Magazines

మోడీ హయాంలో రైతుల ఖర్చులు రెట్టింపు

14 నిమిషాల క్రితం

Farmers
avatar
balaji

ప్రచురించబడింది నవం 11, 2026 | 6 నిమిషాల చదవడం

కరువుపై సమగ్ర కార్యాచరణ రూపొందించడంలో కేంద్రం విఫలం

అంబానీ, అదానీలకు ప్రభుత్వ గోదాముల అప్పగింత దారుణం

కాగితాల్లోనే ఎమ్‌ఎస్‌‌పీ గ్యారంటీ

స్వేచ్ఛావాణిజ్య ఒప్పందాలతో అన్నదాతకు మరణశాసనం

త్వరలో తెలంగాణ, కర్నాటక, రాజస్థాన్‌‌లో రైతు పాదయాత్రలు

36 జాతీయ మహాసభల అనంతరం పోరాటాలు తీవ్రతరం చేస్తాం :
నవతెలంగాణతో అఖిల భారత కిసాన్‌ సభ ప్రధాన కార్యదర్శి విజ్జూ కృష్ణన్‌


‘వ్యవసాయం లాభసాటే. దానిపై కార్పొరేట్ల కన్ను పడింది. వారికి లబ్ది చేకూర్చేలా పాలకులు తమ విధానాలతో రైతులను సంక్షోభంలోకి నెడుతున్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని అధికారంలోకి వచ్చిన ప్రధాని మోడీ ఆ తర్వాత మాట తప్పారు. అంబానీ, అదానీల కోసం తీసుకుంటున్న నిర్ణయాలతో రైతుల సాగు ఖర్చులు రెట్టింపు అయ్యాయి. కార్పొరేట్లు దేశ వనరులను కొల్లగొట్టే క్రమంలో జరుగుతున్న పర్యావరణ విధ్వంసం వల్ల వాతావరణ సమతుల్యత దెబ్బతిని అతివృష్టి, అనావృష్టి పరిస్థితులతో రైతులు నష్టపోతున్నారు. కరువుపై సమగ్ర కార్యాచరణ రూపొందించడంలో పాలకులు విఫలమవుతున్నారు. మరోవైపు కేంద్రం అంబానీ, అదానీలకు గోదాములను అప్పగిస్తోంది.

ఎమ్‌ఎస్‌‌పీ గ్యారంటీ కాగితాలకే పరిమితమైంది. అమెరికా, న్యూజిలాండ్‌, యూరోపియన్‌ ‌యూనియన్‌‌తో మోడీ సర్కారు చేసుకుంటున్న వాణిజ్య ఒప్పందాలు అన్నదాతకు మరణశాసనంగా మారాయి. ఇలాంటి తరుణంలో రైతులకు పోరాటాలే శరణ్యం. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట గడ్డ ‌నల్లగొండలో ఈ నెల 15 నుంచి 18 వరకు జరగబోయే ఏఐకేఎస్‌ 36 వ మహాసభల్లో పోరాట కార్యాచరణ రూపొందిస్తాం. మహారాష్ట్ర తరహాలో త్వరలో తెలంగాణ, కర్నాటక, రాజస్థాన్‌లో మహాపాదయాత్రలు చేపట్టబోతున్నాం’ అని అఖిల భారత కిసాన్‌ ‌సభ (ఏఐకేఎస్‌) ప్రధాన కార్యదర్శి విజ్జూ కృష్ణన్‌ ‌తెలిపారు. ఏఐకేఎస్‌ 36 ‌జాతీయ మహాసభల నేపథ్యంలో నవతెలంగాణ ప్రతినిధి అచ్చిన ప్రశాంత్‌‌కు ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ విశేషాలివి...


దేశంలో 35 ఏండ్లుగా అమలవుతున్న ఆర్థిక సంస్కరణలు రైతాంగాన్ని ఏ పరిస్థితుల్లోకి నెట్టాయి?

