Magazines

ఒడిశా నుంచి ముంబయికి గంజాయి అక్రమ రవాణా

1 గంట క్రితం

ganja
avatar
balaji

ప్రచురించబడింది నవం 08, 2026 | 2 నిమిషాల చదవడం

ఇద్దరు నిందితుల అరెస్ట్‌.. పరారీలో మరో ఇద్దరు

రూ.30 గంజాయి స్వాధీనం


నవతెలంగాణ–నాగోల్‌ ​
ఒడిశా నుంచి హైదరాబాద్ మీదుగా ముంబయికి గంజాయిని అక్రమంగా తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను ఎల్బీనగర్ జోన్ ఎస్‌ఓటీ, పోచారం ఐటీ కారిడార్ పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారు. ఈ దాడిలో 60 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ సుమారు రూ.30 లక్షలు ఉంటుంది. ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్న‌ట్టు పోలీసులు వెల్లడించారు. ఎల్బీనగర్ డీసీపీ కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో డీసీపీ డాక్టర్ బి.అనురాధ కేసు వివరాలను వెల్లడించారు. చాంద్రాయణగుట్ట హఫీజ్‌బాబానగర్‌కు చెందిన సమా మహ్మద్ అమెర్ చికెన్ వ్యాపారం చేస్తుండగా, తూర్ కాలనీకి చెందిన మహ్మద్ ఇమ్రాన్ ఉద్దీన్ అలియాస్ ఇమ్రాన్ అలియాస్ జిద్దీ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వీరిద్దరిపై గతంలో పలు పోలీస్ స్టేషన్లలో ఎన్డీపీఎస్ సహా ఇతర కేసులు నమోదయ్యాయి. అమెర్‌పై కంచన్‌బాగ్, చౌటుప్పల్, నార్సింగి, ఛత్రినాక, షాహలీబండ పోలీస్ స్టేషన్లలో ఐదు ఎన్డీపీఎస్ కేసులు ఉండగా, గతంలో పీడీ యాక్ట్ కింద కూడా జైలుకు వెళ్లాడు.

ఇమ్రాన్‌పై గోల్కొండ, మైలార్‌దేవ్‌పల్లి, చౌటుప్పల్, బండ్లగూడ పోలీస్ స్టేషన్లలో నాలుగు కేసులు ఉన్నాయి. వీరిద్దరూ ఒడిశాకు చెందిన పూర్ణచంద్ర మహాపాత్ర వద్ద కిలో గంజాయిని రూ.7 వేల చొప్పున కొనుగోలు చేసి మహారాష్ట్రలోని ముంబయికి తరలించేవారు. అక్కడ యాస్మిన్ చంద్ నయ్యద్ అలియాస్ చంద్ భాయ్‌కు కిలో రూ.15 వేల చొప్పున విక్రయిస్తూ వ్యాపారం సాగిస్తున్నారు. ఇప్పటికే రెండుసార్లు ఇదే తరహాలో గంజాయిని ముంబయికి తరలించినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ క్రమంలో ఒడిశా నుంచి మారుతీ సుజుకీ కారులో గంజాయిని తరలిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారంతో ఎల్బీనగర్ జోన్ ఎస్‌ఓటీ బృందం, పోచారం ఐటీ కారిడార్ పోలీసులు సంయుక్తంగా ఘట్‌కేసర్ మండలం అన్నోజిగూడ గ్రామ శివారులోని మసాలా కంపెనీ వద్ద వాహన తనిఖీలు చేపట్టారు.


శనివారం ఉదయం 11.30 గంటల సమయంలో అనుమానాస్పదంగా వస్తున్న కారును అడ్డుకుని తనిఖీ చేయగా, వెనుక సీటు భాగంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రహస్య క్యాబిన్‌లో 60 ప్యాకెట్లుగా భద్రపరిచిన 60 కిలోల గంజాయి బయటపడింది. గంజాయిని స్వాధీనం చేసుకుని అమెర్, ఇమ్రాన్‌ను అరెస్టు చేశారు. కారు, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్‌కు తరలించారు. మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలపై మల్కాజిగిరి కమిషనరేట్ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారని డీసీపీ తెలిపారు. గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాల సరఫరా, వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని, సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఎస్‌ఓటీ డీసీపీ మనోహర్, అడిషనల్ డీసీపీ షకీర్ హుస్సేన్, ఉప్పల్ జోన్ అడిషనల్ డీసీపీ ఎన్. వెంకటరమణ, మేడిపల్లి ఏసీపీ మోహన్ కుమార్, పోచారం ఐటీ కారిడార్ ఇన్‌స్పెక్టర్ జగన్నాథ్, ఎస్‌ఓటీ ఇన్‌స్పెక్టర్ ప్రతాప్‌రెడ్డి ఉన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్