మోడీ సర్కారు విధానాలను తిప్పికొట్టడం ఐక్యపోరాటాలతోనే సాధ్యం
ఈ నెల 15 నుంచి 18 వరకు నల్లగొండలో ఏఐకేఎస్ జాతీయ మహాసభలు
15న జరిగే బహిరంగ సభను జయప్రదం చేయండి : అఖిల భారత కిసాన్ సభ ప్రధాన కార్యదర్శి విజ్జూ కృష్ణన్
నవతెలంగాణ బ్యూరో -హైదరాబాద్
రైతులకు మరణశాసనంలా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు మారాయనీ, లేబర్కోడ్లు, మోడీ అనుసరిస్తున్న రైతాంగ వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు ఐక్యపోరాటాలే మార్గమని అఖిల భారత కిసాన్ సభ ప్రధాన కార్యదర్శి విజ్జూ కృష్ణన్ నొక్కి చెప్పారు. ఈ నెల 15 నుంచి 18 వరకు నల్లగొండ పట్టణంలో జరగబోయే ఏఐకేఎస్ 36వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలనీ, బహిరంగ సభకు రైతులు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. నల్లగొండలో జరగనున్న ఏఐకేఎస్ 36వ జాతీయ మహాసభలను పురస్కరించుకుని గురువారం హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో రైతు సంఘం ఆధ్వర్యంలో ప్రెస్‌మీట్ నిర్వహించారు. అందులో విజ్జూ కృష్ణన్ మాట్లాడుతూ... దేశంలోనే కాదు ప్రపంచంలోనే రైతుల కోసం పోరాడుతున్న అతి పెద్ద సంఘం అఖిల భారత కిసాన్ సభ అని గర్వంగా చెప్పారు. జాతీయ మహాసభలను పురస్కరించుకుని నల్లగొండ పట్టణంలో ఈ నెల 15న మహాప్రదర్శన, రెడ్షర్ట్వాలంటీర్ల కవాతు ఉంటుందనీ, ఎన్జీ కళాశాల ప్రాంగణంలో వేలాది మందితో బహిరంగ సభ ఉందని వెల్లడించారు.
బహిరంగ సభకు ముఖ్య అతిథిగా మాజీ ఎంపీ బృందాకరత్ రానున్నారని తెలిపారు. ప్రతినిధుల సభకు వెయ్యి మంది డెలిగేట్లతో పాటు మరో వెయ్యి మంది పరిశీలకులు, ఎస్కేఎమ్ ప్రతినిధులు, ప్రజా సంఘాల ప్రతినిధులు హాజరవుతారని వివరించారు. నల్లగొండ మహాసభ భవిష్యత్తు పోరాటాలకు నాంది కాబోతుందన్నారు. రైతు ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న ప్రధాని మోడీ...12 ఏండ్ల పాలనలో అన్నదాతలను మరింత కష్టాల్లోకి నెట్టారని విమర్శించారు. దేశంలో 356 జిల్లాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నాయనీ, తెలంగాణ, కర్నాకట, మహారాష్ట్ర, ఏపీ, రాజస్థాన్‌లో పరిస్థితి తీవ్రంగా ఉందని చెప్పారు. కరువు నివారణ చర్యలు చేపట్టడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులను, వ్యవసాయ కూలీలను ఆదుకోవాలని కోరారు. వీబీ గ్రామ్‌జీ చట్టం ద్వారా పేదలకు
200 పనిదినాలు కల్పించాలనీ, రోజువారీ వేతనం రూ.700 ఇవ్వాలని డిమాండ్ చేశారు.