మన దేశంలో 35 ఏండ్ల క్రితం సరళీకృత ఆర్థిక విధానాలు అమల్లోకి వచ్చాయి. ఆనాటి నుంచి నేటి వరకు కాంగ్రెస్‌, బీజేపీ ప్రభుత్వాలు రైతుల విషయంలో ఒకే దృష్టితో పనిచేస్తున్నాయి. 2014లో అధికారంలోకి రావడానికి ముందు నరేంద్రమోడీ రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని హామీనిచ్చారు. ఆయన ప్రధాని అయ్యాక రైతుల ఆదాయం రెట్టింపు ఏమోగానీ పెట్టుబడుల ఖర్చులు రెండు, మూడు రెట్లు పెరిగాయి. నేషనల్‌ ‌క్రైమ్‌ ‌బ్యూరో నివేదిక ప్రకారం 2014 నుంచి లక్షన్నర మంది రైతులు, వ్యవసాయ కార్మికులు చనిపోయారు. 3.5 లక్షల వలస కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇది కేవలం 12 రాష్ర్టాల్లోనే. దేశంలోని రైతాంగ పరిస్థితికి ఇవే సజీవ సాక్ష్యాలు.

​వాతావరణ మార్పులు, ఎల్‌నినో ప్రభావం వ్యవసాయ రంగాన్ని మరింత సంక్షోభంలోకి నెడుతున్నాయి. ప్రభుత్వాల సన్నద్ధత ఎలా ఉంది?

పర్యావరణ విధ్వంసానికి పాలకులు తీసుకుంటున్న నిర్ణయాలే కారణం. కార్పొరేట్లకు వనరులను దోచిపెట్టడంలో భాగంగా అడవుల విధ్వంసం జరుగుతున్న విషయాన్ని ఎవ్వరూ కాదనలేరు. దీంతో వాతావరణంలో పెను మార్పులు సంభవిస్తున్నాయి. ఒకవైపు అతివృష్టి, మరోవైపు అనావృష్టి, వాతావరణంలో అకాల మార్పులు... వెరసి పంటలు దెబ్బతింటున్నాయి. ఎల్‌‌నినో అందులో భాగమే. మహారాష్ట్ర, తెలంగాణ, కర్నాటక, ఆంధ్రప్రదేశ్ సహా అనేక రాష్ట్రాల్లో ఎల్‌‌నినోతో 341 జిల్లాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నాయి. వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వాల వద్ద సమగ్ర కార్యాచరణ లేదు. కరువు వచ్చిన తర్వాత ప్రకటనలు చేయడం, వరదలు వచ్చిన తర్వాత పర్యటనలు చేయడం వల్ల ప్రయోజనమేమీ ఉండబోదు. ముందస్తు ప్రణాళికలు అవసరం. ప్రతి జిల్లాకు వాతావరణ ఆధారిత వ్యవసాయ ప్రణాళికను రూపొందించాలి. పంటల బీమాను సమర్థవంతంగా అమలు చేయాలి.

​​2018లో మహారాష్ట్రలో నాసిక్‌ ‌నుంచి ముంబయి వరకు జరిగిన కిసాన్‌‌లాంగ్‌ ‌మార్చ్‌ ‌దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది కదా..ఆ ఉద్యమం ఇచ్చిన స్ఫూర్తి, ఢిల్లీ రైతాంగ పోరాటానికి పడిన దారుల గురించి వివరిస్తారా?

