Magazines

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు గడువు పొడిగింపు

46 నిమిషాల క్రితం

MLC
avatar
balaji

ప్రచురించబడింది నవం 03, 2026 | 2 నిమిషాల చదవడం

నామినేషన్‌ ‌దాఖలు వరకు అవకాశం : తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు దరఖాస్తు గడువు పొడిగిస్తున్నట్టు తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డి తెలిపారు. అర్హులైన గ్రాడ్యుయేట్లు ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లు దాఖలు చేసే చివరి రోజు వరకు తమ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. గత కొన్ని రోజులుగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు ప్రక్రియ నిలిచిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ఈ నెల 25న ముసాయిదా ఓటర్ల జాబితా వెలువరిస్తామన్నారు. ఆ రోజు నుంచి డిసెంబర్‌ 10 వరకు అభ్యంతరాలను స్వీకరించి డిసెంబర్‌ 30‌న తుది ఓటర్ల జాబితాను ప్రచురిస్తామని పేర్కొన్నారు. ఓటు రిజిస్ట్రేషన్ ఇలా... ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి అధికారిక వెబ్‌సైట్ ceotelangana.nic.inను సందర్శించాలి. హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్‌ ‌రిజ్రిస్టేషన్‌ ఫాం-18 ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అడిగిన వ్యక్తిగత, విద్యా వివరాలను తప్పులు లేకుండా నమోదు చేయాలి. డిగ్రీ సర్టిఫికెట్ లేదా ప్రొవిజనల్ కాపీ, ఆధార్ కార్డ్, అడ్రస్ ప్రూఫ్ స్కాన్ చేసిన ప్రతులను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలి. ఆన్‌లైన్ సబ్‌మిషన్ పూర్తయిన తర్వాత వచ్చిన అప్లికేషన్ ప్రింట్ అవుట్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, దానికి అవసరమైన సర్టిఫికేట్ల నకళ్లను జతచేసి స్థానిక ఎన్నికల అధికారులకు సమర్పించాలి.

ఆఫ్‌లైన్ ఇలా......

ఆఫ్‌లైన్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. జిల్లా కలెక్టరేట్లు, ఆర్‌డీఓ, తహసీల్దార్ కార్యాలయాల వద్ద ఉచితంగా లభించే ఫారం-18 పత్రాలను తీసుకోవాలి. ఫారాన్ని పూర్తిగా నింపి దానితో పాటు గెజిటెడ్ అధికారితో ధ్రువీకరించిన డిగ్రీ, ఆధార్, రెసిడెన్స్ సర్టిఫికేట్ల జిరాక్స్‌లను జతచేయాలి. ఈ పత్రాలను నేరుగా సంబంధిత కార్యాలయాల్లో అందజేయవచ్చు లేదా పోస్టు ద్వారా అధికారులకు పంపవచ్చు.

స్టేటస్ ఇలా..

అధికారిక పోర్టల్ ceotserms2.telangana.gov.in లింక్‌పై క్లిక్ చేయాలి. వెబ్‌సైట్ హోమ్ పేజీ ఓపెన్ అయిన తర్వాత స్క్రీన్‌పై కనిపించే ఫాం-18 వద్దకు వెళ్లాలి. దరఖాస్తు చేసుకున్న సమయంలో వచ్చిన అప్లికేషన్ ఐడీని బాక్స్‌లో నమోదు చేయాలి. ఆ తర్వాత కింద ఉండే గెట్ అప్లికేషన్‌ ‌స్టేటస్‌ అనే బటన్‌ మీద క్లిక్ చేయాలి. వెంటనే మీ దరఖాస్తుకు సంబంధించిన వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. స్క్రీన్‌పై కరెంట్ స్టేటస్ అనే విభాగాన్ని పరిశీలిస్తే.. మీ అప్లికేషన్ ఏ దశలో ఉందో తెలుస్తుంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్