Magazines

మహిళల భద్రతకు 
పురుషులూ బాధ్యత వహించాలి

49 నిమిషాల క్రితం

Men, too, must take responsibility for women's safety.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 27, 2026 | 2 నిమిషాల చదవడం

వేధింపులను చూస్తూ మౌనంగా ఉండొద్దు :
‘స్టాండ్‌ విత్‌ హర్‌’ శిక్షణ కార్యక్రమం లో 
సీఐ‌డీ డీజీ చారు సిన్హా పిలుపు

నవతెలంగాణ- ప్రత్యేక ప్రతినిధి

మహిళలపై వేధింపులు, వివక్ష, లింగ ఆధారిత హింసను అరికట్టడంలో పురుషులు, బాలురు క్రియాశీలక పాత్ర పోషించాలని హెచ్‌సీయూ పూర్వ విద్యార్థిని, తెలంగాణ పోలీస్‌ మహిళా భద్రతా విభాగం డీజీ చారుసిన్హా పిలుపునిచ్చారు. వేధింపులను చూస్తూ మౌనంగా ఉండటం కూడా వాటిని ప్రోత్సహించడమేనని స్పష్టం చేశారు. మహిళల భద్రతను సమాజమంతా ఉమ్మడి బాధ్యతగా స్వీకరించాల‌ని తెలిపారు. సోమవారం హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ) సామాజిక శాస్త్రాల విభాగంలో ‘స్టాండ్‌ విత్‌ హర్‌’ ప్రచారంలో భాగంగా రెండు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. తెలంగాణ పోలీసు మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో రుబరూ బృందం, విశ్వవిద్యాలయ మహిళా అధ్యయన కేంద్రం సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మహిళల భద్రత కోసం చేపట్టిన సేఫ్‌ మొబిలిటీ కార్యక్రమంలో ఫిర్యాదుల నమోదు తక్కువగా ఉండటంతో వేధింపుల పట్ల సమాజంలో నెలకొన్న ధోరణులపై లోతుగా పరిశీలించాల్సి వచ్చిందని తెలిపారు. అనుచిత ప్రవర్తనను సాధారణంగా తీసుకునే పరిస్థితులను మార్చాలనే ఉద్దేశంతో ‘స్టాండ్‌ విత్‌ హర్‌’ కార్యక్రమాన్ని రూపొందించినట్టు వివరించారు. ఈ ఏడాది మార్చిలో ప్రారంభించిన ఈ ఏడాది పొడవునా సాగే ప్రచారంలో పురుషులు, బాలురను భాగస్వాములను చేయడమే లక్ష్యమన్నారు. పితృస్వామ్య భావజాలం, ఆన్‌లైన్‌ వేధింపులు, లింగ వివక్షపై ప్రతి ఒక్కరూ ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. బాలురు, పురుషులపై కఠినమైన పురుషత్వ భావనలు భావోద్వేగాలను వ్యక్తం చేయకుండా అడ్డుకుంటున్నాయని పేర్కొన్నారు. పరస్పర గౌరవం, సానుభూతి, సమానత్వంతో కూడిన వాతావరణాన్ని నిర్మించినప్పుడే మహిళలకు సురక్షితమైన సమాజం సాధ్యమవుతుందని చెప్పారు. మహిళల భద్రత, గౌరవం, సమానత్వం కోసం పని చేసే శిక్షణ పొందిన వ్యక్తుల నెట్‌వర్క్‌ను నిర్మించాలని మహిళా భద్రతా విభాగం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు.

ఇండ్ల నుంచే సమానత్వం మొదలవ్వాలి

ఇండ్లలోనూ అసమానతలను ప్రశ్నించాలని సామాజిక శాస్త్రాల విభాగం డీన్‌ ప్రొఫెసర్‌ కె. సునీతారాణి అన్నారు. సమాజంలోని అన్ని వ్యవస్థల్లో ప్రజాస్వామిక విలువలను కోరుకునే మనం ఇంట్లో మాత్రం అసమానతలను ఎందుకు సహజంగా తీసుకుంటున్నామని ప్రశ్నించారు. కుటుంబ సంబంధాల్లోనూ సమాన బాధ్యత, పరస్పర గౌరవం ఉండాలని పేర్కొన్నారు. ప్రారంభ కార్యక్రమంలో మహిళా భద్రతా విభాగం శిక్షణ, కంటెంట్‌ అభివృద్ధి విభాగం అధిపతి ఆసియా షెర్వాణి, విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్‌ జె. అనురాధ, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ దేవేశ్‌ నిగమ్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్