స్ఫూర్తిదాయకమైన కిసాన్‌ లాంగ్‌ ‌మార్చ్‌ దేశంలో ఐక్య ఉద్యమాలకు నాంది పలికింది. అనేక హక్కులను అన్నదాతలు రాబట్టుకున్న పోరాటమది. కోవిడ్‌ ‌మహమ్మారితో ప్రజలు అల్లాడుతున్న సమయంలో కార్పొరేట్లకు మేలు చేసేందుకు మోడీ ప్రభుత్వం దొడ్డిదారిన మూడు వ్యవసాయ నల్ల చట్టాలను, లేబర్‌‌కోడ్‌‌లను తీసుకొచ్చింది. వ్యవసాయ కార్పొరేటీకరణకు ద్వారాలు తెరిచింది. బ్లాక్‌‌మార్కెట్‌‌ను ప్రమోట్‌ ‌చేసింది. దీన్ని నిరసిస్తూ రైతులు పెద్ద ఎత్తున పోరాటాల్లోకి వచ్చారు. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా మహోద్యమంగా మారింది. రైతుల పక్షాన పోరాడే వారిపై ఖలీస్తానీ, పాకిస్తానీ తీవ్రవాదులు అని బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ ‌వాళ్లు ముద్రవేశారు. మోడీ సర్కారు కార్పొరేట్‌ ‌మీడియా ద్వారా వారిపై విషప్రచారాన్ని చేయించింది. అయినా, రైతులు వెనక్కి తగ్గలేదు. ఆ పోరాటంలో 736 మంది రైతులు చనిపోయారు. మోడీ సర్కారు మెడలు వంచి మరీ మూడు నల్ల చట్టాలను వెనక్కి తీసుకునేలా చేసిన మహోత్తర పోరాటమది. శత్రుగుండెల్లో భయం నాటిన ఉద్యమమది. ఇటీవల మహారాష్ట్ర అంకోలాలో రైతులు పెద్ద ఎత్తున పాదయాత్ర చేపట్టారు. అందులో నేను స్వయంగా పాల్గొన్నా. కొన్ని డిమాండ్లను రైతులు నెరవేర్చుకోగలిగారు.

​ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ), ధాన్యం సేకరణ, నిల్వ వ్యవస్థను ప్రయివేటీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే విమర్శలున్నాయి. దీని వల్ల రైతులకు కలిగే నష్టమేమిటి?

దేశంలో ఆహార భద్రతకు ఎఫ్‌సీఐ అత్యంత కీలకమైన సంస్థ. కానీ, ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) సిఫారసులు, శాంతకుమార్ కమిటీ సూచనల పేరుతో ప్రభుత్వ ధాన్యం సేకరణ వ్యవస్థను బలహీనపరిచే విధానాలను ముందుకు తీసుకొచ్చింది. గోదాములు, నిల్వ సౌకర్యాలు, సరఫరా వ్యవస్థలను అంబానీ, అదానీలకు కట్టబెడుతున్నది. ఇప్పుడున్న ప్రభుత్వం రైతు సంక్షేమ కోసం పనిచేయడం లేదు. కార్పొరేట్ల కోసమే పనిచేస్తున్నది. దీనివల్ల మొదట నష్టపోయేది చిన్న, సన్నకారు రైతులే. ప్రయివేటు వ్యాపారుల చేతుల్లో మార్కెట్ కేంద్రీకృతమైతే రైతులకు బేరసారాల శక్తి ఉండదు. ఎంఎస్‌పీ కాగితాలకే పరిమితమవుతుంది. ప్రజా పంపిణీ వ్యవస్థ బలహీనపడుతుంది. ఎఫ్‌సీఐని బలోపేతం చేసి ప్రభుత్వమే ధాన్యం సేకరణను కొనసాగించాలి. అన్ని ప్రధాన పంటలకు ఎంఎస్‌పీపై చట్టబద్ధమైన హామీ కల్పించాలి.

​అమెరికా, న్యూజిలాండ్ వంటి దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు దేశ రైతాంగానికి ప్రయోజనకరమని మోడీ సర్కారు చెబుతున్నది...మీరేమో దేశసమగ్రతకే ప్రమాదమని అంటున్నారు...దీన్ని ఎలా చూడాలి?

