Magazines

వివాదాలకు కేంద్రంగా ఇంటర్ బోర్డు

51 నిమిషాల క్రితం

Intermediate Board at the center of controversies
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 05, 2026 | 3 నిమిషాల చదవడం

చుట్టుముట్టిన నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారం

సీరియల్ ను తలపిస్తున్న ఆరోపణలు, ప్రత్యారోపణలు

ఈ వివాదాలకు ఫుల్ స్టాప్ పడేనా?

​నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్

బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ను, ఇంటర్మీడియట్ విద్యా కమిషనరేట్ ను నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారం ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. ఒప్పంద జూనియర్ లెక్చరర్ల క్రమబద్దీకరణ క్రమంలో కొంత మంది నకిలీ సర్టిఫికెట్లను సమర్పించారనే ఆరోపణలు, వారిలో కొందరిని తొలగించడం, దానిపై వారు కోర్టుకెళ్లడం, కోర్టు ఉత్తర్వులతో తిరిగి వారిని విధుల్లోకి తీసుకోవాల్సి వచ్చింది. నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారంపై వారిని తొలగించే ముందు సరైన ప్రొసీజర్ ను అనుసరించలేదని కోర్టు తొలగింపును వ్యతిరేకించింది. అదే సమయంలో ప్రయివేటు జూనియర్ కాలేజీలు కొన్ని నకిలీ ఫైర్ ఎన్వోసీలను సమర్పించాయని బోర్డు తెలిపిన దానిపై ప్రయివేటు జూనియర్ కాలేజీల యాజమాన్యాల సంఘం తీవ్రంగా మండిపడింది. దీంతో బోర్డు దానిపైన పెద్ద ఎత్తున వివరణను ఇచ్చింది. మరోవైపు విద్యా సంవత్సరం ప్రారంభమై ఐదు నెలలు గడుస్తున్నా ఆయా కాలేజీలకు అఫిలియేషన్ ఇచ్చే విషయంలో మీమాంశ కొనసాగుతూనే ఉంది. సరైన సర్టిఫికెట్లు సమర్పించిన వారందరికి అఫిలియేషన్లు ఇచ్చామనీ, మిగిలిన వారు సమర్పించకపోవడంతోనే సమస్య వస్తున్నదని బోర్డు అధికారులు చెబుతున్నారు. అయితే బోర్డు అమలు చేస్తున్న పలు నిబంధనలు అమలుకు సాధ్యం కాకుండా ఉన్నాయని యాజమాన్యాలు ఆక్షేపిస్తున్నాయి. వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని తాజా నిబంధనలను అనుసరించాలని కోరుతున్నారు.

2023లో క్రమబద్దీకరణ సమయంలో కొంత మంది ఒప్పంద జూనియర్ లెక్చరర్లు సరైన అర్హత పత్రాలు సమర్పించలేదని విచారణలో నిర్దారించింది. ఇంటర్మీడియట్ విద్యా కమిషనరేట్ పరిధిలో ఉండే ఈ అంశంపై విచారణ జరిపినా సమస్య కొలిక్కి రాలేదు. విచారణ అనంతరం పదుల సంఖ్యలో రెగ్యులర్ జూనియర్ లెక్చరర్లను తొలగించింది. దీనిపై వారు కోర్టును ఆశ్రయించగా, తొలగించే ముందు చేపట్టాల్సిన విధానం సరిగ్గా లేదని న్యాయస్థానం అభిప్రాయపడింది. దీంతో కథ మొదటికొచ్చింది. అదే సమయంలో వందల సంఖ్యలో రెగ్యులర్ అయిన వారందరిపై ఆరోపణలు వస్తే బోర్డు కొంత మందిపైనే మొక్కుబడిగా చర్యలు తీసుకుందనే ఆరోపణలు వినిపించాయి. అదే సమయంలో రెగ్యులర్ అయిన లెక్చరర్లు అందరూ సరైన పత్రాలతోనే క్రమబద్దీకరించబడినప్పటికీ కేవలం ఆరోపణల ఆధారంగా బోర్డు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నదనే వాదన కూడా బలంగా ముందుకొచ్చింది. విద్యార్జనలో పిల్లలకు కీలకంగా భావించి ఇంటర్ విద్య విషయంలో నకిలీ, అసలు లెక్చరర్ల విషయంలో బోర్డు స్పష్టతనివ్వాల్సిన అవసరముంది. అనవసర ఆరోపణలు, ప్రత్యారోపణలకు తావు లేకుండా లెక్చరర్ల అర్హతల విషయంలో సాధ్యమైనంత తొందరగా విచారించి ఈ వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టాలని విద్యావేత్తలు సూచిస్తున్నారు.

