కనీస వేతనం రూ.42 వేలుగా నిర్ణయించాలి
సెంట్రల్ లేబర్ కమిషనరేట్ వద్ద ధర్నాలో సీఐటీయూ ఉపాధ్యక్షులు ఎస్.వీరయ్య
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేంద్ర ప్రభుత్వం కనీస వేతనాల జీవోలను సవరించాలనీ, కనీస వేతనం రూ.42 వేలుగా నిర్ణయించాలని సీఐటీయూ డిమాండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్ లోని డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ (సెంట్రల్) కార్యాలయం వద్ద ఆ సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కార్యక్రమానికి సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి బి.మధు అధ్యక్షత వహించగా, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.వీరయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ధర్నానుద్దేశించి వీరయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 2017 జనవరి 19న కనీస వేతనాలను సవరించిందని తెలిపారు. కనీస వేతన చట్టం ప్రకారం ఐదేండ్లకు ఒకసారి వేతన సవరణలు జరగాల్సి ఉందని చెప్పారు. అయినప్పటికీ 2022 జనవరి 19న జరగాల్సిన కనీస వేతనాలను నాలుగేండ్లుగా సవరించకుండా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. దీంతో అన్ని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, విభాగాలు, రైల్వేలు, బ్యాంకులు, ఆయిల్ పరిశ్రమల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు చాలీ చాలని వీడీఏ తప్ప వేతనాలు పెరగడం లేదని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం నియమించిన 7వ వేతన కమిషన్ కనీస వేతనం రూ.18 వేలుగా 2016లోనే నిర్ణయించినప్పటికీ మోడీ ప్రభుత్వం ఫ్లోర్ లెవెల్ మినిమం వేజ్ అంటూ రోజుకు రూ.176లుగా ప్రకటించడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ చట్ట ప్రకారం కనీస వేతనాలను సవరించకుండా శ్రమ దోపిడీకి గురి చేస్తున్నదని చెప్పారు.భారీగా పెరుగుతున్న ధరలు, పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా రూ.42 వేలుగా కనీస వేతనాలను సవరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యజమానుల లాభాలపై లేని సీలింగ్ కార్మికుల పీఎఫ్, ఈఎస్ఐ, బోనస్‌లపై సీలింగ్‌లను నిర్ణయించడం సరైంది కాదని తప్పుపట్టారు. దీంతో రూ.15 వేలు వేతనం దాటిన కార్మికులు పీఎఫ్ పై నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రూ.21 వేలు వేతనం దాటిన కార్మికులకు ఈఎస్ఐ అమలు, బోనస్ చెల్లింపులను నిలిపివేయడం అన్యాయమని విమర్శించారు.
బోనస్, ఈఎస్ఐపై సీలింగ్‌ను సవరించకపోవడం అన్యాయం : బి. మధు
బోనస్ పై 2014 ఏప్రిల్ 1న, ఈఎస్ఐపై 2014 సెప్టెంబర్ 1న సీలింగ్ నిర్ణయించి నేటి వరకు సవరించకపోవడం అన్యాయమని బి. మధు విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీఎఫ్ పై సీలింగ్‌ను కంటితుడుపు చర్యగా సవరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం యజమానులకు అనేక రాయితీలను ప్రకటిస్తుందని తెలిపారు. పీఎఫ్ లో యజమాని వాటాలను కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తూ కార్మికుల కనీస వేతనాలను మాత్రం సవరించడం లేదనీ, కార్మికులకు ప్రయోజనం కలిగే విధంగా పీఎఫ్, బోనస్‌లపై సీలింగ్‌ను ఎత్తివేయడం లేదని మండిపడ్డారు.
పీఎఫ్, ఈఎస్ఐ హక్కులే .. : ఎం. వెంకటేష్
బోనస్ అంటే వాయిదా పడిన వేతనం అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందని ఎం. వెంకటేష్ గుర్తుచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీఎఫ్ కార్మికుల భవిష్యత్తు కోసమనీ, ఈఎస్ఐ ఆరోగ్య సంక్షేమం కోసం ఇచ్చే హక్కులే తప్ప అవి యాజమాన్యాల భిక్ష కాదని తెలిపారు. వీటిని అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలు, యాజమాన్యాల మీద ఉందన్నారు. అమలు చేయని యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ధర్నానుద్దేశించి సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శులు జె.వెంకటేశ్, హైదరాబాద్ సెంట్రల్ సిటీ కార్యదర్శి జె.కుమార స్వామి, హైదరాబాద్ సౌత్ జిల్లా కార్యదర్శి ఎం.శ్రావణ్ కుమార్, బీఎస్ఎన్ఎల్ నాయకులు రాఘవేంద్ర, నాయకులు ఎస్‌ఎస్‌ఆర్‌ఏ ప్రసాద్ తదితరులు ప్రసంగించారు. ధర్నా అనంతరం సీఐటీయూ ప్రతినిధి బృందం డీసీఎల్ (సెంట్రల్)కు వినతిపత్రం అందజేసింది. కనీస వేతనాల జీవోలను సవరించాలనీ, కనీస వేతనం రూ.42 వేలుగా నిర్ణయించాలనీ, పీఎఫ్, ఈఎస్ఐ, బోనస్ లపై సీలింగ్ లను ఎత్తివేసి అందరికీ ఈఎస్ఐ అమలు చేసి బోనస్ చెల్లించాలని కోరింది.






కామెంట్లు (0)