గోడకు కన్నం వేసి లోపలికి చొరబాటు
జగదాంబ జ్యువెలరీలో ఘటన
నవతెలంగాణ-మేడ్చల్
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడ్చల్ పట్టణంలోని ప్రముఖ జగదాంబ జ్యువెలరీలో మరోసారి చోరీ జరిగింది. అర్ధరాత్రి దుకాణం గోడకు కన్నం వేసి లోపలికి చొరబడిన దుండగులు విలువైన బంగారు, వెండి ఆభరణాలతోపాటు నగదును అపహరించుకెళ్లారు. యజమాని ఆదివారం దీపావళి పూజలు నిర్వహించి, దుకాణం మూసేసి వెళ్లారు. సోమవారం దుకాణం తెరవలేదు. మంగళవారం ఉదయం యజమాని దుకాణం తీసి చూడగా లోపల చెక్క తలుపు విరిగి ఉంది. కంగారుగా లోపలికి వెళ్లి చూడగా వెనుక ఉన్న గోడకు పెద్ద కన్నం వేసి ఉంది. దుండగలు వెనుక వైపు నుంచి దుకాణానికి కన్నం వేసి లోపలికి ప్రవేశించారు. అడ్డుగా ఉన్న చెక్క తలుపు సగం వరకు తొలగించి, నగలు విక్రయించే గదిలోకి వచ్చారు. వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మేడ్చల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీమ్ నిపుణులు వేలిముద్రలు, ఇతర ఆధారాలను సేకరించారు. దుకాణంలో ఎంత మేర సొత్తు అపహరణకు గురైందనే వివరాలను యజమానుల నుంచి సేకరించారు. పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తూ దొంగల కదలికలను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. అనుమానితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పోలీస్‌స్టేషన్‌కు కూత వేటు దూరంలోనే ఈ ఘటన చోటుచేసుకోవడంతో స్థానికంగా కలకలం రేగింది. ఈ చోరీలో సుమారు 250 గ్రాముల బంగారం, 8.5 కిలోల వెండి ఆభరణాలు, రూ.4 లక్షల నగదు అపహరణకు గురైనట్టు ప్రాథమిక సమాచారం. కాగా, ఈ బంగారం దుకాణంలో చోరీ జరగడం ఇది రెండోసారి అని తెలిసింది.







కామెంట్లు (0)