ప్రయివేటు జూనియర్ కాలేజీలకు అఫిలియేషన్ కు సంబంధించి కూడా బోర్డుపై తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. కేవలం కార్పొరేట్ కాలేజీలకు కొమ్ము కాసేందుకు తమను లక్ష్యంగా చేసుకున్నారని ఆ కాలేజీల యాజమాన్యాల సంఘం ఆరోపించింది. దీనిపై ఇంటర్ బోర్డు సుదీర్ఘమైన వివరణను ఇచ్చింది. నకిలీ ఫైర్ ఎన్ఓసీల విషయంలోనూ బోర్డు, యాజమాన్యాల సంఘాలు పరస్పరం విరుద్ధ ప్రకటనలు విడుదల చేయడంతో గందరగోళం నెలకొంది. గతంలో జీహెచ్ఎంసీ పరిధిలోని నిబంధనల మేరకు కొన్ని ప్రయివేటు జూనియర్ కాలేజీల యాజమాన్యాలు సమర్పించామనీ, నూతనంగా వచ్చిన హైడ్రా నిబంధనలపై అవగాహన లేకపోవడమే కారణమని యాజమాన్యాల సంఘం సమర్థించుకుంది. దీంతో హోర్డు హుటాహుటీన రెండు రోజుల పాటు జూనియర్ లెక్చరర్లకు నిబంధనలకు ఆన్ లైన్ వర్క్ షాప్ నిర్వహించింది. అయితే విద్యా సంవత్సరం ప్రారంభమై ఐదు నెలల తర్వాత కూడా వివాదాలు కొనసాగుతుండటం పట్ల విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటన్నింటికి ఫుల్ స్టాప్ పడేలా పటిష్టమైన ప్రణాళికతో చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ప్రశాంత వాతావరణంలో విద్యాబోధన సాగాల్సిన సమయంలో ఇలాంటి అంశాలు తెరపైకి రావడం పట్ల విచారం వ్యక్తమవుతోంది.

​కార్పొరేట్ల మాయాజాలం .. ఒకే పేరుతో అనేక బ్రాంచీలు

పలు కార్పొరేట్ విద్యా సంస్థలకు చెందిన కళాశాలలు ఒక బ్రాంచీ కోసం అనుమతి తీసుకుని అనధికారికంగా పలు బ్రాంచీలను నడుపుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి. వీటి పట్ల బోర్డు కఠిన చర్యలు తీసుకోవడం లేదని ప్రయివేటు కాలేజీల యాజమాన్యాలు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు మండిపడుతున్నారు. దీంతో బోర్డు రూ.4 కోట్లు కార్పొరేట్ కాలేజీల నుంచి వసూలు చేసినట్టు వివరణనిచ్చింది. అయితే కార్పొరేట్ కాలేజీలు, బ్రాంచీలకు అనుమతులు, వాటిలో ఫీజుల వసూలు, లెక్చరర్ల విద్యార్హతలు అన్నింటిపై సమగ్ర విచారణ చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ లోని మాదాపూర్ ప్రాంతంలో

పదుల సంఖ్యలో కార్పొరేట్ కాలేజీల బ్రాంచీలు కొనసాగుతున్న వ్యవహారంపై నిగ్గు తేల్చాలని వారు కోరుతున్నారు.

​


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్