ఐద్వా రాష్ట్ర కమిటీ పిలుపు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) 36వ మహాసభలను జయప్రదం చేయాలని ఐద్వా రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. సోమవారం హైదరాబాద్ లోని వీరనారి ఐలమ్మ భవనంలో రాష్ట్ర అధ్యక్షురాలు అరుణజ్యోతి అధ్యక్షతన రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి మాట్లాడూతూ ఏఐకేఎస్ ఈనెల 18 నుంచి 21 వరకు నల్లగొండలో ఈ జాతీయ మహాసభలు జరగనున్నాయని తెలిపారు. 15న లక్ష మందితో భారీ ప్రదర్శన, బహిరంగ సభ నల్లగొండలో జరుగుతాయని వివరించారు. గత మూడు సంవత్సరాల కాలంలో దేశవ్యాప్తంగా రైతులు ఎదుర్కొన్న సమస్యలు, రైతాంగం నిర్వహించిన పోరాటాలు, సాధించిన విజయాలు, ఎదురైన సవాళ్లపై ఈ మహాసభల్లో సమగ్రంగా చర్చించి, భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోనున్నారని ఆమె చెప్పారు.
రైతులు పండించిన అన్ని పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధమైన హామీ కేంద్ర ప్రభుత్వం కల్పించాలని, రైతు వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలని, విద్యుత్ ప్రయివేటీకరణ, వ్యవసాయ రంగ కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా రైతాంగం పెద్ద ఎత్తున్న పోరాటం చేస్తున్నారని మల్లు లక్ష్మి తెలిపారు. తెలంగాణలో సాగునీరు, భూమి, రైతు రుణమాఫీ, పంటలకు గిట్టుబాటు ధరలు, ఎరువులు, విత్తనాల సరఫరా వంటి సమస్యల పరిష్కారం కోసం రైతాంగం చేస్తున్న పోరాటాలకు ఐద్వా అండగా ఉంటుందని చెప్పారు. రైతుల సమస్యలు కేవలం వ్యవసాయ రంగానికే పరిమితం కావని స్పష్టం చేశారు.అవి మహిళల జీవన పరిస్థితులతో కూడా ముడిపడి ఉన్నాయన్నారు. వ్యవసాయ కుటుంబాల్లో మహిళలు శ్రమలో కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ వారికి తగిన గుర్తింపు, హక్కులు, ఆర్థిక భద్రత లభించడం లేదు. గ్రామీణ మహిళలు ఉపాధి, ఆదాయం, ఆహార భద్రత, ఆరోగ్యం వంటి అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, నిరుద్యోగం, పేదరికం, మహిళలపై హింస, సామాజిక అసమానతలు ప్రజల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని మల్లు లక్ష్మి తెలిపారు. మరోవైపు మతతత్వ, కార్పొరేట్ అనుకూల విధానాలు ప్రజల ఐక్యతకు, ప్రజాస్వామ్య హక్కులకు విఘాతం కలిగిస్తున్నాయనీ,ఈ పరిస్థితుల్లో రైతాంగం, కార్మికులు, మహిళలు ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని ఆమె గుర్తుచేశారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తితో సాగుతున్న రైతాంగ ఉద్యమానికి మహిళా సంఘంగా ఐద్వా సంపూర్ణ సంఘీభావం తెలియజేస్తోందన్నారు. రైతుల హక్కుల కోసం, వ్యవసాయ రంగ పరిరక్షణ కోసం, ప్రజల జీవనోపాధిని కాపాడటం కోసం జరిగే పోరాటాలకు మహిళలు పెద్ద సంఖ్యలో మద్దతుగా నిలవాలని కోరారు. ఏఐకేఎస్ మహాసభల జయప్రదానికి రైతులు, వ్యవసాయ కార్మికులు, మహిళలు, యువకులు, ప్రజాస్వామిక శక్తులు తరలి రావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఐద్వా సీనియర్ నాయకురాలు టి. జ్యోతి, రాష్ట్ర కోశాధికారి మాచర్ల భారతి, ఐద్వా సహాయక కార్యదర్శులు కెఎన్. ఆశాలత, బుగ్గవీటి సరళ, కె. నాగలక్ష్మి, బట్టుపల్లి అనూరాధ, వై.వరలక్ష్మి, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పి.శశికళ తదితరులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)