మోడీ ప్రభుత్వం చెబుతున్నది పచ్చి అబద్ధాలు. న్యూజిలాండ్‌‌లో మిల్క్‌ ప్రొడక్ట్స్‌ అధికం. అక్కడ అత్యధిక సబ్సిడీలిస్తారు. అక్కడ ఉత్పత్తి అయ్యే పాలల్లో ఆరు శాతాన్నే ఆ దేశం వినియోగించుకుంటున్నది. మిగతా 94 శాతం అమ్ముకునేందుకు వ్యాపార కేంద్రం కావాలి. అందువల్లే ఆ దేశం కన్ను భారత్‌‌పై పడింది. మిల్క్‌‌పౌడర్‌తోపాటు వేర్వేరు రూపాల్లో భారత్‌‌కు వస్తున్న పాల ఉత్పత్తుల వల్ల మన దేశంలోని పాడి రైతుల ఉపాధికి గండిపడుతుంది. అమెరికాలో ఒక రైతు సరాసరి భూమి 469 ఎకరాలు. వారికి లక్షలాది రూపాయల సబ్సిడీ అందుతోంది. మన దేశంలో 86 శాతం మంది రైతులు ఐదెకరాల లోపే కలిగి ఉన్నారు. ఇక్కడి రైతుకు సగటున అందుతున్న సబ్సిడీ కేవలం రూ.34 వేలు మాత్రమే. అలాంటప్పుడు ఆ దేశ రైతులతో మన రైతులు ఎలా పోటీ పడగలుగుతారు? అమెరికాలో సోయాబీన్‌, కాటన్‌, మొక్కజొన్న తదితర పంటలు అధికంగా పండుతున్నాయి. అవి పెద్ద ఎత్తున దిగుమతి అయితే మన రైతుల జీవనోపాధి ఏం కావాలి? అమెరికా తన దేశ రైతుల మేలు కోసం మన దేశంపై ఒత్తిడి తీసుకొస్తుంటే...మన రైతుల జీవనోపాధి దెబ్బతింటుందనే సోయి మన పాలకులకు ఉండాలి కదా? దీన్ని ప్రజలు ఆలోచించాలి. దేశంలో ఇప్పటికే ఎమ్‌ఎస్‌‌పీకి గ్యారెంటీ లేదు. అక్కడ నుంచి వస్తే ఇంకా ధరలు తగ్గిపోతాయి. అమెరికాతో స్చేచ్ఛావాణిజ్య ఒప్పందం మన దేశ రైతాంగానికి మరణదండనే.

​విద్యుత్‌, విత్తన రంగాలపై ప్రభుత్వ విధానాలు ఎలా ఉన్నాయి?
మోడీ సర్కారు వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు కుట్రలు పన్నుతున్నది. విద్యుత్‌ ‌తయారీ, సరఫరాను ప్రయివేటుకు కట్టబెట్టే పనికి పూనుకున్నది. దీనివల్ల ప్రజలకు, రైతులకు క్రాస్‌ ‌సబ్సిడీ పోతుంది. స్మార్ట్‌‌మీటర్లు పెడితే ఫోన్‌‌మాదిరిగా రీచార్జి చేయించుకోవాలి. లేకుంటే కరెంట్‌ ‌కట్‌ అవుతుంది. నెలకు రూ.10 వేలు నుంచి రూ.12 వేల బిల్లు వచ్చే ప్రమాదం ఉంది. మహారాష్ట్రలోని పాల్ఘడ్‌ ‌జిల్లాలోని ఆదివాసీ రైతు తనకు లక్ష రూపాయల బిల్లు వచ్చిందని చూపెట్టారు. అంత బిల్లు రైతులు కట్టగలుగుతారా? ఇప్పటికే పలు రాష్ర్టాల్లో దీనిపై తీవ్ర వ్యతిరేకత మొదలైంది. స్మార్ట్‌ ‌మీటర్లు మరణశాసనం లాంటివి. ప్రభుత్వ విధానాల వల్ల విత్తన రంగంలో మోనోపాలిజం పెరిగిపోతున్నది. నాలుగైదు కార్పొరేట్‌ ‌సంస్థలు గుత్తాధిపత్యాన్ని కొనసాగిస్తున్నాయి. ఇది అత్యంత ప్రమాదకరం. అందువల్ల విద్యుత్‌, సీడ్స్‌‌పై ఆధిపత్యాన్ని ప్రభుత్వమే కలిగి ఉండాలి. ​

​భవిష్యత్తు పోరాట కార్యాచరణ ఎలా ఉండబోతున్నది?

