హైవేపై రోడ్డు పక్కన నిలిపిన వాహనాలే టార్గెట్
మహారాష్ట్రకు చెందిన ముగ్గురు నిందితుల అరెస్ట్
పరారీలో మరో నిందితుడు..గాలింపునకు చర్యలు వివరాలు వెల్లడించిన : సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్
నవతెలంగాణ-సంగారెడ్డి
జాతీయ రహదారిపై దోపిడీ చేస్తున్న అంతరాష్ర్ట దారిదోపిడీ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ వివరాలను శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ వెల్లడించారు. మహారాష్ట్రలోని లాతూర్, పూణే, బారామతి ప్రాంతాలకు చెందిన నిందితులు ఒక ముఠాగా ఏర్పడి రాత్రి సమయాల్లో జాతీయ రహదారులపై వెళ్తూ, అత్యవసరాలకై రోడ్డు పక్కన ఒంటరిగా నిలిపి ఉంచిన కార్లను లక్ష్యంగా చేసుకొని దారి దోపిడీకి పాల్పడుతున్నట్టు తెలిపారు. తమ ద్విచక్ర వాహనాన్ని కొంత దూరంలో నిలిపి, ముఖాలు గుర్తుపట్టకుండా మంకీ క్యాప్‌లు ధరించి కార్ల వద్దకు వెళ్లేవారన్నారు. తమ వెంట తెచ్చుకున్న నకిలీ తుపాకీ, కత్తులతో కార్లలో ఉన్న వ్యక్తులను బెదిరించి వారి వద్ద ఉన్న బంగారు ఆభరణాలు, నగదును బలవంతంగా దోచుకుని, అనంతరం ద్విచక్ర వాహనంపై మహారాష్ట్రలోని లాతూర్ ప్రాంతానికి పారిపోయారన్నారు. ఏ1 హసన్ సమీర్ షేక్, ఏ2. సంతోష్ సెగర్ ధగుడు , ఏ3. నౌషాద్ జాకీర్ సయ్యద్ , ఏ4. రఫీక్ షంషోద్దీన్ షేక్ దోపిడీలకు పాల్పడ్డారన్నారు. అక్టోబర్ 17వ తేదీన రాత్రి సమయంలో చిరాగ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్ హెచ్ -65 జాతీయ రహదారిపై రోడ్డు పక్కన నిలిపి ఉంచిన కారులోని వ్యక్తులను నిందితులు నకిలీ తుపాకీ, కత్తులతో బెదిరించి రెండు బంగారు గాజులు, బంగారు పుస్తెల తాడు, బంగారు డైమండ్ నెక్లెస్, ఉంగరం, రూ.2,500 నగదును దోచుకున్నారు. అక్టోబర్ 25వ తేదీన అర్ధరాత్రి సమయంలో సదాశివపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్ హెచ్ -65 జాతీయ రహదారిపై ఆరూరు గ్రామ శివారులో నిలిపి ఉంచిన కారులోని వ్యక్తులను బెదిరించి బంగారు ఆభరణాలు, నగదును దోచుకున్నారు. అదే రోజు కోహీర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి 3:20గంటల సమయంలో మరో కారును లక్ష్యంగా చేసుకొని అందులోని వ్యక్తులను ఆయుధాలతో బెదిరించి బంగారు ఆభరణాలు, నగదును దోచుకొని పారిపోయారు. అదే విధంగా కర్నాటక రాష్ర్టం బీదర్ జిల్లా హుమ్నాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్టోబర్ 22, 23వ తేదీ అర్ధరాత్రి హుమ్నాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఇదే తరహాలో దారి దోపిడీకి పాల్పడినట్టు విచారణలో వెల్లడైందన్నారు. నిందితుల నుంచి నీలం రంగు యమహా బైక్, నకిలీ ఎయిర్ ఫిస్తల్, కొబ్బరిబొండం నరికే కత్తి, చెక్కపిడితో ఉన్న మరో కత్తి, మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్మానుష్య ప్రాంతాల్లో వాహనాలను నిలిపి ఉంచరాదని ఎస్పీ సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో వాహనాలను నిలిపి ఉంచాల్సి వస్తే పెట్రోల్ బంకులు, దాబాలు, హోటళ్లు వంటి జనసంచారం ఉండే సురక్షిత ప్రాంతాల్లోనే పార్కింగ్ చేయాలని, వాహనాలు బ్రేక్‌డౌన్, టైర్ పంక్చర్ లేదా ఇతర అత్యవసర సహాయం అవసరమైనప్పుడు వెంటనే డయల్ 112 లేదా జాతీయ రహదారి పెట్రోలింగ్ టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలని సూచించారు. ఈ కేసులను ఛేదించడంలో సమర్థవంతంగా పనిచేసిన సీసీఎస్, జహీరాబాద్ సబ్ డివిజన్, సదాశివపేట పోలీసు అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.







కామెంట్లు (0)