యూఎస్ఏ, యూకే, న్యూజిలాండ్, యూరోపియన్ యూనియన్‌తో చేసుకుంటున్న వాణిజ్య ఒప్పందాలు మన దేశ రైతులకు మరణశాసనంగా మారబోతున్నాయని హెచ్చరించారు. యూఎస్, న్యూజిలాండ్ దేశాల్లో రైతులకు పెద్ద ఎత్తున రాయితీలు ఇస్తారనీ, మన దగ్గర ఇచ్చే సబ్సిడీలు అంతంతే అయినప్పుడు ఆ దేశ రైతులతో మన దేశ రైతులు ఎలా పోటీ పడగలుగుతారని ప్రశ్నించారు. ఢిల్లీ రైతాంగ పోరాటంతో మోడీ సర్కారు తెచ్చిన మూడు నల్లచట్టాలను ఉపసంహరించుకున్నదనీ, ఇది రైతుల విజయమైనప్పటికీ ఆ పోరాటంలో కార్మికులు, ప్రజల సహకారం మరువలేనిదని చెప్పారు. దేశంలో సర్పేరుతో 14 కోట్ల ఓట్లు తొలగించడం దారుణమన్నారు. మోడీ సర్కారు ప్రజాస్వామిక, లౌకిక విలువలను కాలరాస్తున్నదనీ, 12 ఏండ్ల కాలంలో దళితులు, మైనార్టీలు, ఆదివాసీలపై దాడులు తీవ్రమయ్యాయని వివరించారు. మోడీ సర్కారు అనుసరిస్తున్న కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు దేశవ్యాప్తంగా ఐక్య ఉద్యమాలను బలోపేతం చేయనున్నట్టు ప్రకటించారు.
మహాసభల ఆహ్వాన కమిటీ అధ్యక్షులు జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ.. నల్లగొండలో ఏఐకేఎస్ మహాసభల సందర్భంగా అగ్రిషోను శనివారం నాడు మంత్రులు ప్రారంభిస్తారని తెలిపారు. నల్లగొండ వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట పురిటిగడ్డ అనీ, ఆ పోరాటం ద్వారా పేదలకు 10 లక్షల ఎకరాలను కమ్యూనిస్టులు పంచారని గుర్తుచేశారు. ఆ పోరాటంలో 4,500పైగా అమరులయ్యారనీ వివరించారు. నల్లగొండ జరిగే ఏఐకేఎస్ జాతీయ మహాసభలు భవిష్యత్తు పోరాటాలకు వేదికగా నిలుస్తుందని ఆకాంక్షించారు. మహాసభల జయప్రదం కోసం రాష్ట్రంలో లక్షలాది కుటుంబాలను కలిశామనీ, ఒక్క ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే రెండు లక్షల కుటుంబాలను కలిసి మహాసభల ఆవశ్యకతను చెప్పామని తెలిపారు. పూర్తిగా రైతుల ఆర్థిక సహకారంతోనే మహాసభలను జయప్రదం చేయాలనే నిర్ణయం తీసుకున్నామనీ, ఆ మేరకు రైతులు కూడా సహకరించారని చెప్పారు.
తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్ మాట్లాడుతూ..రాష్ట్రంలో 25 లక్షల కౌలు రైతులు 30 శాతానికిపైగా భూమిని సాగు చేస్తున్నారనీ, కరువు నేపథ్యంలో వారిని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వారికి రుణార్హత కార్డులిప్పించాలని కోరారు. వాస్తవ సాగుదారులకు రైతు భరోసా వర్తించేలా విధానపర నిర్ణయం తీసుకోవాలని విన్నవించారు. అటవీ హక్కుల చట్టం కింద పోడు సాగుదారులకు వెంటనే హక్కు పత్రాలివ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అభివృద్ధి పేరిట రైతుల నుంచి సేకరిస్తున్న భూములకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని కోరారు. కరువు, వర్షాలు వచ్చినప్పుడు హడావిడి చేయకుండా వ్యవసాయ సాగుపై సమగ్ర పాలసీ రూపొందించాలని డిమాండ్ చేశారు. ప్రత్యామ్నాయ పంటలను సాగుచేయాలని ప్రభుత్వం చెబితే సరిపోదనీ, ఆ పంటలు సాగు చేసే రైతుల నుంచి పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేస్తామనే హామీని ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎల్‌నినో నేపథ్యంలో రాష్ట్ర మంతటికీ ఒకే పద్ధతిలో కాకుండా జిల్లాలు, నియోజకవర్గాల వారీగా సమగ్ర ప్రణాళిక రూపొందించి ముందుకెళ్లాలని సూచించారు. తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కోశాధికారి ఎం.శోభన్, ఉపాధ్యక్షులు పి.జంగారెడ్డి, సహాయకార్యదర్శి ఉడత రవీందర్ పాల్గొన్నారు.





కామెంట్లు (0)