ఎమ్‌ఎస్‌ ‌స్వామినాథన్‌ ‌కమిటీ సిఫారసుల అమలు కోసం పెద్ద ఎత్తున పోరాటాలు చేయాలని నిర్ణయించాం. ఎమ్‌ఎస్‌‌పీ గ్యారంటీ చట్టం, రైతులకు రుణమాఫీ, రైతులకు, వ్యవసాయ కూలీలకు కనీస పెన్షన్‌ ‌రూ.10 వేలు, వీబీగ్రామ్‌‌జీ ద్వారా పేదలకు రోజుకు రూ.700 కూలి ఇచ్చి 200 పనిదినాల కల్పన, విద్యుత్‌ ‌సవరణ బిల్లు, సీడ్‌ ‌బిల్లు, ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ బిల్లు, స్వేచ్ఛావాణిజ్య ఒప్పందాల రద్దు, భూపంపిణీ, భూ సమస్యల పరిష్కారం, లేబర్‌ ‌కోడ్ల ఉపసంహరణ, తదితర అంశాలపై సంయుక్త కిసాన్‌‌మోర్చా ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఉద్యమాలను చేయబోతున్నాం. ఈ నెల 26న అన్ని రాష్ర్టాల్లో పెద్ద ఎత్తున పోరాటం చేయబోతున్నాం. డిసెంబర్‌ 1,2,3 లలో లేబర్‌‌కోడ్‌‌లకు వ్యతిరేకంగా ఢిల్లీలో పోరాటం చేయబోతున్నారు. దేశంలో ప్రత్యామ్నాయ విధానాల కోసం కార్మిక, కర్షక మైత్రితో పోరాటాలను కొనసాగిస్తాం. సర్‌ ‌పేరుతో 14 కోట్ల ఓట్లను మోడీ సర్కారు తొలగించింది. దీన్ని వ్యతిరేకిస్తున్నాం. ప్రజాస్వామ్యాన్ని సరంక్షించడానికి పోరాటం చేస్తాం. దేశంలో మతోన్మాదం పెరుగుతున్నది. దాన్ని వ్యతిరేకిస్తూ పోరాటాలు ఉధృతం చేస్తాం. దేశంలో ఆర్‌ఎస్‌ఎస్‌ ‌నియో ఫాసిస్టు డైరెక్షన్‌‌లో కార్పొరేట్‌-‌కమ్యూనల్‌ ‌పాలన సాగుతున్నది. దానిపై పెద్ద ఎత్తున పోరాటం చేయబోతున్నాం.

​తెలంగాణలోనే ఏఐకేఎస్‌ ‌మహాసభలు నిర్వహించడానికి కారణమేంటి?
ఏఐకేఎస్‌ ఏర్పడి 90 ఏండ్లు అవుతున్నది. తెలంగాణ గడ్డ మీద రైతాంగ సాయుధ పోరాటం జరిగి 80 ఏండ్లు అవుతున్నది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం దేశంలోనేకాదు ప్రపంచంలోనే స్ఫూర్తిదాయక రైతాంగ పోరాటం. వేలాది మంది ఆ పోరాటంలో చనిపోయారు. చాలా మంది జైళ్లపాలయ్యారు. భూస్వాముల భూమిని పేదలు, రైతులకు పంచారు. రైతుల హక్కుల కోసం జరిగిన ఆ పోరాటంలో ఎంతో మంది పేదలకు మేలు జరిగింది. వెట్టిచాకిరీ పోయింది. కులవివక్ష తగ్గింది. ఫ్యూడల్‌ ‌విధానాలకు వ్యతిరేకంగా జరిగిన ఆ పోరాట స్ఫూర్తితో స్వేచ్ఛావాణిజ్య ఒప్పందాలను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున పోరాటం చేయబోతున్నాం. నేటికీ దేశంలో భూ సమస్య పరిష్కారం కాలేదు. భూమి లేని పేదలకు భూమి పంచేదాకా ఉద్యమిస్తాం. దేశవ్యాప్తంగా బలమైన పోరాటాల రూపకల్పనకు ప్రయత్నిస్తున్నాం. రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం కృషి చేస్తున్నాం. మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతాం. దేశంలోని సమస్యల నుంచి ప్రజల మనస్సులను డైవర్ట్‌ ‌చేయడానికి దేశంలోని పాలకులు మతోన్మాదాన్ని పెంచి పోషిస్తున్నారు. దీన్ని తిప్పికొడతాం.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్