేసింది. పశువుల మేత సరఫరా చేయాలని సూచించింది.
కరువు పరిస్థితులలో 14 రకాల నిత్యావసర వస్తువులు చౌక దుకాణాల ద్వారా సరఫరా చేయాలని డిమాండ్ చేసింది. కరువు వలన పని కోల్పోతున్న అసంఘటిత కార్మికులకు ప్రత్యేక పథకం ద్వారా ఉపాధి కల్పించాలని విన్నవించింది.






కామెంట్లు (0)